అమాల్గమేషన్ రద్దుపై పునఃపరిశీలన చేయాలి శివాలయం, ఆంజనేయ స్వామి ఆలయాల నిర్మాణం పూర్తి చేయాలి సూర్యలంకలో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు కృషి చేయాలి మాజీ డెప్యూటీ స్పీకర్ కోన
బాపట్ల: మాకర్లవారి రామానుజ కూటమికి సంబంధించి గతంలో తీసుకున్న అమాల్గమేషన్(భావనారాయణస్వామి దేవాలయం, మాకర్లవారి రామానుజ కూటమిన్ని కలిపి అభివృద్ధికి ఆర్డర్స్) రద్దుపై పునఃపరిశీలన చేయాలని మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు. సోమవారం స్థానిక కోన చాంబర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. దశాబ్దాలుగా రామానుజ కూటమి ఏ విధంగా క్షీణదశకు చేరుకుందో బాపట్ల ప్రజలందరికీ తెలుసని ఆయన పేర్కొన్నారు. మాకర్లవారు ఏర్పాటు చేసిన కూటమి ఆశయాలను కొనసాగించడంతో పాటు, బాపట్ల క్షేత్రపాలకుడైన శ్రీ భావనారాయణ స్వామి దేవస్థానం అభివృద్ధికి శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో గతంలో చర్యలు చేపట్టినట్లు తెలిపారు. తాను డెప్యూటీ స్పీకర్‌గా ఉన్న సమయంలో ఎండోమెంట్ శాఖ అధికారులతో సంప్రదించడంతో పాటు, బాపట్లకు చెందిన మాకర్లవారి కుటుంబాలకు, కూటమితో అనుబంధం ఉన్నవారికి, భక్తులకు సంబంధించిన వర్గాలతో చర్చించి ఒక శాశ్వత పరిష్కారం కోసం అమాల్గమేషన్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లినట్లు కోన రఘుపతి వివరించారు. శిథిలావస్థకు చేరిన పాత రామానుజ కూటమి స్థానంలో టీటీడీ ఆలయ సత్రాలను తలపించే విధంగా ఆధునిక సౌకర్యాలతో ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మించామని తెలిపారు. ఆ భవన నిర్మాణంలో భావనారాయణ స్వామికి సంబంధించిన భక్తుల విరాళాలు కూడా ఉన్నాయన్న సంగతి మనము మరువకూడదని చెప్పారు. ఆ భవనాన్ని బ్యాంకుకు అద్దెకు ఇవ్వడం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఒకవైపు భావనారాయణ స్వామి దేవస్థానం అభివృద్ధికి, మరోవైపు మాకర్లవారి ఆశయాల సాధనకు ఉపయోగపడేలా శాశ్వత ఆదాయ వనరుగా రూపొందించినట్లు చెప్పారు. ఇటువంటి నిర్ణయాలు ఏ ఒక్కరివో కొంతమంది ఓ కాకుండా, బాపట్ల వాసులు, భక్తుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని చేయాల్సిన నిర్ణయంగా ఆయన పేర్కొన్నారు.
గతంతో పోలిస్తే మెరుగ్గా ఆలోచించి, ఆ సత్ర నిర్వహణలో లోటుపాట్లు ఉంటే ఎండోమెంట్ శాఖ వారితో కూడా చర్చించి అదే విధంగా భక్తులు, కమిటీలతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని ఇటువంటి ఆర్డర్ల ద్వారా మొత్తం దేవాలయ నిర్వహణలో మాకర్ల వారే ఆశయాలను డోలాయమానంలో పడేయకూడదని హితవు పలికారు. ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ చర్చించినట్లు చెప్పారు.
ఆలయాల నిర్మాణం పూర్తి చేయాలి
బాపట్లలో భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న శివాలయం, ఆంజనేయ స్వామి దేవాలయాల నిర్మాణాన్ని కూడా పూర్తి చేసే విధంగా ప్రభుత్వం, అధికారులు చొరవ తీసుకోవాలని కోన రఘుపతి కోరారు. ‘మనం అభివృద్ధి చేయాలనుకోవడమే కాదు.. అభివృద్ధి చేతల్లో కనిపించాలి’ అని ఆయన అన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనకు ఇప్పటికే రెండున్నర సంవత్సరాలు గడిచాయని, ఇకనైనా భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ అంశాలను త్వరితగతిన పరిష్కరించి, ఆలయాల నిర్మాణాలను పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సూర్యలంకలోనే బాపట్ల ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయాలి
బాపట్ల పర్యాటక రంగం అభివృద్ధికి అత్యంత కీలకమైన అంశంగా విమానాశ్రయం ఏర్పాటును పరిగణించాలని కోన రఘుపతి అన్నారు. తమ హయాంలో ప్రతిపాదించిన విధంగానే బాపట్ల సూర్యలంకలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ప్రతిపాదనను కేవలం రాజకీయ అంశంగా కాకుండా బాపట్ల భవిష్యత్ అభివృద్ధి, పర్యాటక రంగం, ఆర్థికాభివృద్ధికి సంబంధించిన ముఖ్యమైన అంశంగా చూడాలని అన్నారు. ‘బాపట్ల అభివృద్ధి కోసం పార్టీలు, రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బాపట్ల అభివృద్ధి కోసం అవసరమైన ప్రతి అంశంలో సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం’ అని కోన రఘుపతి స్పష్టం చేశారు. సమావేశంలో ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు కాగిత సుధీర్‌బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, ఉయ్యూరు లీలా శ్రీనివాసరెడ్డి, పార్టీ నాయకులు కోకి రాఘవరెడ్డి, వడిముక్కల డేవిడ్, కొక్కిలిగడ్డ చెంచయ్య, ఇనగలూరి మాల్యాద్రి, పీటా వేణుగోపాల్,మోర్ల సముద్రాలగౌడ్,గంగిశెట్టి రత్తయ్య, జోగి రాజా,ఆట్ల ప్రసాద్‌రెడ్డి,జాలిరామిరెడ్డి,పిన్నిబోయిన ప్రసాద్ తదితరులున్నారు.


