పడిగాపులు.. ప్రదక్షిణలు | - | Sakshi
Sakshi News home page

పడిగాపులు.. ప్రదక్షిణలు

Jul 21 2026 12:17 AM | Updated on Jul 21 2026 12:17 AM

అవస్థల పీజీఆర్‌ఎస్‌

అర్జీలు కొండంత..పరిష్కారం గోరంత

అర్జీదారుల్లో అసహనం

మదనపల్లె(కురబలకోట): మదనపల్లె కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌ సోమవారం వివిధ సమస్యలతో వచ్చిన అర్జీదారులతో కిటకిటలాడింది. జిల్లా నలుమూలల నుంచి వ్యయ ప్రయాసలకోర్చి అర్జీదారులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. వారం వారం వచ్చిన అర్జీలే మళ్లీ వస్తున్నాయి. ప్రతి సోమవారం అదే సీను పునరావృతం అవుతోందని బాదితులు నిరాశతో వెనుతిరుగుతున్నారు. పలువురు విసుగు, అసహనం వ్యక్తం చేశారు. మదనపల్లె పీజీఆర్‌ఎస్‌ చాలా మటుకు అవే అర్జీలు..అదే గోడు..అదే నిరీక్షణలా సాగుతుండడం పట్ల పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువగా భూ సమస్యల పరిష్కారం కోసం, ఫించన్లు కోరుతూ అర్జీలు వచ్చాయి. జాయింట్‌ కలెక్టర్‌ శివ్‌ నారాయణ శర్మ, సబ్‌ కలెక్టర్‌ చల్లా కళ్యాణి, ఉన్నతాధికారులు వెంకటేష్‌, చంధ్రశేఖర్‌ రెడ్డి, శాంతరాజ్‌ ప్రజల నుండి అర్జీలు 324 అర్జీలను స్వీకరించారు. క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

పెద్ద చెరువుకు నీరు నింపాలి

ఎందరికో జీవనాధారంగా ఉన్న కురబలకోట మండలం చింతమాకులపల్లి గ్రామం పరిధిలోని పెద్ద చెరువు (నార్లపల్లి చెరువు)కు 12 ఏళ్లుగా వర్షపు నీరు చేరక ఆయకట్టు రైతులు సాగునీటి కోసం అవస్థలు పడుతున్నామని ఆయకట్టు రైతులతో పాటు సిద్దల ఎల్లమ్మ పీజీఆర్‌ఎస్‌లో జాయింట్‌ కలెక్టర్‌కు అర్జీ ఇచ్చారు. చెరువుకు నీరు చేరేలా తగు చర్యలు తీసుకోవాలని కోరగా జాయింట్‌ కలెక్టర్‌ సత్వరమే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

నల్లమాండ్లపల్లిలో దాహం.దాహం..

మదనపల్లె రూరల్‌ మండలం పోతబోలు గ్రామం నల్లమాండ్లపల్లిలో బోరు ఎండిపోవడంతో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, అలాగే మూగజీవాలు కూడా తాగునీటికి అలమటించే పరిస్థితి నెలకొందని కొత్త బోరువేయాలని పీజీఆర్‌ఎస్‌లో అర్జీ ఇచ్చారు.

తాగునీటి సమస్య పరిష్కరించాలని కలెక్టరేట్‌లో నిరసన

నీళ్లు వదిలే లైన్‌మ్యాన్‌ లేక టిడ్కో కాలనీలో 20 రోజులుగా తాగు నీరు రావడం లేదని బాధితులు సోమవారం పీజీఆర్‌ఎస్‌లో అర్జీ ఇచ్చారు. సమస్య తీర్చాలని, అలాగే టిడ్కో ప్రాంతంలో కనీస వసతులు కల్పించాలని కోరారు. వెంటనే నీటి సమస్య పరిష్కరించాలని జేసీ ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement