కియోసాకి చెప్పిన 5 డబ్బు సమస్యలు | Robert Kiyosaki Explains Five Money Problems | Sakshi
Sakshi News home page

కియోసాకి చెప్పిన 5 డబ్బు సమస్యలు

Oct 17 2026 12:15 PM | Updated on Oct 17 2026 12:27 PM

Robert Kiyosaki Explains Five Money Problems

రాబర్ట్ కియోసాకి డబ్బుకు సంబంధించిన ఐదు రకాల సమస్యల గురించి పేర్కొన్నారు. చాలామందికి అసలు డబ్బే ఉండదు. కొందరు సంపాదిస్తున్నా అవసరాలకు సరిపోదు. మరికొందరు సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చు చేస్తారు. ఇంకొందరు భవిష్యత్తు కోసం డబ్బు దాచుకోలేరు. చివరిగా.. కొంతమందికి చాలా డబ్బు ఉన్నా దాన్ని ఎలా నిర్వహించాలో తెలియక సమస్యలు ఎదురవుతాయి.

కియోసాకి చెప్పిన ఆసక్తికరమైన విషయం ఏంటంటే, తాను కూడా ఈ ఐదు సమస్యలను తన జీవితంలో ఎదుర్కొన్నారట. అయితే మొదటి నాలుగు సమస్యలను పరిష్కరించుకునే క్రమంలో ఎన్నో విషయాలు నేర్చుకుని, ఆర్థికంగా తెలివిగా మారానని చెబుతున్నారు. ఇప్పుడు తనకు ఐదో సమస్య అయిన 'చాలా డబ్బు ఉండటం' అనే పరిస్థితి వచ్చిందని అంటున్నారు.

డబ్బు సమస్యలు
జీవితంలో డబ్బు లేకపోవడం ఒక సమస్య అయితే.. చేతిలో ఎక్కువ డబ్బు ఉండటం కూడా కొన్నిసార్లు సమస్యే. మనం సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టడం, భవిష్యత్తు కోసం డబ్బు దాచుకోకపోవడం, డబ్బును ఎలా నిర్వహించాలో తెలియకపోవడం వల్ల చాలామంది ఆర్థిక ఇబ్బందుల్లో పడుతుంటారు. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, దాన్ని సరిగ్గా నిర్వహించడం కూడా అంతే ముఖ్యం అంటారు రాబర్ట్ కియోసాకి.

ఒక వ్యక్తి ఒక్కసారిగా కోటీశ్వరుడు కావచ్చు. కానీ ఆ డబ్బును ఎలా ఉపయోగించాలో తెలియకపోతే.. ఎంత సంపాదించినా చివరికి ఖాళీ చేతులతో మిగిలిపోవచ్చు. సెలబ్రిటీలు, క్రీడాకారులు, లాటరీలో డబ్బు గెలుచుకున్నవాళ్లు చాలామంది సరైన ఆర్థిక అవగాహన లేకపోవడం వల్ల తమ సంపదను కోల్పోతుంటారు. కొందరు అవసరానికి మించి ఖర్చు చేస్తే, మరికొందరు ఇతరులను గుడ్డిగా నమ్మి డబ్బు పోగొట్టుకుంటారు.

డబ్బు కోల్పోతే.. జీవితం ముగిసినట్లేనా?
అయితే.. డబ్బు కోల్పోయినంత మాత్రాన జీవితం ముగిసిపోయినట్లు కాదు. ఆ నష్టం నుంచి మనం ఏం నేర్చుకున్నామన్నదే ముఖ్యం. ఒకసారి తప్పు జరిగితే, అదే తప్పు మళ్లీ జరగకుండా జాగ్రత్తపడాలి. ఎక్కడ పొరపాటు చేశామో అర్థం చేసుకుని, మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. అలా చేసినప్పుడే మనం ఆర్థికంగా ఎదగగలుగుతాం.

ఇదీ చదవండి: పసిడి ప్రియులకు షాక్.. బంగారం ధరల్లో మార్పు!

మన చదువుల్లో కూడా ఇదే సమస్య కనిపిస్తుంది. తప్పు చేస్తే.. తిడతారనే భయంతో చాలామంది కొత్త విషయాలు ప్రయత్నించడానికి వెనుకాడతారు. కానీ జీవితంలో ప్రతి తప్పు ఒక పాఠమే. తప్పులు చేయకూడదని భయపడటం కంటే, చేసిన తప్పుల నుంచి నేర్చుకోవడం ముఖ్యం. అందుకే రాబర్ట్ కియోసాకి, ఆయన భార్య కిమ్ కలిసి 'క్యాష్‌ఫ్లో' అనే బోర్డ్ గేమ్‌ను రూపొందించారు. నిజమైన డబ్బును నష్టపోకుండా.. ఆటలో డబ్బును ఉపయోగిస్తూ ఆర్థిక నిర్ణయాలు ఎలా తీసుకోవాలో నేర్చుకోవడం దీని ఉద్దేశం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement