ఎంపీడీవో కార్యాలయం ముందు బైఠాయించి నిరసనకు దిగిన ఎంపీటీసీ సభ్యుడు రాజయ్య
చంద్రగిరి: సీఎం చంద్రబాబు స్వగ్రామానికి చెందిన దళిత ఎంపీటీసీ సభ్యుడిని అధికారులు తీవ్రంగా అవమానించారు. ఆయనకు సమాచారం ఇవ్వకుండానే స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లి (కందులవారిపల్లి)కి చెందిన రాజయ్య గత ఎన్నికల్లో ఎంపీటీసీ సభ్యుడిగా విజయం సాధించారు. శనివారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పంచాయతీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు.
అయితే ఎంపీటీసీ సభ్యుడు రాజయ్యకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కార్యక్రమాన్ని పూర్తి చేశారు. తనకు జరిగిన అవమానంపై రాజయ్య శనివారం చంద్రగిరిలోని ఎంపీడీవో కార్యాలయ ప్రవేశ మార్గంలో బైఠాయించి నిరసన చేపట్టారు. ‘దళిత ఎంపీటీసీ సభ్యులంటే మీకు గౌరవం లేదా’ అని ఎంపీడీవో చంద్రికను నిలదీశారు. సీఎం చంద్రబాబు సొంత పంచాయతీకి తాను ఎంపీటీసీ సభ్యుడిగా ప్రాతినిథ్యం వహించడం నేరమా? అని వాపోయారు.


