సాక్షి, మదనపల్లె: టీడీపీ కోసం జీవితాంతం జెండా మోస్తూనే ఉండాలా, కనీస గౌరవం, గుర్తింపు ఎందుకివ్వరని ఆ పార్టీ సీనియర్ నేతలు జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ.జనార్దనరెడ్డిని ప్రశ్నించారు. సోమవారం మదనపల్లెలోని పార్లమెంట్ పార్టీ కార్యాలయంలో మంత్రితో నియోజకవర్గానికి చెందిన 30 మంది ముఖ్యనేతలు సమావేశమై తమ గోడు వెల్లబోసుకున్నారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు..పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు ప్రసాద్ ఈ సమావేశంలో కొద్దిసేపు ఉండి వెళ్లిపోగా, ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్ ఖాన్ ఉన్నారు. ఈ సందర్భంగా నేతలు ఒక్కొక్కరు తమ గళం విప్పారు.
అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా పార్టీకోసం పనిచేసిన వారిని గుర్తించి పార్టీలో, ప్రభుత్వ నామినేటేడ్ పదవుల్లో అవకాశం ఇవ్వడం అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్త నుంచి నాయకుని వరకు ఇక్కడ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు, వాటిని ఎవరు పరిష్కరిస్తారని నిలదీశారు. నియోజకవర్గ పార్టీ స్థితిగతులపై సమీక్షించి పట్టించుకోవాలని, కష్టకాలంలో అండగా నిలిచిన శ్రేణులను గుర్తించి వారికి సముచిత గౌరవం ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. ఇలాంటి నిర్లక్ష్యం కొనసాగితే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు, నాయకులు పార్టీ దూరం కావడం ఖాయమని స్పష్టంగా చెప్పేశారు. ఇప్పటికే ముఖ్యనాయకులు, సీనియర్లు దూరమైన విషయాన్ని మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపుతుందన్నారు.
పార్టీకోసం ధైర్యంగా నిలబడే కార్యకర్తలు ఉండరని, ఇది పార్టీకి తీరని నష్టంగా మారుతుందని మంత్రితో తెగేసిచెప్పిన నాయకులు, వెంటనే నమ్ముకున్న వారికి న్యాయం చేయాలని పట్టుపట్టారు. మదనపల్లె నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయని తాము భావించలేదని, పార్టీకి మరింత నష్టం కలగకముందే జాగ్రత్త పడాలని సూచించారు. ఈ పరిస్థితులపై మంత్రి అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. పార్లమెంటు అధ్యక్షులు ప్రసాద్ ఈ విషయాలు పట్టించుకుంటున్నారా అని మంత్రి ఆరా తీసినట్టు తెలిసింది. పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులు, తిరుపతి ఘటనలను మంత్రి ప్రస్తావించి, మదనపల్లెలో ఇలాంటì పరిస్థితి రాకుండా క్యాడర్‌లో నెలకొన్న అసంతృప్తిని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారని తెలిసింది.


