ట్రంప్‌ కొత్త ప్లాన్‌.. విలేకరుల గదిలో ఈత కొలను? | Trump Eyes Press Room Removal for Historic Pool Revival | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ కొత్త ప్లాన్‌.. విలేకరుల గదిలో ఈత కొలను?

Oct 21 2026 7:46 AM | Updated on Oct 21 2026 7:46 AM

Trump Eyes Press Room Removal for Historic Pool Revival

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి మీడియాపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. వైట్‌హౌస్‌లోని మీడియా సమావేశాల గదిలో పనిచేసే జర్నలిస్టులను అక్కడి నుంచి తరలించి, ఆ ప్రదేశంలోని ఇండోర్‌ స్విమ్మింగ్‌ పూల్‌ను పునరుద్ధరించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనపై ట్రంప్‌ తన సన్నిహితులతో పలుమార్లు చర్చించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి, వార్తా సంస్థలకు మధ్య విభేదాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఆగస్టు చివర్లో ఓవల్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అప్పటి వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్‌ లీవిట్‌తో ట్రంప్‌ ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. జేమ్స్‌ ఎస్‌. బ్రాడీ ప్రెస్‌ బ్రీఫింగ్‌ రూమ్‌ నుంచి విలేకరులను తరలించాలని సూచించారు. పలువురు ఉన్నతాధికారుల సమక్షంలో ఈ మార్పు ఆమె పదవీకాలానికి చివరి గుర్తుగా నిలుస్తుందని వ్యాఖ్యానించినట్లు తెలుస్తున్నది. అయితే లీవిట్‌ పదవిలో ఉన్నంతకాలం ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. ఆమె ఆగస్టు 27న అధికారికంగా బాధ్యతల నుంచి వైదొలిగారు.

1933లో అప్పటి అధ్యక్షుడు ఫ్రాంక్లిన్‌ డి. రూజ్‌వెల్ట్‌ తన పోలియో కారణంగా ప్రభావితమైన కాళ్లకు చికిత్సలో భాగంగా వైట్‌హౌస్‌లో ఇండోర్‌ స్విమ్మింగ్‌ పూల్‌ను ఏర్పాటు చేయించారు. అనంతరం అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌ ఆ కొలనును కప్పివేసి, విలేకరుల కోసం స్థలాన్ని అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం వైట్‌హౌస్‌ గుర్తింపు కార్డులు కలిగిన జర్నలిస్టులు మీడియా సమావేశాల గదికి అనుసంధానంగా ఉన్న ఈ కార్యాలయంలో పనిచేస్తున్నారు. వారిని అక్కడికి ఎదురుగా ఉన్న ఐసెన్‌హోవర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీస్‌ భవనానికి తరలించే అంశాన్ని ట్రంప్‌ వర్గం పరిశీలిస్తున్నట్లు సమాచారం.

గత సెప్టెంబరులో ట్రంప్‌ మీడియాపై ఆంక్షలకు సంబంధించిన ప్రకటన చేశారు. తమ ప్రభుత్వంపై కల్పిత కథనాలు, అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయంటూ సీఎన్‌ఎన్‌, ఎంఎస్‌ నౌ, పొలిటికో సంస్థలను వైట్‌హౌస్‌లోకి అనుమతించబోమని పేర్కొన్నారు. అనంతరం 70 మందికి పైగా జర్నలిస్టుల గుర్తింపు అనుమతులను ప్రభుత్వం రద్దు చేసింది. ట్రంప్‌ నియమించిన న్యాయమూర్తి తిమోతీ జె. కెల్లీ ఈ నిర్ణయంపై తాత్కాలికంగా అడ్డుకట్ట వేశారు. 

ఇదీ చదవండి: భయపెట్టడమే పెట్టుబడి.. బెదిరింపులే వ్యాపారం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement