48 గంటల్లోనే చోరీ కేసు ఛేదన | - | Sakshi
Sakshi News home page

48 గంటల్లోనే చోరీ కేసు ఛేదన

Jul 21 2026 12:17 AM | Updated on Jul 21 2026 12:17 AM

పక్కా స్కెచ్‌తో దొంగతనం కటకటాల్లోకి ఇద్దరు నిందితులు

లక్కిరెడ్డిపల్లి: అన్నమయ్య జిల్లా, గాలివీడు మండలంలో జరిగిన గృహచోరీ కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు.జిల్లా ఎస్పీ ధీరజ్‌ కనుబిల్లి, ఐపీఎస్‌ ఆదేశాల మేరకు పక్కా వ్యూహంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితులను అరెస్టు చేశారు. సోమవారం లక్కిరెడ్డిపల్లి సర్కిల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాయచోటి డీఎస్పీ ఎంఆర్‌ కృష్ణమోహన్‌ వివరాలను వెల్లడించారు. బాధితులు కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రతి గురువారం లక్కిరెడ్డిపల్లి మండలం, కోనంపేట సంతకు వెళ్లి అక్కడే రాత్రి బస చేసి మరుసటిరోజు ఇంటికి రావడం వారి దినచర్య. ఈ క్రమంలో ఈనెల 16న ఉదయం 8.30 గంటలకు సంతకు వెళ్లిన దంపతులు, 17వ తేదీ ఉదయం పది గంటలకు గాలివీడులోని తమ ఇంటికి చేరుకున్నారు. ఇంటి వెనుక తలుపులు, బీరువా తాళాలు పగులకొట్టి ఉండటాన్ని గమనించి షాక్‌కు గురయ్యారు. బీరువాలో భద్రపరిచిన కుటుంబ సభ్యులకు (కుమారుడు, కోడలు, మనువడు, మరదలు, అల్లుడు, భార్య) చెందిన సుమారు 210 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్లు గుర్తించారు. వెంటనే గాలివీడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు గాలివీడు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాయచోటి సబ్‌ డివిజన్‌ పోలీస్‌ అధికారి ఎంఆర్‌ కృష్ణమోహన్‌ పర్యవేక్షణలో లక్కిరెడ్డిపల్లి సీఐ హెచ్‌ కృష్ణంరాజు నాయక్‌ రంగంలోకి దిగారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా వేగంగా దర్యాప్తు పూర్తి చేసి సోమవారం ఉదయం గాలివీడు మండలం, పేరంపల్లి గ్రామం, రెడివారిపల్లి క్రాస్‌ రోడ్డు వద్ద నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 210 గ్రాముల బంగారు ఆభరణాలు, బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement