మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు..
‘సాక్షి’ చెప్పింది అక్షర సత్యం
● ‘తమ్ముళ్ల స్వాహా... నాటకాలు వహ్వా’
కథనానికి స్పందించిన ఏసీబీ
● ‘సాక్షి’ కథనం తరువాత కమిటీలో
సభ్యులను నియమించిన వైనం
● ఏసీబీ తనిఖీ చేసేవరకు
కనీస విచారణ చేయని కమిటీ
● ఇంజినీరింగ్ విభాగం డ్రాయింగ్
బ్రాంచ్‌లో అవినీతి బట్టబయలు
● 156 వర్కుల్లో అవకతవకలు
జరిగినట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ‘సాక్షి’ చెప్పింది అక్షర సత్యమైంది. గుంటూరు నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ విభాగంలో జరుగుతున్న అవినీతిపై ‘సాక్షి’ ప్రచురించిన వరుస కథనాలతో లెస్ టెండర్ల ద్వారా పనులు దక్కించుకుని బిల్లులు చేయించుకునే సమయంలో వాటిని ట్యాంపరింగ్ చేసి అధిక మొత్తంలో డబ్బులు కాజేసిన వైనాన్ని వెలికి తీసింది. దీని వల్ల కార్పొరేషన్ ఆదాయానికి రూ. కోట్లలో గండి పడిందనే విషయాన్ని ‘సాక్షి’ గత ఏడాది ‘రూ. కోట్లలో తమ్ముళ్ల లూటీ’ అనే కథనాన్ని ప్రచురించడంతో ఇంజినీరింగ్ విభాగం డ్రాయింగ్ బ్రాంచ్‌లో జరుగుతున్న అవినీతిని బయటకు తీసుకొచ్చింది. 2017 నుంచి ఇప్పటి వరకు సుమారు 70 మంది కాంట్రాక్టర్లు లెస్ టెండర్ల పేరుతో రూ. 50కోట్లకు పైగా కార్పొరేషన్ నిధులను కాజేశారనే విషయం బయటపడడంతో అధికారులు తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని చేతులు దులుపుకొన్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంటే ఉదాహరణకు 15 శాతం లెస్ టెండర్‌కు పనులు దక్కించుకున్న వారికి వర్క్ ఆర్డర్‌లో మాత్రం 1.5 శాతం లెస్‌కు టెండర్ వేసినట్లుగా చూపిస్తారు. దీంతో నగరపాలక సంస్థకు టెండర్ దరను బట్టి 13.5 శాతం నష్టం జరుగుతోందన్నమాట. దీన్ని ప్రశ్నిస్తూ ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. దీంతో ఇద్దరు చీఫ్ ఇంజినీర్‌లతో కమిటీని ఏర్పాటు చేయడంతోపాటు, 70 మందికి పైగా కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని అప్పటి జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. అయితే ఇది జరిగి ఏడాది దాటుతున్నా ఇప్పటి వరకు విచారణ కమిటీనే నియమించలేదని, పాత కాంట్రాక్టర్లే కొత్తపేర్లతో పనులు దక్కించుకుని తిరిగి యధేచ్చగా దోపిడీకి పాల్పడుతున్నారనే వైనంపై ‘తమ్ముళ్ల స్వాహా... నాటకాలు వాహ్వా‘ అనే కథనాన్ని గత నెల 22వ తేదీన ‘సాక్షి’ ప్రచురించింది. దీంతో హడావుడిగా కమిటీని అయితే నియమించారు గాని, విచారణ మాత్రం కనీసం మొదలు కాకపోవడం చూస్తుంటే అధికార పార్టీ నేతల ఒత్తిడి ఏస్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టిన కార్పొరేషన్ ఉన్నతాధికారులు లెస్ టెండర్లను ట్యాంపరింగ్ చేసి ఎక్కువ లెస్‌ను కాస్త తక్కువ లెస్‌గా మార్చి కార్పొరేషన్ ఆదాయానికి రూ.కోట్లలో గండి కొట్టిన ఇంజినీరింగ్ అధికారులపై మాత్రం చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
వెలుగులోకి భారీస్థాయి అవినీతి
గుంటూరు నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ విభాగంలో జరిగిన అవకతవకలపై పూర్తి స్థాయిలో సమాచారం సేకరించిన ఏసీబీ అధికారులు సోమవారం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భారీ స్థాయిలో అవినీతి జరిగినట్లు గుర్తించినట్లు సమాచారం. ‘సాక్షి’ లో ప్రచురితమైన విధంగా సుమారు 156 పనుల్లో లెస్ టెండర్లు కోడ్ చేసి ఆ తరువాత వాటిని ట్యాంపరింగ్ చేసి ఎక్కువ లెస్‌ను కాస్త తక్కువ లెస్‌గా మార్చి భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డట్లు ఏసీబీ అధికారులు అధికారికంగా ప్రకటించారు. అసలు టెండరు వేయకుండానే టెండర్లు వేసినట్లు డాక్యుమెంట్లు సృష్టించి పనులు చేసుకున్నట్లు ఏసీబీ విచారణలో తేలినట్లు సమాచారం. అంతేకాకుండా ఒకసారి వేసిన రోడ్డుకు రెండు సార్లు బిల్లులు చేసి డబ్బులు స్వాహా చేసినట్లు గుర్తించినట్లు తెలిసింది.
అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు
ఇంజినీరింగ్ విభాగంలో జరిగిన అవినీతిపై ఏసీబీ అధికారులు రైడ్ చేసి పూర్తి స్థాయిలో విచారణ జరుపుతుండటంతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తమ చేత అవినీతి చేయించిన అధికార పార్టీ నేతలకు ఫోన్లు చేసి తమను బయటపడేయాలంటూ వేడుకుంటున్నట్లు సమాచారం. ఇంజినీరింగ్ విభాగంలో ఏసీబీ అధికారుల తనిఖీతో టౌన్ ప్లానింగ్ విభాగం, రెవెన్యూ, ప్రజారోగ్య విభాగం ఇలా అన్ని విభాగాలకు చెందిన అధికారులు ఎక్కడ తమ శాఖాలపై కూడా ఏసీబీ కన్ను పడుతుందోననే భయంతో వణికి పోతున్నారు. సోమవారం అర్ధరాత్రి వరకు ఏసీబీ సోదాలు జరుగుతుండటంతో ఎక్కడి దొంగలు అక్కడే గప్‌చుప్ అన్నట్లుగా అవినీతి అధికారులు వ్యవహరిస్తున్నారు.
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): గుంటూరు నగర పాలక సంస్థ (జీఎంసీ) ఇంజినీరింగ్ విభాగంలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రంగంలోకి దిగారు. ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ ఆదేశాల మేరకు గుంటూరు ఏసీబీ డీఎస్పీ టీవీవీ ప్రతాప్ కుమార్, సీఐలు బి.నాగరాజు, జీఎల్ శ్రీనివాసరావు, కె.శ్రీనివాసరావు, బీవీవీ సుబ్బారావు, కె.శ్రీనివాసరావు, వి.సురేష్, ఎస్‌ఐలు ఊరుకుందా, సుబ్బయ్యతో పాటు మరో పది మందితో కూడిన బృందం సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో జీఎంసీ కార్యాలయంలోని ఇంజినీరింగ్ విభాగంపై ఆకస్మిక దాడులు నిర్వహించింది. 2017 నుంచి 2025 వరకు చేపట్టిన పలు ఇంజినీరింగ్ పనుల్లో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ తనిఖీలు చేపట్టారు. నగర పరిధిలో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, తాగునీటి పైప్‌లైన్ పనులకు సంబంధించిన ఈ–ప్రొక్యూర్‌మెంట్ టెండర్లలో కాంట్రాక్టర్లు తక్కువ శాతం (లెస్ పర్సంటేజ్) కోడ్ చేసినప్పటికీ, అధికారులతో కుమ్మకై ్క రికార్డులను ట్యాంపర్ చేసినట్లు అధికారులు గుర్తించారు. కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరించి కార్పొరేషన్ ఖజానాకు భారీగా ఆర్థిక నష్టం చేకూర్చినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. గుంటూరు నగర పరిధిలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన దాదాపు 156 పనుల్లో ఈ తరహా నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు ఏసీబీ అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం సంబంధిత ఫైళ్లను, దస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ తనిఖీలు మంగళవారం సాయంత్రం వరకు కొనసాగుతాయని, పూర్తిస్థాయి పరిశీలన అనంతరం కార్పొరేషన్‌కు ఎంత మొత్తంలో నష్టం వాటిల్లిందనే వివరాలను అధికారికంగా వెల్లడిస్తామని ఏసీబీ డీఎస్పీ ప్రతాప్‌కుమార్ మీడియాకు తెలిపారు. ఇదిలా ఉండగా ఇంజినీరింగ్ విభాగంలో కుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో ఏసీబీ అధికారులకు ఓ డెస్క్ సొరుగులో రూ.40వేలు గుర్తించారు. ఈ సీటులో గతంలో డీఈఈ హానీఫ్ కూర్చునేవారు ప్రస్తుతం ఆయన వారం రోజులు సెలవులో ఉండటంతో ఈ సీటులో వేరే అధికారులు కూడా కూర్చున్నట్లు సమాచారం. ఏసీబీ అధికారులు వచ్చారని భయపడి ఎవరైనా సొరుగులో నగదు పెట్టి వెళ్లిపోయారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నగదు పై కూడా పూర్తిస్థాయిలో విచారిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.


