టీడీపీ నేతల దుశ్శాసన పర్వంపై మహిళాలోకం కన్నెర్ర చేసింది.. రాత్రింబవళ్లు తేడా లేకుండా .. చిన్నారులు.. వృద్ధులన్న కనికరం లేకుండా ఆకృత్యాలకు తెగబడుతున్న కూటమి నేతల తీరును దునుమాడింది. మహిళల మాన.. ప్రాణాలు గాల్లో కలుస్తున్నా..మౌనంగా చూస్తున్న కూటమి పెద్దల తీరును ఎండగట్టింది. మంగళవారం వైఎస్సార్, అన్నమయ్య జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మహిళలు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు.
● మహిళలకు రక్షణ కల్పించాలని వైఎస్‌ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన
● మదనపల్లెలో అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం
సాక్షి, మదనపల్లె : రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతూ దుశ్శాసనుల్లా వ్యవహరిస్తున్న టీడీపీ నేతలకు చట్టం వర్తించదా అని వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు ఆగ్రహంతో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హోం శాఖ మంత్రి అనిత సాటి మహిళలకు ఎందుకు న్యాయం చేయడం లేదని నిలదీశారు. వైఫల్యానికి బాధ్యత వహించి మంత్రి పదవికి రాజీనామా చేయా లని డిమాండ్ చేశారు. మహిళలపై టీడీపీ నేతల అఘాయిత్యాలకు నిరసనగా వైఎస్‌ఆర్సీపీ ఇచ్చిన పిలుపుమేరకు మంగళవారం మదనపల్లెలో జిల్లా మహిళా విభా గం ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు.
నల్లరిబ్బన్లు ధరించి.. ప్లకార్డులు చేతబట్టి..
మదనపల్లె గొల్లపల్లి రోడ్డులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్‌ఆర్సీపీ మహిళా నేతలు నిరసన వ్యక్తం చేశారు. నల్లరిబ్బన్లు ధరించి, ప్లకార్డులు చేతపట్టి నినాదాలు చేశారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని, మీరు రాసిన రాజ్యాంగం పరిహాసమవుతోందని విన్నవించారు. అంతకు ముందు ర్యాలీగా విగ్రహం వద్దకు చేరుకున్నారు.
ఎమ్మెల్యే, టీడీపీ నేతలే కీచకులు
టీడీపీ ఎమ్మెల్యేలే కీచకులుగా మారిపోతున్నారని వైఎస్‌ఆర్సీపీ మదనపల్లె సమన్వయకర్త నిసార్ అహ్మద్ ధ్వజమెత్తారు. నిరసన కార్యక్రమం సందర్భంగా ఆయనకు మాట్లాడుతూ గుంటూరు, కోడూరు, కావలి, ఆముదాలవలస, బద్వేలు, తుని, హిందూపురం నియోజకవర్గాల్లో మహిళలపై ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు దారుణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హోం మంత్రి అనిత పదవికి రాజీనామా చేయాలి డిమాండ్ చేశారు.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
వైఎస్‌ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి అనీషారెడ్డి మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న దారుణాలను అరికట్టే విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. జగనన్న పాలనలో మహిళలకు భద్రత ఉండేదని, ఎక్కడైనా ఏదైనా ఘటన జరిగితే నిమిషాల్లో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దారుణాలను అరికట్టే వారిని గుర్తు చేశారు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో లేదని, కేవలం మాటలు, ప్రతిపక్ష పార్టీ నేతలపై అక్రమ కేసులకే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు.
అంబేడ్కర్‌ను వేడుకుంటున్నాం
రాష్ట్రంలో మహిళలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు, మీరు రాసిన రాజ్యాంగం అమలు అయ్యేలా చూడాలని కోరుతూ అంబేడ్కర్ ను వేడుకుంటున్నామని మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు జి.షమీం అస్లాం అన్నారు. ఎక్కడైనా మహిళలపై అఘాయిత్యం జరిగితే.. వారు వైఎస్‌ఆర్సీపీకి చెందిన వారంటూ నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. వీరికి చట్టభద్రత ఉండదా, వారికి చట్టాలు అమలు చేయరా అని ప్రశ్నించారు. మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా, ఈ ఘటనలను చూసి ప్రభుత్వం సిగ్గుపడాలని విమర్శించారు. అధికారంలోకి రాకముందు మహిళల భద్రత గురించి మాట్లాడిన బాబు, పవన్, లోకేష్ ఇప్పుడెందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.
జగనన్న పాలన చూడండి
జగనన్న పాలనలో ప్రతి సచివాలయానికి ఒక మహిళా పోలీసులు నియమించి భద్రత ఇచ్చారని మున్సిపల్ మాజీ చైర్మన్ వి.మనోజ అన్నారు. వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారని ఆరోపించిన పవన్ కళ్యాణ్, ఆ మాటలపై ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మహిళల భద్రతకు దిక్కు లేకుండా పోయిందని, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని మండిపడ్డారు. మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహిత, రాష్ట్ర కార్యదర్శులు బీరంగి రేవతి, మల్లేశ్వరీ, మొరుసు లక్ష్మీ, నియోజకవర్గాల మహిళా విభాగాల అధ్యక్షులు పద్మజారెడ్డి, మేరీ, హరిత, శ్రీదేవి, జిల్లా ఉపాధ్యక్షురాలు డిష్ కుమారి, జిల్లా కార్యదర్శి సయ్యద్ షహనాజ్ బేగం, మాజీ కౌన్సిలర్ మొబీనా, అమ్మాజాన్, నక్కా రమాదేవి, శారదరెడ్డి, వినుతాబాయి, మంజుల, ధనలక్ష్మి, నాగమణీ, రమారెడ్డి, లక్ష్మీ, భానుప్రియ, అరుణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


