● తొలిరోజు నాలుగు హుండీల ద్వారా
రూ.20,19,241 నగదు, 52 గ్రాములు
వెండి, 23 గ్రాముల బంగారం లభ్యం
● లెక్కింపును లైవ్ ద్వారా పరిశీలించిన
వక్ఫ్‌బోర్డు చైర్మన్, అధికారులు
పెదకాకాని: బాజీ బాబా దర్గాలో హుండీల కానుకలు లెక్కింపు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వక్ఫ్‌బోర్డు సూపరింటెండెంట్ షేక్ హైదర్ బాషా తెలిపారు. పెదకాకాని హజరత్ సయ్యద్ బాజీ షహీద్ అవులియా బాబా దర్గాలో సోమవారం హుండీ లెక్కింపు ప్రారంభమైంది. లెక్కింపు కార్యక్రమం రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధికారుల ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీసుల సమక్షంలో లెక్కింపు చేపట్టినట్లు వక్ఫ్‌బోర్డు అకౌంట్స్ అధికారి, హుండీల లెక్కింపు డిప్యూటీ టీం ఇన్‌చార్జి సయ్యద్ ఆదం షఫీ తెలిపారు. దర్గాలో 17 నెలల హుండీల కానుకలు లెక్కింపు సందర్భంగా ఎటువంటి అవకతవకలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గతంలో హుండీల లెక్కింపులో చేతివాటం జరిగిన నేపథ్యంలో సీసీ కెమెరాల ఏర్పాటు, హుండీల లెక్కింపు వీడియో ప్రక్కనే ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీలో కనిపించడంతోపాటు నేరుగా లైవ్‌లో వక్ఫ్‌బోర్డు చైర్మన్, అధికారులు పరిశీలించారు. దర్గాలో మొత్తం ఏడు హుండీలు ఉండగా సోమవారం నాలుగు హుండీలు తెరచి అందులోని కానుకులు లెక్కించారు. ఈ హుండీల ద్వారా బాజీబాబాకు రూ.20,19,241 నగదు, 52 గ్రాములు వెండి, 23 గ్రామలు బంగారు లభించాయని దర్గా ఈఓ షేక్ ఖాజా మస్తాన్ తెలిపారు. మిగిలిన హుండీల్లోని కానుకల లెక్కింపు కార్యక్రమం మంగళవారం ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.


