గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గుజరాత్‌లోని అహ్మదాబాద్ సబర్మతి సెంట్రల్ జైలులో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉన్నాడు. అయినప్పటికీ, ప్రముఖులను లక్ష్యంగా చేసుకుంటూ అతడి ముఠా కార్యకలాపాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల ఘటనతో మరోసారి ఈ ముఠా అంతర్జాతీయ నెట్‌వర్క్ చర్చనీయాంశమైంది. ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు బిష్ణోయ్ ముఠాతో సంబంధాలున్న ఇద్దరు వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. వారిలో అమెరికాలో ఉంటున్న అనిల్ పండిట్ ఒకరు. జైల్లో ఉన్న వ్యక్తి పేరు మీద విదేశాల నుంచి నెట్‌వర్క్ ఎలా పనిచేస్తోంది? ఈ ముఠా కార్యకలాపాల వెనుక ఎవరున్నారు? అనే అంశాలపై దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి.
విదేశాల నుంచి ఆదేశాలు.. స్థానికంగా దాడులు
అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) ఈ నెట్‌వర్క్‌ను ‘లారెన్స్ బిష్ణోయ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్రూప్’ (ఓసీజీ)గా పేర్కొంది. అంతర్జాతీయ సరిహద్దులను దాటి కార్యకలాపాలు నిర్వహించడం, విదేశాల నుంచి స్థానికంగా దాడులకు పాల్పడే వ్యక్తులను నియమించుకోవడం, వ్యాపారవేత్తలను బెదిరించి డబ్బులు వసూలు చేయడం వంటి కార్యకలాపాలకు ఈ ముఠా పాల్పడుతోందని అమెరికా అధికారులు ఆరోపిస్తున్నారు. సెలబ్రిటీలు, గాయకులు, రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకున్న ఘటనల్లోనూ ఈ ముఠా పేరు వినిపిస్తోంది. నటులు సల్మాన్ ఖాన్, రణ్‌వీర్ సింగ్, అమీర్ ఖాన్, దర్శకుడు రోహిత్ శెట్టిలకు గతంలో వీరి నుంచి బెదిరింపులు వచ్చాయి. ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా 2022 మేలో హత్యకు గురయ్యారు. మహారాష్ట్ర నాయకుడు బాబా సిద్ధిఖీ 2024 అక్టోబరులో హత్యకు గురయ్యారు. ఈ ఘటనలతో బిష్ణోయ్ ముఠాకు సంబంధాలున్నాయని ఆరోపణలున్నాయి.
అనిల్ పండిట్.. అమెరికా నుంచి కార్యకలాపాలు?
హర్యానాలోని పానిపట్ జిల్లా రైర్ కలాన్ గ్రామానికి చెందిన 32 ఏళ్ల అనిల్ పండిట్ 2023లో భారత్ విడిచి వెళ్లాడు. థాయ్‌లాండ్, కెనడా మీదుగా అమెరికా చేరినట్లు సమాచారం. ఈ ఏడాది జూలైలో అమెరికాలో దాఖలైన అభియోగపత్రం ప్రకారం.. గ్యాంగ్‌స్టర్ రణ్‌దీప్ మాలిక్, కెనడాలో నివసిస్తున్న రవీందర్ సింగ్ ఢండాతో అతడికి సంబంధాలున్నాయి. వీరు బిష్ణోయ్ ముఠాతో కలిసి పనిచేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. భారత దర్యాప్తు సంస్థలు తెలిపిన వివరాల ప్రకారం అనిల్ పండిట్ కాలిఫోర్నియా నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. గోల్డీ బ్రార్‌తోనూ అతడికి సంబంధాలున్నాయనే అనుమానాలున్నాయి. టైగర్ ష్రాఫ్ ఘటనకు ముందు పశ్చిమ ఢిల్లీలో గాయకుడు గురు రంధావాకు సంబంధమున్న జిమ్ యజమానిపై కాల్పులు, పుణెలోని ఆభరణాల దుకాణంపై కాల్పులు, భివాడీ, సోనిపట్‌లలో జరిగిన దాడుల కేసుల్లోనూ అతడి పేరు తెరపైకి వచ్చింది.
ఎన్‌క్రిప్టెడ్ యాప్‌లతో సమాచార మార్పిడి
ఈ నెట్‌వర్క్ కార్యకలాపాల్లో ‘సిగ్నల్’ వంటి ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్‌లను ఉపయోగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దాడులకు పాల్పడే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, విదేశాల్లో తయారైన ఆయుధాలను సమకూర్చడం వంటి కార్యకలాపాల్లో ఈ యాప్‌లను వినియోగించినట్లు అనుమానిస్తున్నారు. తాజా ఘటనలో మరో అనుమానితుడిగా హర్మన్‌వీర్ సింగ్ అలియాస్ హర్మన్ సంధూ పేరు వినిపిస్తోంది. జూన్‌లో ఎఫ్‌బీఐ వాంటెడ్ జాబితాలో అతడి పేరు చేర్చినట్లు సమాచారం. రవీందర్ దండా నెట్‌వర్క్‌తో సంబంధాలున్న సంధూను జూలైలో కాలిఫోర్నియాలో ఎఫ్‌బీఐ అదుపులోకి తీసుకున్నారు. జూన్ 23న లాస్ ఏంజెలెస్‌లోని అమెరికా జిల్లా కోర్టు అతడిపై ఫెడరల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. నిషేధిత పదార్థాలను కలిగి ఉండటం, వాటిని పంపిణీ చేయడానికి, ఎగుమతి చేయడానికి కుట్ర పన్నడం వంటి ఆరోపణలు అతడిపై ఉన్నాయి. టైగర్ ష్రాఫ్ ఘటనలో అతడి పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది.
‘ఆపరేషన్ హార్డ్‌బాల్’తో అంతర్జాతీయ ఉచ్చు
జూలైలో అమెరికా అధికారులు ‘ఆపరేషన్ హార్డ్‌బాల్’ను ప్రకటించారు. అమెరికా, కెనడా, ఐరోపా దేశాల మధ్య సమన్వయంతో చేపట్టిన ఈ చట్ట అమలు చర్యల్లో భాగంగా భారతీయ గ్యాంగ్‌స్టర్లపై మూడు ఫెడరల్ అభియోగపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 37 మందికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టగా, వారిలో 24 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. వీరికి లారెన్స్ బిష్ణోయ్, జగూ భగన్‌పురియా, రవీందర్ సింగ్ దండా నెట్‌వర్క్‌లతో సంబంధాలున్నాయని ఆరోపణలు ఉన్నాయి. అమెరికా ప్రాసిక్యూటర్లు తెలిపిన వివరాల ప్రకారం సబర్మతి జైలు నుంచే బిష్ణోయ్ తన నేర నెట్‌వర్క్‌ను నడిపిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇందుకోసం నిషేధిత మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ ఆధారిత వాయిస్ కమ్యూనికేషన్ పరికరాలను ఉపయోగిస్తున్నట్లు తేలింది. హత్యలు చేయడం, కాల్పులు, బెదిరింపుల ద్వారా డబ్బు వసూలు చేయడం, కిడ్నాప్‌లు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా వంటి నేరాలతో ఈ నెట్‌వర్క్‌కు సంబంధాలున్నాయని అమెరికా అధికారులు చెబుతున్నారు.
భయాన్ని సృష్టించి.. డబ్బులు వసూలు చేయడమే..
బిష్ణోయ్‌తో పాటు గోల్డీ బ్రార్, రోహిత్ గోద్రా వంటి వ్యక్తులు ఈ నెట్‌వర్క్‌లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఎఫ్‌బీఐ పేర్కొంది. వివిధ దేశాల్లో ఉన్న ముఠా సభ్యులకు ఆదేశాలు ఇవ్వడం, కార్యకలాపాలను సమన్వయం చేయడం వంటి బాధ్యతలను వీరు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఆన్‌లైన్‌లో దాడులకు బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించడం ద్వారా ప్రజల్లో భయాన్ని పెంచి, ఆ భయాన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారవేత్తల నుంచి డబ్బులు వసూలు చేయడమే ఈ ముఠా వ్యూహమని అమెరికా అధికారులు పేర్కొన్నారు. భారత్‌తో పాటు విదేశాల్లో నివసిస్తున్న భారతీయ సమాజాలనూ లక్ష్యంగా చేసుకుంటున్నట్లు ఆరోపించారు. 2023 జూన్‌లో కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ సరే నగరంలో సిక్కు వేర్పాటువాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురైన ఘటననూ అమెరికా ప్రాసిక్యూటర్లు ప్రస్తావించారు. అంతర్జాతీయ కొకైన్ అక్రమ రవాణా, ప్రత్యర్థి నేర ముఠాలకు చెందిన మాదకద్రవ్యాల సరుకులను దొంగిలించడం వంటి కార్యకలాపాలతోనూ ఈ నెట్‌వర్క్‌కు సంబంధాలున్నాయని ఎఫ్‌బీఐ ఆరోపించింది.
డీ-కంపెనీ తరహా నెట్‌వర్క్..
భారత దర్యాప్తు సంస్థల అంచనాల ప్రకారం బిష్ణోయ్ ముఠా ఒకే ప్రాంతానికి పరిమితమైన నేరస్థుల ముఠా కాదు. జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్లు, విదేశాల నుంచి కార్యకలాపాలు నిర్వహించే హ్యాండ్లర్లు, స్థానికంగా దాడులకు పాల్పడే వ్యక్తులు, ఆర్థిక సహకారం అందించే వారు ఇందులో భాగంగా ఉన్నట్లు ఆరోపణలున్నాయి. 2023 మార్చిలో దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) ఉత్తర భారత గ్యాంగ్‌స్టర్లకు ఖలిస్థాన్ అనుకూల వర్గాలతో ఉన్న సంబంధాలను ప్రస్తావించింది. 2015 బర్గారీ ఉద్యమం, 2016 నాభా జైలు నుంచి ఖైదీలు తప్పించుకున్న ఘటనలను ఈ నెట్‌వర్క్ విస్తరణలో కీలక పరిణామాలుగా పేర్కొంది. ఆయుధాలు, నిధులు, అనుభవమున్న షూటర్ల అవసరాలు వేర్వేరు వర్గాలను పరస్పరం దగ్గర చేశాయని ఏజెన్సీ తెలిపింది. పంజాబ్, హర్యానా, చండీగఢ్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, బిహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు ఈ నెట్‌వర్క్ విస్తరించినట్లు పేర్కొంది. నేరాల ద్వారా సంపాదించిన డబ్బును కెనడా, అమెరికా, థాయ్‌లాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు తరలించినట్లు ఆరోపణలున్నాయి. 1990లలో దావూద్ ఇబ్రహీం డీ-కంపెనీ నిర్వహించిన అండర్‌వరల్డ్ వ్యవస్థతో ఈ నెట్‌వర్క్ తీరును ఎన్‌ఐఏ పోల్చింది. విదేశాల్లోని హ్యాండ్లర్లు, స్థానికంగా నియమితులైన వ్యక్తుల మధ్య సంబంధాలను గుర్తించడం, ఆయుధాలు, డబ్బు లావాదేవీలను ఛేదించడం, వేర్వేరు దాడుల వెనుక ఒకే నెట్‌వర్క్ ఉందో లేదో నిర్ధారించడం దర్యాప్తు సంస్థలకు ప్రధాన సవాలుగా మారింది.
ఇదీ చదవండి: ట్రంప్‌కు ‘శాంతి’నిచ్చి.. ప్రతిపక్షంలో మచాడో కలకలం!


