● ఇద్దరు మహిళల మెడలో బంగారు గొలుసులు చోరీ
● ఓ ఫర్టిలైజర్ దుకాణంలో నగదు అపహరణ
● రంగంలోకి దిగిన పోలీసులు
పెద్దతిప్పసముద్రం : మండలంలో రెండు రోజుల వ్యవధిలోనే గుర్తు తెలియని దొంగలు పట్టపగలే చాకచక్యంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. దొంగలు ద్విచక్ర వాహనాల్లో వచ్చి ఇళ్ల వద్ద ఒంటరిగా ఉన్న మహిళల మెడలో నుంచి బంగారు ఆభరణాలు లాక్కెళ్లి రెప్పపాటులో పరారై పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఈ నెల 8న మండలంలోని పులికల్లు పంచాయతీ బొంతలవారిపల్లి చెరువు కట్టపై వెళుతున్న ఓ మహిళ మెడలో నుంచి గుర్తు తెలియని వ్యక్తి రూ.లక్షల విలువ చేసే బంగారు బొట్టు చైనును అపహరించుకెళ్లాడు. అదే రోజు కాట్నగల్లు పంచాయతీ దూలంవారిపల్లిలో కూడా ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంలో వచ్చి ఆరు బయటి నుంచి ఇంటి గేటు వైపు వెళుతున్న మరో మహిళ మెడలో నుంచి బంగారు చైను లాక్కెళ్లిపోయారు. ఈ ఘటనలతో మహిళలతో పాటు గ్రామస్తులు సైతం ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దీంతో మహిళలు ఒంటరిగా ఆరుబయట సంచరించేందుకే హడలెత్తిపోతున్నారు. ఇదిలా ఉండగా మండలంలోని మద్దయ్యగారిపల్లిలో అర్ధరాత్రి ఓ వ్యక్తి ఫర్టిలైజర్ దుకాణంలోని పైకప్పు రేకులను చాకచక్యంగా తొలగించి సీసీ కెమెరాల కంట పడకుండా ఉండేందుకు అక్కడే ఉన్న ఓ వస్త్రాన్ని ముఖానికి వేసుకుని దుకాణంలో ఉన్న రూ.62,500ల నగదును దోచుకెళ్లాడు. ఉదయం దుకాణం తెరచిన యజమాని దొంగతనం జరిగిందని గుర్తించి సీసీ ఫుటేజీలను క్షుణంగా పరిశీలించాడు. విషయం తెలుసుకున్న ములకలచెరువు సీఐ దస్తగిరి సిబ్బందితో కలసి ఘటనా స్థలానికి చేరుకున్నాడు. మద్దయ్యగారిపల్లి నుంచి పీటీఎం పరిసర ప్రాంతాల్లోని ప్రధాన రహదారుల్లో ఉన్న సీసీ ఫుటేజీలను క్షుణంగా పరిశీలిస్తున్నారు. అదే విధంగా వేలిముద్ర నిపుణులు చోరీ స్థలాన్ని క్షుణంగా పరిశీలించి వేలిముద్రలను సేకరించారు. ఈ కేసును పోలీసులు సవాల్‌గా తీసుకుని నిందితులను పట్టుకుని కేసును ఛేదించే దిశగా చర్యలు చేపడుతున్నారు. అదే విధంగా రాత్రి వేళ గస్తీ ముమ్మరం చేసి అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టాలని సీఐ పోలీస్ సిబ్బందిని ఆదేశించారు.


