ఇలా మారితేనే ఉద్యోగాలు వస్తాయ్! | AI Wolrd Know The Robert Kiyosaki Most Obsolete Advice Today | Sakshi
Sakshi News home page

Robert Kiyosaki: ఇలా మారితేనే ఉద్యోగాలు వస్తాయ్!

Oct 21 2026 12:41 PM | Updated on Oct 21 2026 12:47 PM

AI Wolrd Know The Robert Kiyosaki Most Obsolete Advice Today

''బాగా చదువుకోవాలి.. మంచి మార్కులు తెచ్చుకోవాలి, ఆ తర్వాత మంచి జీతం వచ్చే ఉద్యోగం సంపాదించాలి'' ఇది చాలామంది చిన్నప్పటి నుంచి వింటున్న ఫార్మలా. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలకు చెప్పే మాటలు ఇవే కాబట్టి. కానీ.. మారుతున్న పరిస్థితులను చూస్తుంటే.. ఈ సలహా భవిష్యత్తులోనూ పనిచేస్తుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. ప్రముఖ రచయిత, ఆర్థిక అంశాలపై పుస్తకాలు రాసిన రాబర్ట్ కియోసాకి ఇదే విషయాన్ని ప్రస్తావించారు.

చదువు, మంచి మార్కులు, అధిక జీతం వచ్చే ఉద్యోగం.. ఇవే జీవితంలో విజయానికి మార్గాలని భావించే పాత ఆలోచనా విధానాన్ని మరోసారి పరిశీలించుకోవాల్సిన సమయం వచ్చిందని కియోసాకి తన ఎక్స్‌ (X) ఖాతాలో పేర్కొన్నారు.

కియోసాకి తన పోస్టులో 'ది వాల్ స్ట్రీట్ జర్నల్'లో వచ్చిన ఓ కథనాన్ని ప్రస్తావించారు. ప్రిన్స్‌టన్‌లో టెక్నాలజీకి సంబంధించిన పీహెచ్‌డీ చేసిన ఓ వ్యక్తి 230 కంపెనీల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నా'.. అన్ని చోట్లా తిరస్కరణ ఎదురైందని తెలిపారు. ఉన్నత విద్యార్హతలు ఉన్నప్పటికీ ఉద్యోగం దొరకని పరిస్థితులు ఎదురవుతున్నాయని, కొన్ని కంపెనీలు అధిక విద్యావంతులైన ఉద్యోగులను తగ్గించి వారి స్థానంలో AIని ఉపయోగించుకునే దిశగా వెళ్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే.. ఆ వ్యక్తికి ఉద్యోగం రాకపోవడానికి AI ఒక్కటే కారణమని చెప్పలేం. కియోసాకి ప్రకారం.. డిగ్రీలు, మంచి మార్కులు ఉన్నంత మాత్రాన ఉద్యోగం ఖాయమని భావించకూడదు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మన నైపుణ్యాలను కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది.

మారుతున్న ప్రపంచం
ప్రపంచం నేడు.. ఒక పెద్ద మార్పు దిశగా వెళ్తోందని కియోసాకి చెబుతున్నారు. గతంలో పనిచేసిన పద్ధతులు భవిష్యత్తులో పనిచేయకపోవచ్చని పేర్కొంటూ.. దీనిని 'రిసెట్‌'గా అభివర్ణించారు. ఒకప్పుడు ప్రయాణాల కోసం గుర్రాలపై ఆధారపడేవారు. కానీ కార్లు అందుబాటులోకి రావడంతో రవాణా విధానమే మారిపోయింది. అలాగే, ఆన్‌లైన్ షాపింగ్ పెరగడంతో సంప్రదాయ దుకాణాలు, షాపింగ్ మాల్స్ కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.

ఇప్పుడు ఇదే తరహాలో AI కూడా అనేక రంగాల్లో మార్పులు తీసుకొస్తోందని కియోసాకి పేర్కొన్నారు. వైద్యం, న్యాయ సేవలు, అకౌంటింగ్ వంటి రంగాల్లో సమాచారాన్ని విశ్లేషించడం, పత్రాలను పరిశీలించడం, నివేదికలు తయారు చేయడం వంటి పనుల్లో AI వినియోగం పెరుగుతోంది. దీంతో కొన్ని ఉద్యోగాల్లో చేసే పనులు మారవచ్చు. కొన్ని పనులకు మనుషుల అవసరం తగ్గవచ్చు. అదే సమయంలో AIకి సంబంధించిన కొత్త ఉద్యోగాలు, అవకాశాలు కూడా ఏర్పడవచ్చు.

చదువులు అవసరం లేదా?
కియోసాకి వ్యాఖ్యలను బట్టి చదువులు అవసరం లేదని అనుకోవడం మాత్రం పొరపాటే. మంచి విద్య ఇప్పటికీ మంచి అవకాశాలకు పునాది వేస్తుంది. అయితే.. చదువు పూర్తయిన తర్వాత నేర్చుకోవడం ఆపేస్తే మాత్రం మారుతున్న ప్రపంచంలో వెనుకబడిపోయే ప్రమాదం ఉంది.

ఉదాహరణకు.. అకౌంటింగ్ నేర్చుకున్న వ్యక్తి ఏఐ సాధనాలను ఉపయోగించడం కూడా నేర్చుకుంటే తన పనిని మరింత సమర్థంగా చేయగలడు. వైద్యులు కొత్త సాంకేతికతలను అర్థం చేసుకోవచ్చు. న్యాయవాదులు పత్రాల పరిశీలనకు AIని ఉపయోగించవచ్చు. అంటే, AIతో పోటీ పడటమే కాకుండా, దాన్ని మన పనికి ఉపయోగపడే సాధనంగా మార్చుకోవడం కూడా ముఖ్యం. అదే సమయంలో సృజనాత్మకత, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, ఇతరులతో సమర్థంగా మాట్లాడగలగడం, సరైన నిర్ణయాలు తీసుకోవడం వంటి మానవ నైపుణ్యాలకు కూడా ప్రాధాన్యం ఉంటుంది.

ఇదీ చదవండి: బంగారం కొనేందుకు మంచి సమయం.. ఎందుకంటే?

పాత ఆలోచనలను మార్చుకోవాలా?
తన ఎక్స్ ఫాలోవర్లకు కియోసాకి మరో ముఖ్యమైన సూచన చేశారు. తాను చెప్పిన ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకుండా.. సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. మారుతున్న పరిస్థితులను గమనిస్తూ.. అవసరమైతే పాత ఆలోచనలను వదిలి కొత్త విషయాలను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement