ఏఐ చిప్‌ మార్కెట్‌ జోరు.. | AMD unveils AI server as OpenAI taps its newest chips | Sakshi
Sakshi News home page

ఏఐ చిప్‌ మార్కెట్‌ జోరు.. 

Jun 14 2025 4:52 AM | Updated on Jun 14 2025 7:45 AM

AMD unveils AI server as OpenAI taps its newest chips

2028 నాటికి 500 బిలియన్‌ డాలర్లకు చేరిక 

ఏఎండీ సీఈవో లీసా అంచనా 

న్యూఢిల్లీ: వచ్చే మూడేళ్లలో (2028 నాటికి) కృత్రిమ మేథ (ఏఐ) ప్రాసెసర్‌ మార్కెట్‌ 500 బిలియన్‌ డాలర్ల స్థాయిని అధిగమిస్తుందని అంచనా వేస్తున్నట్లు అడ్వాన్స్‌డ్‌ మైక్రో డివైజెస్‌ (ఏఎండీ) సీఈవో ’లీసా సూ’ తెలిపారు. 2023లో 45 బిలియన్‌ డాలర్లుగా ఉన్న ఈ విభాగం ఏటా 60 శాతం మేర వృద్ధి చెందుతోందని వివరించారు. 

అడ్వాన్సింగ్‌ ఏఐ 2025 కాన్ఫరెన్స్‌లో ’ఎంఐ350 సిరీస్‌’ జీపీయూలు (గ్రాఫిక్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు), ఇతర ఉత్పత్తులను ఆవిష్కరించిన సందర్భంగా లీసా ఈ విషయాలు వివరించారు. కొత్తగా ప్రవేశపెట్టిన చిప్‌లు నలభై శాతం అధిక సామర్థ్యంతో పని చేస్తాయని పేర్కొన్నారు. డెవలపర్‌ కమ్యూనిటీ కొత్త ఉత్పత్తులను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు డెవలపర్‌ క్లౌడ్‌ యాక్సెస్‌ ప్రోగ్రాంను కూడా కంపెనీ ప్రవేశపెట్టింది. 

’హీలియోస్‌ ఏఐ ర్యాక్‌ స్కేల్‌’ సొల్యూషన్‌ని కూడా ఏఎండీ ఆవిష్కరించింది. ఇది వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. ఏఐని వినియోగించే 10 అతి పెద్ద కంపెనీల్లో ఏడు సంస్థలు తమ ఏఎండీ ఇన్‌స్టింక్ట్‌ యాక్సిలరేటర్లను ఉపయోగిస్తున్నాయని, ఈ లిస్టులో భారత టెలికం దిగ్గజం రిలయన్స్‌ జియో కూడా ఉందని లీసా చెప్పారు. కాన్ఫరెన్స్‌ సందర్భంగా ఓపెన్‌ఏఐ సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్‌తో పాటు మెటా, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్‌ తదితర దిగ్గజాల ప్రతినిధులతో ఆమె సమావేశమయ్యారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement