breaking news
garbage city
-
గార్డెన్ సిటీ 'గార్బేజ్ సిటీ'గా మారిందా?
ఒకప్పుడు దేశ విదేశీయులను ఆకర్షించిన గార్డెన్ సిటీ (ఉద్యాన నగరం) బెంగళూరు.. ఇప్పుడు అస్తవ్యస్త ప్రణాళికలు, కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న వైనంతో తన ఉనికిని కోల్పోతోందా? బయోకాన్ వ్యవస్థాపకురాలు, ప్రముఖ పారిశ్రామికవేత్త కిరణ్ మజుందార్‌షా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా చేసిన తాజా వ్యాఖ్యలు ఐటీ కారిడార్‌లో చర్చకు దారితీశాయి. బెంగళూరును ఆమె నేరుగా గార్బేజ్ సిటీ(చెత్త నగరం) అని సంబోధించడం, అక్కడి పట్టణ ప్రణాళిక వైఫల్యాలను ఎండగట్టడం ఐటీ నిపుణులు, సామాన్య ప్రజల్లో చర్చకు తెరలేపింది.గ్రాఫిక్ చిత్రం ఏం చెబుతోంది?నగర రోడ్ల దుస్థితిని వివరిస్తూ కిరణ్ ఒక ఆసక్తికరమైన గ్రాఫిక్ చిత్రాన్ని షేర్ చేశారు. ‘మన గార్డెన్ సిటీని ప్రతిబింబించేలా మన రోడ్లను ఈ విధంగా రూపొందించాలి, ప్లాన్ చేయాలి. దురదృష్టవశాత్తు పచ్చదనం తగ్గుతూ చెత్త నగరంగా మారింది’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ గ్రాఫిక్ ఎలివేటెడ్ రోడ్ కారిడార్‌కు సంబంధించిన రెండు విభిన్న వెర్షన్లను పోల్చి చూపించింది.మనం నిర్మించింది (What We Built): కాంక్రీట్ విస్తరణతో కూడిన ప్రస్తుత దుస్థితి. రోడ్ల విస్తరణ పేరుతో చెట్లను పూర్తిగా తొలగించడం, పాదచారుల ఫుట్‌పాత్‌లు, సర్వీస్ రోడ్లను తుడిచిపెట్టడం, ప్రజలకు కనీస సౌకర్యాలు లేకుండా చేయడం ఇందులో కనిపించింది.మనం నిర్మించాల్సింది (What We Could Have Built): పర్యావరణ అనుకూల ప్రణాళిక. అదే కారిడార్‌లో పాత చెట్లను కాపాడుకుంటూనే సైక్లింగ్ ట్రాక్‌లు, విశాలమైన ఫుట్‌పాత్‌లు, వీధి దీపాలు, బెంచీలు, చెత్త డబ్బాలు వంటి ఆధునిక పౌర సౌకర్యాలతో తిరిగి రూపకల్పన చేయవచ్చని ఆ చిత్రం చూపించింది.నెటిజన్ల స్పందనఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడమే కాకుండా, నగర పౌరుల నుంచి తీవ్ర స్పందన తీసుకొచ్చింది. బెంగళూరులో క్షీణిస్తున్న మౌలిక సదుపాయాలకు పేలవమైన ప్రణాళిక, బలహీనమైన పాలన, అవినీతి, అధికారుల జవాబుదారీతనం లేకపోవడమే కారణమని నెటిజన్లు ఏకిపారేశారు. ‘ఈ నగరాన్ని దోచుకోవడానికి నిర్వాహకులు, రాజకీయ నాయకులు చేతులు కలిపారు. ఐరన్, సిమెంట్ మొదలైన వాటిలో ఎక్కువ కమీషన్లు దండుకోవచ్చు కాబట్టే కాంక్రీట్ రోడ్లపై ఆసక్తి కనబరుస్తారు. వారు నాటిన చెట్లలో కమీషన్లు రావు కదా!’ అని ఒక యూజర్ స్పందించారు.This is how we need to design & plan our roads that reflects our garden city image. Unfortunately it’s now a garbage city with shrinking greenery pic.twitter.com/EG29LPZd2j— Kiran Mazumdar-Shaw (@kiranshaw) June 27, 2026మరికొందరు నెటిజన్ల అభిప్రాయాలు ఇలా..భారతీయ నగరాలు ఏమాత్రం నిలకడగా లేవు. అంతర్జాతీయ నగరాల మాదిరిగా పన్నులు, ఖర్చులు వసూలు చేస్తారు. కానీ కనీస సౌకర్యాలు లేక పేద దేశంగా జీవించాల్సి వస్తోంది. సిగ్గుచేటు.ఉన్నవాటిని సరిగ్గా నిర్వహించడం, చట్టాలను కఠినంగా అమలు చేస్తే చాలు. ప్రజలు సహనం కోల్పోయారు, ఎవరూ ఏ నియమాన్ని పాటించడం లేదు. గార్డెన్ సిటీ చెత్త నగరంగా మారుతున్న విషయం ప్రభుత్వానికి, అడ్మినిస్ట్రేషన్‌కు తెలియదా?మొత్తం బడ్జెట్ నుంచి కమీషన్లు ఎలా పొందాలో ప్రభుత్వ ఉద్యోగులు, నిర్వాహకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. బాధ్యత, జవాబుదారీతనం లేనంత వరకు ఏదీ మెరుగుపడదు. బెంగళూరు అభివృద్ధి కోసం ఎవరైనా నిజాయితీగా ప్లాన్ చేస్తారని ఆశించడం అత్యాశే. -
గార్డెన్ కాదు.. గార్బేజ్ సిటీ!
ఒకప్పుడు ఆ నగరం అంటే అందాల హరివిల్లు. ఎటు చూసిన పచ్చదనంతో, చల్లటి గాలులు వీస్తూ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. బెంగళూరు నగరం ఒకప్పుడు గార్డెన్ సిటీ నుంచి తర్వాత సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా మారి, ఇప్పుడు ఏకంగా గార్బేజ్ సిటీ అయిపోయిందని అంటున్నారు. నగరంలో జనాభా ఎక్కువ కావడం వల్లో, ప్రజల్లో అవగాహన కొరవడటం వల్లో గానీ.. చెత్త సేకరణ సేవలు సరిపోవడం లేదని దాంతో నగరంలో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. నగరం విస్తరిస్తున్న విషయాన్ని కొన్ని దశాబ్దాల నుంచి ఎవరూ పెద్దగా పట్టించకోలేదు. కేవలం రోడ్లు, తాగునీరు, డ్రైనేజి, వీధిలైట్లు, గృహసముదాయాల్లాంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తే సరిపోతుందని భావించారు తప్ప.. కొత్తగా వస్తున్న ఇళ్ల నుంచి చెత్తను ఎలా తీసుకెళ్లాలి, ఎక్కడ డంప్ చేయాలి, చెత్త నిర్మూలన వ్యవస్థను ఎలా అభివృద్ధి చేయాలనే ఆలోచన పాలకులలో కొరవడటమే ప్రస్తుత పరిస్థితికి కారణం. పొద్దున్నే లేచేసరికి అప్పుడే ఏదో కల ముగుస్తూ ఉంటుందని.. కానీ నిద్రలేవగానే చెత్త కంపు ముక్కుపుటాలు అదిరేలా వస్తుందని రస్తోగి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పారు. తాము తలుపులు, కిటికీలు అన్నీ మూసేసినా కూడా ఇదే పరిస్థితి అని వివరించారు. ఒకప్పుడు వేరే రాష్ట్రాల వాళ్లు ఎక్కడికైనా టూర్ వెళ్లాలనుకుంటే ముందుగా బెంగళూరు గురించి ఆలోచించేవాళ్లు. మిగిలిన దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ చల్లగా ఉండటం, దానికితోడు మంచి వాతావరణం కనిపించడమే అందుకు కారణం. కానీ ఇప్పుడా పరిస్థితి లేదంటున్నారు. 1990లలో బెంగళూరు జనాభా కేవలం 30 లక్షలు మాత్రమే ఉండేది. ఇప్పుడది ఏకంగా 80 లక్షలు దాటిపోయింది. కానీ సదుపాయాలు మాత్రం ఆ స్థాయిలో పెరగడం లేదు. పట్టణాభివృద్ధి శరవేగంగా జరుగుతున్నా, ప్రణాళికలు మాత్రం ఆ స్థాయిలో లేకపోవడం ప్రధాన సమస్య. ఐటీ హబ్‌గా బెంగళూరు తయారుకావడంతో ఇక్కడ ఉద్యోగాలు చేసుకోడానికి దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి కూడా జనం తండోపతండాలుగా రావడం మొదలుపెట్టారు. దాంతో నగరం కూడా బాగా విస్తరించింది. దాంతో మునిసిపాలిటీ మీద భారం పెరిగిపోయింది. ఒక రోజుకు బెంగళూరు నగరంలో 3500 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. దాంతో 2013లో కొత్త ట్రీట్మెంట్ ప్లాంటును మునిసిపాలిటీ ప్రారంభించింది. మొదట్లో అది నగర శివార్లలోనే ఉండేది. కానీ నగర విస్తరణలో భాగంగా అక్కడివరకు ఇళ్లు వచ్చేయడంతో.. చుట్టుపక్కలవాళ్లు ఆ కంపు భరించలేకపోతున్నారు. ఇక్కడొక్క చోటే కాదు.. నగరంలో ఎటు చూసినా చెత్తకుప్పలే దర్శనం ఇస్తున్నాయి. దాంతో రోడ్లమీద వెళ్లేవాళ్లు కూడా ముక్కులు మూసుకోక తప్పడం లేదు. మళ్లీ తమ నగరం గార్డెన్‌సిటీ, క్లీన్‌సిటీగా ఎప్పటికి మారుతుందోనని బెంగళూరు వాసులు ఎదురుచూస్తున్నారు. -
బీజేపీపై చెత్త అస్త్రం...
నగరంలో పేరుకుపోతున్న చెత్తపై విమర్శలు బీబీఎంపీ ఎన్నికల కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రధాన అంశం బెంగళూరు: గార్డెన్‌సిటీ నుంచి గార్బేజ్ సిటీగా మారిపోయిన బెంగళూరు నగరాన్ని తిరిగి గార్డెన్ సిటీగా మారుస్తామనే వాగ్దానంతో కాంగ్రెస్ పార్టీ ఈ బీబీఎంపీ ఎన్నికల్లో ప్రజల ముందుకు వెల్లనుంది. చెత్త సమస్య పరిష్కారంలో బీజేపీ వైఫల్యాన్ని అస్త్రంగా చేసుకొని బీబీఎంపీ ఎన్నికల్లో విజయాన్ని సొంతం చేసుకోవడానికి వ్యూహాలు రచిస్తోంది. చెత్త సమస్యను పరిష్కరించడంతో పాటు రోడ్ల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, తాగునీటి సమస్య పరిష్కారం వంటి అంశాలతో బీబీఎంపీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను రూపొందించింది. బీజేపీ బీబీఎంపీలో అధికారంలో ఉన్న సమయంలో నగరంలో చెత్త సమస్య ఏ విధంగా పెరిగిపోయిందో ఓ వైపున ప్రజలకు వివరిస్తూనే, తాము అధికారంలోకి వస్తే ఈ సమస్య పరిష్కారానికి ఏ కార్యక్రమాలు చేయబోతున్నామనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పొందుపరిచింది. ఇక బీబీఎంపీ పాలన విషయంలో బీజేపీ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకు బీజేపీ హయాంలో బీబీఎంపీలో చోటుచేసుకున్న కుంభకోణాలను సైతం తన మేనిఫెస్టోలో పేర్కొంది. ఈ కుంభకోణాల కారణంగా బీబీఎంపీ ఖజానాకు ఎంత నష్టం వాటిల్లింది, గత రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలైన నిధులు బీబీఎంపీలో ఎంత వరకు వినియోగమయ్యాయి? అనే అంశాలను సైతం ప్రజల ముందుకు తీసుకొచ్చి తమ ప్రచారాన్ని సాగించేందుకు కాంగ్రెస్ నేతలు సన్నద్ధమయ్యారు. ఇక నగర ప్రజలకు రోజు రోజుకు ఇబ్బంది కరంగా తయారవుతున్న ట్రాఫిక్‌జామ్‌కు సరైన పరిష్కారాన్ని కనుగొనేదిశగా ప్రణాళికను రూపొందించడాన్ని తమ మేనిఫెస్టోలో చేర్చారు. బీబీఎంపీ పరిధిలోని ప్రతి వార్డు అభివృద్ధి, నగరంలో మౌళిక వసతుల కల్పన, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు వంటి హామీలను పొందుపరిచారు. ఇక కుంభకోణాలతో నిండిపోయిన బీబీఎంపీని పూర్తిగా ప్రక్షాళన చేసి పారదర్శక పాలన అందజేయడంతో పాటు బెంగళూరు నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో స్వచ్ఛమైన, సురక్షిత నగరంగా తీర్చిదిద్దుతామనే ప్రధాన హామీతో ఈ బీబీఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు తమ ప్రచారాన్ని కొనసాగించనున్నారు.


