మదనపల్లె టౌన్: మదనపల్లె లో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ప్రజల నుంచి 72 అర్జీలు స్వీకరించారు. సమస్యల వీటిని పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని సీఐ, ఎస్‌ఐలను ఆదేశించారు.వీటిలో భూవివాదాలు (39), ఆర్థిక లావాదేవీలు(15), కుటుంబ కలహాలు(6), మోసం(5), సైబర్(1), ఇతర సమస్యలు(6) ఉన్నాయి. నడవలేని స్థితిలో వచ్చిన బాధితుల వద్దకు ఎస్పీ స్వయంగా వెళ్లి ఫిర్యాదులు స్వీకరించారు.
పోక్సో కేసులో అరెస్టు
సదుం: బాలికను వేధించిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసిన ట్లు సీఐ సాయిప్రసాద్ తెలిపారు. మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన ఓ యువకుడు ఓ బాలికను ఈనెల 15న బలవంతంగా ఇంటి నుంచి తీసుకుని వచ్చి అత్యాచార యత్నం చేయపోయాడని బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.
పాముకాటుతో మహిళా రైతు మృతి
మదనపల్లె టౌన్: వ్యవసాయ పనులు చేస్తుండగా పాముకాటుకు గురై మహిళా రైతు మృతి చెందిన విషాదకర సంఘటన బి.కొత్తకోట మండలంలో సోమవారం చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండలం లోని మోగసాలమర్రి గ్రామానికి చెందిన రైతు శంకర్ రెడ్డి భార్య, మహిళా రైతు శివమ్మ (53) రోజూ మాదిరిగానే వ్యవసాయ బోరు వద్దకు వెళ్లింది. ఉద్యాన పంటలో పనులు చేస్తుండగా విష సర్పం కాటేసింది. అస్వస్థతకు గురైన శివమ్మను కుటుంబ సభ్యులు మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
లారీ బోల్తా : డ్రైవర్‌కు గాయాలు
గాలివీడు : గాలివీడు మండలం నూడివీడి గ్రామం సమీపంలో సోమవారం లారీ బోల్తా పడింది. డ్రైవర్ వేగాన్ని అదుపు చేయలేక బోల్తా పడిందని స్థానికులు చెబుతున్నారు. డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు.
ఎరచ్రందనం దుంగలు స్వాధీనం
తిరుపతి అన్నమయ్యసర్కిల్: అన్నమయ్య జిల్లా పీలేరు రోడ్డు మార్గంలో, గుడిపాల – రాణీపేట హైవేలో రెండోచోట్ల కారులో తరలిస్తున్న 18 ఎర్రచందనం దుంగలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, వారు అక్రమ రవాణాకు ఉపయోగించిన వాహనాలను సీజ్ చేశారు. ఏఆర్‌ఎస్‌ఐ కె.మహేశ్వరనాయుడు బృందం స్థానిక అటవీ సిబ్బంది జగదీష్, ఆషాబీతో కలసి అన్నమయ్య జిల్లా కేవీ పల్లి–పీలేరు మార్గంలో పొంతల చెరువు క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. సోమవారం తెల్లవారుజామున ఒక కారు వేగంగా వస్తూ టాస్క్‌ఫోర్స్ బృందాన్ని గమనించి కారును ఆపి అందులోని వ్యక్తులు దిగి పారిపోయే ప్రయత్నం చేశారు. వారిని వెంబడించి ఇద్దరిని పట్టుకున్నారు. మరో వ్యక్తి పారిపోయాడు. అదుపులోకి తీసుకున్న వారు తమిళనాడు తిరుపత్తూరు, తిరువన్నామలై జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. 11 ఎర్రచందనం దుంగలు, కారును తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.
రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి
రొంపిచెర్ల: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన అనంతపురం– చైన్నై జాతీయ రహదారిలోని రొంపిచెర్ల క్రాస్ రోడ్డుకు సమీపంలో సోమవారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. చిన్నగొట్టిగల్లు మండలం జంగావాండ్లపల్లె గ్రామ పంచాయతీ అప్పేపల్లెకు చెందిన ఎల్లయ్య(40) జాతీయ రహదారిలోని గంగా డాబా నుంచి రొంపిచెర్ల క్రాస్ రోడ్డుకు నడిచి వెళుతుండగా ఎదురుగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో ఎల్లయ్య అక్కడిక్కడే మృతి చెందారు. ఈ విషయాన్ని స్థానికులు రొంపిచెర్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మధుసూధన్ తెలిపారు.


