బాపట్ల: ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ తెలిపారు. జిల్లా పరిశ్రమల ఎగుమతులు ప్రోత్సాహక కమిటీ సమావేశం సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన వనరుల లభ్యతపై నివేదిక సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వ్యవసాయ ఉత్పత్తులు, పర్యాటక రంగ ప్రాంతాలలో పరిశ్రమల స్థాపనకు అనుకూలతపై నివేదిక ఇవ్వాలన్నారు. నూతనంగా పరిశ్రమల స్థాపన, పరిశ్రమల పునరుద్ధరణ కోసం నమోదైన దరఖాస్తులను వేగంగా అనుమతులు ఇవ్వాలని కోరారు. 34 యూనిట్లకు గాను 31 యూనిట్లకు వివిధ శాఖల నుంచిసింగల్ డెస్క్ పాలసీ ద్వారా అనుమతులు జారీ చేశామన్నారు. మిగిలిన యూనిట్లకు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఫ్యాక్టరీస్ డిపార్టుమెంట్‌ను ఆదేశించారు. ఏపీ పారిశ్రామిక అభివృద్ధి విధానం 2024–29 ద్వారా జిల్లా పరిశ్రమల శాఖ నుంచి ఎనిమిది యూనిట్లకు రూ.92 లక్షల రాయితీలు మంజూరు కోసం చేసిన సిఫార్స్‌లను కలెక్టర్ ఆమోదించారు. తద్వారా 65 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఏపీఐఐసీ ద్వారా భూముల కేటాయింపు పరిశ్రమల స్థాపనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాణిజ్య పన్నుల శాఖ ద్వారా ఏడాదిలో రూ.17.3 కోట్లు వసూలు అయ్యిందని కలెక్టర్ చెప్పారు. ప్రొఫెషనల్ పన్నుల కింద రూ.65.30 లక్షలు వసూలు చేశామన్నారు. బాపట్ల, చీరాల డివిజన్ కింద జీఎస్టీ వసూలు లక్ష్యాలను చేరుకోవడంపై అధికారులను కలెక్టర్ అభినందించారు. సమావేశంలో కన్వీనర్ జిల్లా పరిశ్రమల అధికారి వై.రామకృష్ణ, వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ కనికిరెడ్డి, లీడ్ బ్యాంకు మేనేజర్ శివకృష్ణ, నాబార్డ్ డీడీఎం జె.రవి, డెప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆర్.త్రినాథరావు, డెప్యూటీ జోనల్ మేనేజర్ ఎం.సువర్ణ ఫణి, జిల్లా టూరిజం అధికారి కె.బెనహర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి
పోలింగ్ స్టేషన్ల పరిధిలో హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ సంబంధిత అధికారులకు తెలిపారు. సోమవారం బాపట్ల ఆర్ట్స్, సైన్స్ కళాశాలలోని 140వ పోలింగ్ స్టేషన్‌ను కలెక్టర్ పరిశీలించారు. పోలింగ్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ఓటర్ జాబితాను ఆయన పరిశీలించారు. పోలింగ్ స్టేషన్ పరిధిలో గైర్హాజరు, ఇల్లు మారటం, మరణాల జాబితా, నోటీసుల జారీ, హియరింగ్ దరఖాస్తుల పై ఆయన బి.ఎల్.వో.ను ఆరా తీశారు. హియరింగ్ కోసం మొత్తం 69 దరఖాస్తులు వచ్చాయని బీఎల్‌ఓ కలెక్టర్‌కు వివరించారు. ఈ దరఖాస్తులకు సంబంధించి హియరింగ్ ప్రక్రియను ఒక ప్రణాళిక ప్రకారం వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్నికల మాడ్యూలను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి కే ప్రభాకర్, బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ హరికుమార్, తహసీల్దార్ సలీమా, మున్సిపల్ కమిషనర్ హాసిని, ఎంపీడీఓ బాబురావు, ఏఈ ఆర్ ఓ మల్లికార్జునరావు, బీఎల్‌వో చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.
తొలగించే ఓటర్ల వివరాలు పక్కాగా నమోదు చేయాలి
ఓటర్ల జాబితా సవరణ, గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యల పరిష్కారంపై జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ సోమవారం కలెక్టరేట్‌లోని న్యూ వీడియో కాన్ఫరెన్‌న్స్ హాలులో అధికారులతో వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణ, మ్యాపింగ్ ప్రక్రియపై ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, బీఎల్‌ఓలు, డీపీఓ, ఎంపీసీలు, ఎంపీడీఓలతో సమీక్షించారు. ఓటర్ల జాబితా నుంచి తొలగించే ప్రతి ఓటరుకు జారీ చేసిన నోటీసుల వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి లవన్న, ఎలక్షన్ సూపరింటెండెంట్ షఫి తదితరులు పాల్గొన్నారు.
తాగునీటి సరఫరాపై..
గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులపై కలెక్టర్ ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని ఏ గ్రామంలోనూ తాగునీటి సమస్య ఉండకూడదని స్పష్టం చేశారు. తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాలను వెంటనే గుర్తించి, తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ మాధవి పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్


