న్యూస్‌రీల్
నమ్మించేదెట్లా..?
వైఎస్సార్ సీపీ నిరసనలతోనే కేసు
మంగళవారం శ్రీ 25 శ్రీ ఆగస్టు శ్రీ 2026
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడనే నానుడిని పెదకాకాని మల్లేశ్వర స్వామి దేవస్థాన అధికారులు, పూజారులు నిజం చేస్తున్నారు సాక్షాత్తు భ్రమరాంబ అమ్మవారి పవిత్ర మంగళసూత్రం అపహరణకు గురైనా దేవదాయ శాఖ అధికారులు గానీ, పోలీసులకు గానీ చీమకుట్టినట్లయినా లేకపోవడం దారుణం. హిందూ ధర్మ పరిరక్షణ... సనాతనీ.. అని హిందుత్వ ముసుగు వేసుకున్న ప్రభుత్వ పెద్దలు సైతం దీనిపై నోరు మెదపని పరిస్థితి. పైగా విషయం బయటకు పొక్కితే ఎక్కడ పరువు పోతుందోననే భయంతో అమ్మవారి మంగళసూత్రం అపహరణకు గురైన వారం రోజుల వరకు కనీసం కేసు కూడా నమోదు చేయని పరిస్థితి. పోలీసులు సైతం కేసు నమోదు చేయకుండా దొంగతనానికి సంబంధించిన దర్యాప్తును ప్రారంభించడం చూస్తుంటే ఏస్థాయిలో నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. దీనిపై హిందూ సంఘాల ప్రతినిధులు ఆలయ అధికారులకు ఫిర్యాదు చేసినా తరువాత మాత్రమే అమ్మవారి నగల అదృశ్యంపై ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అమ్మవారి ఆభరణాలు అదృశ్యంపై సీరియస్‌గా విచారణ జరిపి దొంగలు ఎవరో తేల్చాల్సిన పోలీసులు అధికార పార్టీ నేతల ఒత్తిడితో కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా సంఘటన వెలుగులోకి వచ్చిన నాలుగు రోజుల వరకు కనీసం కేసు కూడా నమోదు చేయకుండా ఆలయ పూజారులను పోలీసు స్టేషన్‌కు పిలిచి విచారించారు. ఆలయానికి సంబంధించి 25 మంది పూజారులు, సిబ్బంది ద్వారా తలా రూ. 50వేలు చొప్పున నగదు సమీకరించి అమ్మవారికి కొత్త ఆభరణాలు కొని అలంకరించాలంటూ అధికార పార్టీ ముఖ్య నేత హుకుం జారీ చేసినట్లు సమాచారం. ఆయన ఆదేశంతో డబ్బులు వసూలు చేయడం, తెనాలిలో ఆభరణాలు తయారు చేయడం చకచకా జరిగినట్లు భోగట్టా. అంటే అమ్మవారి ఆభరణాలు అపహరణకు గురయ్యాయని బయటకు తెలిస్తే వ్యతిరేకత వ్యక్తమవుతుందనే భయంతో దీన్ని కప్పి పుచ్చే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అయితే వీరిలో కొందరు తాము తప్పు చేయకుండా డబ్బులు ఎందుకు ఇవ్వాలంటూ అడ్డం తిరగడంతో విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పోలీసు స్టేషన్‌కు వెళ్లి నిలదీయడంతో ఎట్టకేలకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మల్లేశ్వర స్వామి దేవస్థానంలో గత కొంతకాలంగా జరుగుతున్న వ్యవహారాలపై హిందూ సంఘాలు, భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారి నగలు అపహరణకు గురికావడం ఇది మొదటిసారి కాదని, గతంలో ఇలా జరిగినా సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఈఓ గోగినేని లీలాకుమార్‌కు హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు, భక్తులు ఫిర్యాదులు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో నిరసన ర్యాలీ చేస్తున్న వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, నేతలు (ఫైల్)
అయితే ఆలయ పవిత్రత పేరుతో ఈ విషయాన్ని ఇంతటితో ముగించాలని, ఇప్పటికే చేయించిన కొత్త బంగారు ఆభరణాన్ని అమ్మవారికి అలంకరించేందుకు అనుమతి ఇవ్వాలంటూ పూజారులు అధికారులను అనుమతి కోరినట్లు సమాచారం. అయితే కొత్త ఆభరణం అలంకరించామంటే విమర్శలు వస్తాయని, పోయిన ఆభరణమే దొరికిందని ఎలా నమ్మించాలనే దానిపై పథకరచన చేస్తున్నట్లు భోగట్టా. ఆరు నెలల క్రితం అమ్మవారికి అలంకరించే వడ్రాణం గొలుసులు మాయమైనట్లు మొదట చెప్పి, ఆతరువాత బీరువాలో వెతకగా దొరికాయంటూ కొత్త బంగారపు వస్తువులు సిద్ధం చేయించి దొంగతనానికి పాల్పడిన సిబ్బందిని ఆలయ అధికారులు కాపాడారనే ఆరోపణలు ఉన్నాయి. అమ్మవారి ఆభరణాల విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉండటంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలోనూ రాజకీయాలను జొప్పించి పవిత్రతను దెబ్బతీస్తున్నారని అధికారపార్టీ నేతలపై భక్తులు, హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.
ఈనెల 14వ తేదీన అమ్మవారి మెడలో ఆభరణాలు అలంకరించారు. ఈనెల 18వ తేదీన అర్చకులు చూసి అమ్మవారి మంగళసూత్రం, నాన్‌తాడు కనిపించడం లేదని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈవిషయంపై ఆలయ అధికారులు ఈనెల 19వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఈనెల 21వ తేదీ శుక్రవారం వరకు కేసు నమోదు కాకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. అధికార పార్టీ ఎమ్మెల్యే ఒత్తిడి వల్లే కేసు నమోదుకాలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే తాము ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని ఆలయ అధికారులు, తమకు ఫిర్యాదే అందలేదని పోలీసులు ఒకరిపై ఒకరు చెప్పుకోవడం చూస్తుంటే అధికారుల నిర్లక్ష్యం ఏస్థాయిలో ఉందో అర్ధమవుతోంది. అమ్మవారి ఆభరణాల అదృశ్యంపై కేసు నమోదు చేయాలంటూ ఈనెల 21న వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. దీంతో పోలీసులు అదేరోజు రాత్రి కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈనెల 19వ తేదీన వైఎస్సార్ సీపీ పెదకాకాని మండల అధ్యక్షుడు ముడియాల మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ నేతలు అమ్మవారి ఆభరణాల అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయకుండానే పోలీసులు దర్యాప్తు చేపట్టడం విశేషం.
పెదకాకాని మల్లేశ్వరస్వామి
దేవస్థానంలో చోరీ జరిగి
వారం దాటుతున్నా పట్టించుకోని
అధికారులు, పోలీసులు
గుడిలో 25 మంది పూజారులతో
కొత్త ఆభరణం
కొనిపించే యత్నం!
అందుకోసం ఒక్కొక్కరు
రూ. 50 వేలు చెల్లించాలని హుకుం
మొదట ఒప్పుకోకపోయినా
చివరకు కొత్త నగ చేయించిన వైనం!
పోయింది దొరికిందని ఎలా
నమ్మించాలనే దానిపైనే పథక రచన!


