● మొదటి పట్టాను రద్దు చేయకుండానే మరో ఇద్దరికి పట్టా
● మదనపల్లిలో రెవెన్యూ అక్రమాలు బట్టబయలు
మదనపల్లి (కురబలకోట) : ఒకే భూమిని ముగ్గురికి డీఫాం పట్టాలు ఇచ్చిన నిర్వాకం మదనపల్లి రెవెన్యూ కార్యాలయంలో వెలుగు చూసింది. బాధితుల కథనం మేరకు.. మదనపల్లి మండలం వేంపల్లె గ్రామం బండకాడపల్లి దగ్గర డేగాని నారాయణమ్మకు 2.95 ఎకరాలు ఎస్సీ రిజర్వుడు డీకేటీ భూమి ఉంది. 1993లో డీఫాం పట్టా ఇచ్చారు. ఆమె ఐదేళ్ల క్రితం చనిపోయారు. భర్త శంకరయ్య పేరుతోనే ఇప్పటికీ ఈ భూమి రెవెన్యూ రికార్డులతో పాటు ఆన్‌లైన్‌లో కూడా ఉంది. వన్‌బీ కూడా వస్తోంది. అయితే వీరి డీఫాం పట్టాను రద్దు చేయకుండానే అప్పటి రెవెన్యూ అధికారులు ఇదే భూమిని 2007లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికి డీఫాం పట్టాతో పాటు మ్యాన్యువల్ పాసు బుక్కు ఇచ్చారు. ఒకరికి ఎకరా 95 సెంట్లు, మరొకరికి ఎకరం ఇచ్చారు. అప్పటి నుంచి ఈ భూమి వివాదాస్పదం కావడంతో తగాదాలు ప్రారంభమయ్యాయి. మాదంటే మాదని గొడవలు పడసాగారు. మొదట ఒకరికి చట్టబద్దంగా పట్టా ఇచ్చి ఆ పట్టాను రద్దు చేయకుండా అదే భూమిని మరో ఇద్దరికి పట్టాలు జారీ చేయడం ప్రశ్నార్థకంగా మారింది. రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మొదటి పట్టాను రద్దు పరచినట్లు ఎక్కడా రెవెన్యూ రికార్డులలో నమోదుకాలేదని వెల్లడవుతోంది. ఇందులో రెవెన్యూ తప్పిదం స్పష్టంగా కన్పిస్తోంది. మొదటి పట్టాను రద్దు చేయకపోవడం ఇదే భూమిని ఇద్దరికి ఇవ్వడం అక్రమంగా రెవెన్యూ వర్గాలు భావిస్తున్నాయి. రెవెన్యూ అధికారుల విధి నిర్వహణ లోపం స్పష్టమవుతోంది. దీనిపై బాధితుడు డేగాని శంకరయ్య పీజీఆర్‌ఎస్‌లో న్యాయం చేయాలని అర్జీ ఇచ్చారు. దీనిపై సమగ్రంగా విచారించి నివేదిక పంపాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ విషయమై తహసీల్దార్ మాధవిని విచారించగా ఇరువర్గాల స్టేట్‌మెంట్లు నమోదు చేయడంతో పాటు రికార్డులను పరిశీలించామన్నారు. తగు చర్యల నిమిత్తం జిల్లా కలెక్టర్‌కు నివేదిక పంపుతున్నట్లు తెలిపారు.


