బాపట్ల: వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు సత్యంరాజు కూరపాటి పేర్కొన్నారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు, అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్‌ను సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదికలో కలిశారు. న్యాయమైన కోర్కెల పరిష్కారం కోరుతూ దశలవారీగా చేపట్టిన ఆందోళనలో చేపట్టడం జరిగిందని తెలిపారు. సమానపనికి సమానమైన వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆందోళన చేపట్టినట్లు కూరపాటి తెలిపారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో స్టాఫ్ నర్స్‌ల విభాగం నుంచి కల్పన, గోపి, ఉష, ప్రభాకర్, ఫార్మాసిస్టులు నళిని, శాంతి, సుధా, ల్యాబ్ టెక్నీషియన్లు నీలిమ, సునీత, శివాజీ బడుగు, చంద్రశేఖర్, శివచంద్ర, రేడియోగ్రాఫర్లు సుకన్య, బయో మెడికల్ ఇంజనీర్ నళిని తదితరులు పాల్గొన్నారు.
28న సంస్కృత
భాషా దినోత్సవం
బాపట్ల: ఆంధ్రప్రదేశ్ తెలుగు, సంస్కృత అకాడమీ ఆధ్వర్యంలో ఈనెల 28వ తేదీన సంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా జిల్లెళ్లమూడిలోని మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ మెరుగుమల్లి వెంకటేశ్వరరావు తెలిపారు. అకాడమీ చైర్మన్ ఆర్డీ శరత్చంద్ర ఆధ్వర్యంలో కళాశాలలోని తిరుపతి, తిరుమల దేవస్థానం కల్యాణ మండపంలో ఈ వేడుకలు జరుగుతాయని తెలిపారు. సంస్కృత భాష గొప్పతనాన్ని చాటి చెప్పేలా ఈ కార్యక్రమం ఉండబోతున్నదనీ ఈ కార్యక్రమంలో పలు సంస్కృత భాషా పండితులు, అభిమానులు పెద్దలు పాల్గొనబోతున్నారని తెలిపారు. ఓరియంటల్ కళాశాలల వైభవాన్ని చాటి చెప్పేలా భగవద్గీత కంఠస్థ పోటీలు, అదేవిధంగా నృత్య ప్రదర్శనలు, శ్రీ కృష్ణార్జున సంవాదం వంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈ కార్యక్రమంలో అందరినీ అలరించబోతున్నాయని తెలిపారు.
కొల్లూరు: ఇండియా తరపున స్కేటింగ్ పోటీలలో పాల్గొని పతకాలు సాధించిన క్రీడాకారులకు స్థానికంగా అపూర్వ స్వాగతం లభించింది. కొల్లూరుకు చెందిన గరిక రిత్విక్, మునిపల్లి పునీత్‌లు ఇండో–నేపాల్ చాంపియన్ షిప్ పోటీలలో భాగంగా నేపాల్‌లోని పోక్రాలో జరిగిన స్కేటింగ్ పోటీలలో ఇండియా జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఈనెల 19 నుంచి 21 వరకు నిర్వహించిన అండర్–14 ఏరో స్కేట్ బాల్ పోటీలతోపాటు, వ్యక్తిగత స్కేటింగ్ పోటీలలో రిత్విక్ రెండు గోల్డ్ మెడల్స్, రెండు సిల్వర్ మెడల్స్ సాధించగా, పునీత్ గోల్డ్ మెడల్ పొందాడు. పోటీలలో పాల్గొని సోమవారం స్వగ్రామమైన కొల్లూరు వచ్చిన ఆటగాళ్లను స్థానికులు ఘనంగా స్వాగతించారు. కొల్లూరు ఎంపీపీ కమ్మెల నాంచారమ్మ పూలమాలలతో సత్కరించి భవిష్యత్తులో మరిన్ని పోటీలలో రాణించాలని ఆకాంక్షించారు. ఇరువురు క్రీడాకారులను కొల్లూరు శివారు గాంధి నగర్ నుంచి వారు విద్యను అభ్యసిస్తున్న ఫోర్ ప్రంట్ పాఠశాల వరకు వారు సాధించిన పతకాలు, షీల్డ్స్‌తో ఓపెన్ టాప్ కారులో ఊరేగింపుగా తరలించారు. ఇరువురు క్రీడాకారులను పలువురు అభినందించారు.
పోక్సో కేసులో
నిందితుడికి జైలు
కొల్లూరు: పోక్సో కేసులో నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించినట్లు కొల్లూరు పోలీసులు సోమవారం వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... గతేడాది జనవరిలో కొల్లూరు ఎస్సీ కాలనీకి చెందిన 2వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అదే ప్రాంతానికి చెందిన ఉదరగుడి లక్ష్మయ్య (లచ్చిగాడు) అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్‌ఐ జి. ఏడుకొండలు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. తెనాలి పోక్సో కోర్టులో విచారణలో ఉన్న కేసులో సోమవారం న్యాయమూర్తి ఎం.ఇందిరా ప్రియదర్శిని సాక్ష్యాలు, దర్యాప్తు అధికారి సేకరించిన భౌతిక ఆధారాలను పరిగణలోకి తీసుకొని నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. అత్యాచారయత్నానికి యత్నించిన నిందితుడుకి ఏడేళ్లు కారాగార శిక్ష, రూ.7 వేలు జరిమానా విధించారు. బాధిత బాలికకు రూ.లక్ష పరిహారం అందజేయనున్నట్లు న్యాయమూర్తి తన తీర్పులో వెల్లడించారు. పోక్సో కేసులో నిందితుడికి నేరం రుజువై జైలు శిక్ష పడేందుకు నిర్భయంగా సాక్ష్యం చేప్పే విధంగా సాక్షులకు ధైర్యమిచ్చిన పోలీసు సిబ్బందిని, కోర్టు మానిటరింగ్ సిబ్బందిని, ప్రత్యేక పీపీ వి. రాఘవయ్యను అభినందించినట్లు పోలీసులు తెలిపారు.


