న్యూఢిల్లీ: ఢిల్లీలోని పీతాంపురలో ‘శ్రీ కేశవ్ రామ్‌లీలా కమిటీ’ ఆధ్వర్యంలో జరిగిన దసరా వేడుకల్లో రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడి దిష్టిబొమ్మలతో పాటు 30 అడుగుల భారీ బొద్దింక దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ పరిణామం రాజకీయాల్లో తీవ్ర దుమారానికి దారితీసింది. ఈ చర్యపై ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది హిందూ మత మనోభావాలను దెబ్బతీయడమేనని, వేల ఏళ్ల సనాతన సంప్రదాయాలను అపహాస్యం చేశారని ఆరోపిస్తూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, పోలీస్ కమిషనర్‌లకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమానికి కారణమైన రామ్‌లీలా కమిటీ నిర్వాహకులతో పాటు బీజేపీ ఎమ్మెల్యే అశోక్ గోయల్, మంత్రి కపిల్ మిశ్రాలపై తక్షణమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అయితే బొద్దింకల ద్వారా వ్యాపించే రోగాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ఆ దిష్టిబొమ్మను దహనం చేసినట్లు ఈవెంట్ నిర్వాహకులు వివరణ ఇచ్చారు. ఓటర్ల జాబితాల సవరణకు సంబంధించి నిరసనలు తెలుపుతున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ని ఉద్దేశించే ఈ పనిచేసినట్లు ప్రచారం జరగడంతో వివాదం మరింత రాజుకుంది. ఆప్ విమర్శలకు బీజేపీ నేత కపిల్ మిశ్రా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. దహనం చేసింది బొద్దింక దిష్టిబొమ్మనే అయినప్పటికీ దేశంలోని ‘రాజకీయ చెదపురుగులు’ బాధపడుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజల వద్ద వీటికి తగిన క్రిమిసంహారక మందు ఉందని, అశాంతికి చిహ్నమైన ఇలాంటి దేశ వ్యతిరేక శక్తుల పతనం తప్పదని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: రావణునితో పాటు ‘బొద్దింక’ దహనం.. దీప్కే కృతజ్ఞతలు!


