అమరావతి గురించి ఎల్లో మీడియా ఇచ్చిన ఒక కథనం చూస్తే వారికి ఎంతగా కుల జాడ్యం పట్టుకుంది అర్దం అవుతుంది. రాజధాని నిర్మాణం పేరుతో కొన్ని గ్రామాలలో అవసరం ఉన్నా,లేకపోయినా భూములు తీసుకుంటున్న వైనం , రైతులపై దౌర్జన్యం చేస్తున్న తీరు తీవ్ర విమర్శలకు గురి అవుతోంది. ఉండవల్లి ,పెనుమాక ,నిడమర్రు మొదలైన గ్రామాలకు చెందిన రైతులు తమ భూములను కొంతమేర ఇచ్చారు. ఆ పైన ఇవ్వడానికి సిద్దపడడం లేదు. కొందరు భూమలు వదలుకోవడానికి ఇష్టపడడం లేదు. దాంతో రైతులపై చంద్రబాబు సర్కార్ వేదింపులు మొదలుపెట్టింది.
బాధితులైన రైతులు కొందరు కొద్ది రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. రైతులపై జరుగుతున్న దాష్టికాన్ని ఎదుర్కోవడానికి న్యాయ పోరాటానికి మద్దతు ఇస్తామని జగన్ వారికి భరోసా ఇచ్చారు. ఇది టిడిపి మీడియాకు నచ్చలేదు. వెంటనే ఒక స్టోరీ అల్లేశారు. దానిలో జగన్ పైన, బాధితులపైన తప్పుడు రాతలు రాశారు. జగన్ ను కలిసినవారిలో కొందరు ఆయన సామాజికవర్గం వారని అంటూ ఎల్లో మీడియా కులం ప్రస్తావన చేసింది. అంటే ఏమి అనుకోవాలి?అమరావతికి మద్దతు ఇస్తే తప్ప, లేకుంటే ఎవరిపైన అయినా కుల ముద్ర, లేదా మరో ముద్ర వేసి ప్రచారం చేస్తారా?. ఈ కధనం చదివినవారికి ఏమనిపిస్తుంది.
ఒక సామాజికవర్గ ఆధిపత్యం కోసమే ఎక్కడో మారుమూల ఉన్న గ్రామాలను రాజధాని కోసం ఎంపిక చేసి, లక్షల కోట్లు ఒకే చోట ఖర్చు చేయడానికి టిడిపి ప్రభుత్వం సన్నద్దమైందన్న ఆరోపణలు ,విమర్శలు వాస్తవమే అన్న భావన కలగదా!అప్పట్లో ఇన్ సైడ్ ట్రేడింగ్ చేసి రాజధాని గ్రామాలలో అత్యధికంగా భూములు కొనుగోలు చేసినవారిలో ఎక్కువ మంది ఒకే కులం వారు ఉన్నారని అభియోగాలు వచ్చాయి. వారి లబ్ది కోసం ఎల్లో మీడియా ఇలా దిగజారి వార్తలు రాస్తున్నదన్న అభిప్రాయం కలగదా?నిజానికి ప్రస్తుతం రాజధాని రైతులంతా కులాలతో సంబందం లేకుండా అంతా అవస్థలు పడుతున్నారు.
2015లో ఉత్సాహంగా భూములు ఇచ్చినవారు సైతం నిస్పృహకు గురి అవుతున్నారు.మంత్రి నారాయణ పాల్గొన్న ఒక గ్రామ సభలో రామారావు అనే రైతు తన ఆవేదన వ్యక్తం చేస్తూ గుండెపోటుకు గురై మరణించారు. అప్పుడు ఇదే ఎల్లో మీడియా కూల్ గా పడిపోయి మరణించారని దిక్కుమాలిన రాతలను రాసింది.ఆయన కూడా జగన్ సామాజికవర్గానికి చెందినవారేనా! అంతెదుకు రాయపూడి ప్రాంతంలో ఒక ప్రముఖ రైతు నేత తన భూములు ఇవ్వడానికి నిరాకరించి కోర్టుకు వెళ్లలేదా!ఆయన ఏ కులం వారు?రాజకీయంగా పలుకుబడి,పరపతి, అధికారం ఉన్నవారికి మాత్రమే ఇబ్బంది లేని చోట్ల ప్లాట్లు కేటాయిస్తున్నారని, మిగిలినవారికి వరద ప్రాంతాలు,స్మశానాలలో సైతం ప్లాట్లు ఇస్తున్నారన్న విమర్శలు ఓపెన్ గానే వస్తున్నాయి.
బాధ పడుతున్నవారిలో చాలా మంది కమ్మవారు కూడా ఉన్నారు కదా!వారికి మాత్రం ఏమి న్యాయం జరిగింది?రెండో టరమ్ లో అధికారం వచ్చి రెండేళ్లు అయినా ఇంతవరకు ఎంతమందికి అభివృద్ది చేసిన ప్లాట్లు ఇచ్చారో చెప్పగలరా?రెండో దశ పూలింగ్‌లో వేల ఎకరాల సమీకరణకు ప్రభుత్వం సిద్దం అయితే వ్యతిరేకిస్తున్నవారిలో అత్యధికంగా ఉన్నది కమ్మ సామాజికవర్గం కాదా?అంతెందుకు! రెండో దశ కింద వేల ఎకరాలు సేకరించడం పెద్ద స్కామ్ అని వ్యాఖ్యానించిన రిటైర్డ్ డిజిపి ఎబి వెంకటేశ్వరరావు ఏ సామాజికవర్గంవారు? అమరావతి నిర్మాణం పేరుతో రైతులను దోచుకుంటున్నారని, అదనంగా భూములు ఇవ్వవద్దని పిలుపు ఇచ్చిన మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు కమ్మ వర్గం వారు కాదా?వాస్తవ పరిస్తితి ఇలా ఉంటే అదేదో రెడ్డి సామాజికవర్గం వారు కొంతమంది రాజధానికి అడ్డుపడుతున్నట్లు దుర్మార్గంగా వార్తలు ఇస్తారా?
ఇవన్ని ఎందుకు!ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ అమరావతి రాజధానిని ఒక సామాజికవర్గ గేటెడ్ కమ్యూనిటీగా మార్చుతున్నారని గతంలో ఆరోపించారా?లేదా?ఆయన స్వయంగా పెనుమాక ప్రాంత రైతులను కలిసి వారి గోడు అప్పట్లో విన్నారా?లేదా?ఇప్పుడు మాట మారుస్తుండవచ్చు.అది వేరే సంగతి. ఇది అసలు కుల సమస్యకాదు. కులాలకు అతీతంగా వేలాది మంది రైతుల ఆక్రోశం.ఆవేదన.ఒప్పందం ప్రకారం ప్లాట్లు ఇవ్వని ప్రభుత్వం కొత్తగా భూములు తీసుకోవడానికి దౌర్జన్యంగా వ్యవహరించడంపై వ్యక్తం అవుతున్న నిరసన అని గమనించాలి.భూములు ఇచ్చినవారిపై అక్కసుతో ఉండవలసిన అవసరం జగన్ కు ఏమి ఉంటుంది.వారికి ప్లాట్లు ఇవ్వవద్దని, డ్రైన్లు, కరెంటు,తదితర సదుపాయాలు కల్పించవద్దని జగన్ ఏమైనా అన్నారా?వారికి కూడా న్యాయం చేయమనే కదా కోరింది.
ఇన్నివేల ఎకరాలు తీసుకోవడం,లక్షల కోట్లు రాజధాని పేరుతో వ్యయం చేయడాన్ని ఆయన తప్పుపట్టారు.అందులో ఆక్షేపణ ఏమి ఉంది?అందుకే మచిలీపట్నం ,విజయవాడ,గుంటూరు కారిడార్ ను (మావిగన్) ప్రతిపాదించి రాజధాని ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వానికి లక్షల కోట్ల వ్యయం అవ్వదని ఆయన సలహా ఇచ్చారు.ఆ ప్రతిపాదన చేయడం వల్లే కదా ప్రభుత్వం భయపడుతోంది. టిడిపి మహానాడులో అమరావతికి సంబందించి చర్చను ఎందుకు విస్తృతంగా చేయలేదు?రెండు లక్షల ఎకరాలు తీసుకోవలసిన అవసరం, లక్షల కోట్ల నిధులు ఒకే చోట వ్యయం చేయడం ఎందుకు అన్నదానిపై వివరణ ఇవ్వలేకపోయారే!
ఈ నేపధ్యంలో కొందరు రైతులు జగన్ ను కలిసి తమను ప్రభుత్వం ఏ రకంగా హింసిస్తుందో వివరించారు. రైతుల భూములలో వారి అనుమతి లేకుండా తవ్వకాలు చేపట్టవచ్చా?ప్రభుత్వమే ఇలా రౌడీయిజంగా వ్యవహరించవచ్చా?పూలింగ్ కింద ఇవ్వని రైతుల భూములలో ప్లాట్లు వేయవచ్చా?వేరేవారికి ఆ ప్లాట్లు కేటాయించవచ్చా?అది చట్ట సమ్మతమా?ఒక సాధారణ రైతు ప్రభుత్వమే తన భూమిని ఎలా కబ్జా చేస్తుందని, ఐఎఎస్ అధికారులు అందులో వేరేవారికి ప్లాట్లు ఎలా రిజిస్టర్ చేస్తారని,ఇదేనా వారు చదువుకుంది అని ప్రశ్నించారు.తన పొలంలోకి కొండవీటి కాల్వకు గండి పెట్టి నీరువదలిలారని ఒక రైతు వాపోయారు.తాను కొంత భూమిని ప్రభుత్వానికి ఇచ్చినా, ఇంకా భూమి కావాలంటూ వెంటబడుతున్నారని మరో రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
విశేషం ఏమిటంటే పెనుమాకలో జరిగిన గ్రామ సభలో కొందరు తెలుగుదేశం మద్దతుదారులు కూడా భూములు ఇచ్చిన తమకు జరుగుతున్నఅన్యాయాలను ఏకరువు పెట్టి అధికారులు స్పందించడం లేదని ఫిర్యాదు చశారు.వారిలో రెడ్డి వర్గం వారు కూడా ఉన్నారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సి.ఎమ్ గా ఉన్నప్పుడు పోలవరం ఎడమ కాల్వ తవ్వకానికి భూములు సేకరిస్తే,టిడిపికి చెందినవారు కొన్ని చోట్ల అడ్డుపడ్డారు.వారు కోర్టుకు వెళ్లారు.వీరిలో ఎక్కువ మంది ఏ కులం వారో అప్పుడు రాశారా? కాంగ్రెస్ ప్రభుత్వం వారిని వేధించిందా?అదే రైతులు టిడిపి అధికారంలోకి వచ్చాక ఒక రేటుకు ఒప్పందం అయి భూములు ఎలా ఇచ్చారు?ఎవరికైనా కోర్టుకు వెళ్లే హక్కు ఉంటుంది.అదేదో నేరం అయినట్లు విష ప్రచారం చేయడం దారుణం. సరైన ప్రత్యామ్నాయ పరిష్కారం చూపకుండా, ప్రభుత్వం రౌడీయిజం చేయడమే మంచి విధానం అన్నట్లు ఎల్లో మీడియా రాయడం అంటే అంతకన్నా నీచం ఉంటుందా?

కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్,రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత


