అసలు టార్గెట్ సల్మాన్.. ష్రాఫ్‌పై కాల్పులు ఎందుకంటే.. | Salman Khan was original target, Tiger Shroff an easy second choice | Sakshi
Sakshi News home page

అసలు టార్గెట్ సల్మాన్.. ష్రాఫ్‌పై కాల్పులు ఎందుకంటే..

Oct 21 2026 9:41 AM | Updated on Oct 21 2026 10:30 AM

Salman Khan was original target, Tiger Shroff an easy second choice

ముంబై: బాలీవుడ్‌ నటుడు టైగర్‌ ష్రాఫ్‌పై జరిగిన కాల్పులు ఘటనకు సంబంధించిన పలు వివరాలను ముంబై పోలీసులు మీడియా ఎదుట వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం, జుహులో జరిగిన కాల్పుల ఘటనలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అసలు లక్ష్యం బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ అని, అయితే, బాంద్రా (వెస్ట్) బ్యాండ్‌స్టాండ్‌లోని సల్మాన్ ఖాన్ నివాసం వద్ద షూటర్లు రెక్కీ నిర్వహించినప్పటికీ, అక్కడ ఉన్న కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చూసి వెనక్కి తగ్గారని పోలీసులు తెలిపారు. దాంతో తమ పథకాన్ని మార్చుకుని, ఎలాంటి పోలీసు భద్రత లేని నటుడు టైగర్ ష్రాఫ్‌ను సులభమైన టార్గెట్‌గా ఎంచుకున్నారని దర్యాప్తులో వెల్లడైందని అన్నారు.

టైగర్ ష్రాఫ్ ప్రతి ఆదివారం జుహులోని పుష్ప నర్సీ గ్రౌండ్‌లో ఫుట్‌బాల్ ఆడుతుంటారని ఆయన అభిమానుల సోషల్ మీడియా పోస్టుల ద్వారా ముఠా తెలుసుకుంది. బిష్ణోయ్ ముఖ్య అనుచరుడు అమిత్ పండిట్ ఆదేశాల మేరకు, పిస్టళ్లతో సిద్ధమైన ఇద్దరు షూటర్లు మైదానం వద్ద కాపు కాశారు. ష్రాఫ్ కారు గేటు దాటి బయటకు వస్తున్న సమయంలో ఆయనపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో టైగర్ ష్రాఫ్ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

ఈ కాల్పుల ఘటనకు సంబంధించి 18 ఏళ్ల ఫూల్ సింగ్, రెహాన్ అన్సారీ అనే ఇద్దరు షూటర్లతో పాటు, వారికి బైక్‌తో సహకరించిన 22 ఏళ్ల హృతిక్ కుమార్ అలియాస్ రోషన్ రాము మహతోను రాజస్థాన్‌లోని కోటాలో ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని ట్రాన్సిట్ రిమాండ్‌పై రోడ్డు మార్గంలో ముంబైకి తరలించారు. నిందితుల ఫోన్లను స్వాధీనం చేసుకుని, హ్యాండ్లర్లకు చేరవేసిన ఫోటోలు,  వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాల్పుల ఘటన నేపథ్యంలో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద ముంబై పోలీసులు భద్రతను మరింత పెంచి, ముందస్తు జాగ్రత్తగా రోడ్లపై బారికేడ్లను ఏర్పాటు చేశారు. మంగళవారం ముంబై విమానాశ్రయంలో కూడా సల్మాన్ ఖాన్ చుట్టూ భారీగా సాయుధ గార్డులు మోహరించి ఉండటం కనిపించింది. నిందితులను బుధవారం కోర్టులో హాజరుపరిచి పోలీసు కస్టడీ కోరనున్నట్లు అధికారులు వెల్లడించారు.

1998లో జోధ్‌పూర్‌లో సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్ కృష్ణజింకను (బ్లాక్‌బక్) వేటాడారన్న ఆరోపణలతో ఈ వివాదం మొదలైంది. రాజస్థాన్‌లోని బిష్ణోయ్ సమాజం కృష్ణజింకను పవిత్రంగా భావిస్తుంది. గతంలో 2024 ఏప్రిల్‌లో సల్మాన్ ఖాన్ ఇంటి బయట మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు నాలుగు రౌండ్లు కాల్పులు జరపగా, పన్వేల్‌లోని ఆయన ఫామ్‌హౌస్‌ను కూడా గ్యాంగ్ సభ్యులు పలుమార్లు రెక్కీ చేశారు.

ఇదీ చదవండి: ‘టాప్‌ యంగ్ సైంటిస్ట్’: భారత బాలికకు రూ. 21 లక్షల బహుమానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement