మార్టూరులో హైడ్రామా హత్య కేసులో తప్పించుకు తిరుగుతున్న నిందితులు మాటువేసి బొల్లాపల్లి టోల్‌గేట్ వద్ద పట్టుకున్న పోలీసులు తెలంగాణ పోలీసుకు అప్పగింత
మార్టూరు: ఓ హత్య కేసులో అజ్ఞాతంలో ఉన్న నిందితులు పారిపోతుండగా మార్టూరు పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌లో ఆదివారం రహస్యంగా నిర్వహించిన ఆపరేషన్ తాలూకు వివరాలు సోమవారం విడుదల చేశారు. వివరాలు.. తెలంగాణ ప్రభుత్వంలో అధికార పార్టీలోని రెండు వర్గాల మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరులో భాగంగా ఓ వర్గానికి చెందిన హత్య కేసులో నిందితులుగా అనుమానిస్తున్న ముగ్గురిని ఆదివారం ఉదయం 10 గంటలకు హైవే పెట్రోలింగ్ సిబ్బంది రవి తదితరుల సాయంతో స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసులో నిందితులుగా భావిస్తున్న ఈ ముగ్గురు వ్యక్తులు ముందస్తు బెయిలు కోసం అప్పీలు చేసుకొని ప్రస్తుతం అజ్ఞాతంలో సంచరిస్తున్నారు.
పక్కా సమాచారంతో మాటు వేసి..
సదరు వ్యక్తులు బెంగళూరు, కడప, నెల్లూరు పట్టణాల మీదుగా ప్రయాణిస్తూ కారులో మార్టూరు వైపు వస్తున్నట్లు తెలుసుకున్న తెలంగాణ పోలీసులు కారు నంబరు వివరాలను స్థానిక పోలీసులకు, హైవే పెట్రోలింగ్ సిబ్బందికి పంపించి అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం పది గంటల ప్రాంతంలో బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద అనుమానిత వ్యక్తుల కారును గమనించిన హైవే పెట్రోలింగ్ సిబ్బంది రవి, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు అడ్డగించారు. సమాచారం అందుకున్న సీఐ వై.శ్రీనివాసరావు నిందితులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం తెలంగాణ నుంచి వచ్చిన పోలీసు అధికారులు నిందితులను తీసుకుని హైదరాబాద్ తరలించారు. అధికారులు అదుపులోకి తీసుకొన్న ముగ్గురు వ్యక్తుల్లో హైదరాబాద్‌లోని మాదాపూర్ ప్రాంతానికి చెందిన ముత్యాల మహేందర్‌రెడ్డి, బత్తిని అరుణ్ కుమార్‌రెడ్డి, ఉప్పల్‌కు చెందిన పసుపులేటి కార్తిక్‌లుగా సమాచారం. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించి సహకరించిన హైవే పెట్రోలింగ్ సిబ్బంది రవి, హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులకు పోలీస్ అధికారులు నగదు రివార్డులు అందజేశారు.


