సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు ఎక్స్‌లో చేసిన పోస్టు
విద్యుత్ రంగ సంస్కరణలకు శ్రీకారం చుట్టిన తొలి రాష్ట్రం ఒడిశా
మీరు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడవకముందే ఆ రాష్ట్రంలో సంస్కరణలు తెచ్చారు
ఆ ఘనతను నాటి ఒడిశా సీఎం జేబీ పటా్నయక్ అంతకు ముందున్న సీఎంకే ఇచ్చారు
ఆ ఘనత తనదని ఎప్పుడూ చెప్పుకోలేదు.. ఇదీ హుందాతనం
సొంత డప్పు, అబద్ధాలు, ఇతరుల కృషిని తన ఖాతాలో వేసుకోవడం, తన తప్పులకు ఇతరులను నిందించడం నాయకత్వ లక్షణాలు కావు
‘ఎక్స్’లో చంద్రబాబును కడిగిపారేసిన సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు
సాక్షి, అమరావతి: దేశంలో విద్యుత్ సంస్కరణలను తానే తీసుకొచ్చానంటూ సీఎం చంద్రబాబు చెప్పడం పట్ల సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు తీవ్రంగా ఆక్షేపించారు. విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చింది మీరు కాదని, మీరు ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడవక ముందే ఒడిశాలో నాటి ముఖ్యమంత్రులు విద్యుత్ సంస్కరణలు తెచ్చారని, వీటిని విస్మరించి ఇంత పచ్చిగా అబద్ధాలు ఎలా చెప్తారంటూ సీఎం చంద్రబాబును ఆయన కడిగిపారేశారు. ఇంత పచ్చిగా అబద్ధాలు చెప్పడం ఇకనైనా మానండి అని సూచించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. దానికి విద్యుత్ సంస్కరణలను తానే తెచ్చానని సీఎం చంద్రబాబు ప్రసంగం వీడియోను జత చేశారు.
వెన్నుపోటు పొడవక ముందే..
‘‘ఇంత పచ్చిగా అబద్ధాలు చెప్పడం ఇకనైనా మానండి! దేశంలో విద్యుత్ సంస్కరణలకు శ్రీకారం చుట్టిన తొలి రాష్ట్రం ఒడిశా. 1992లోనే అప్పటి ఒడిశా ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ విస్తృత సంప్రదింపులతో ఈ ప్రక్రియ ప్రారంభించారు. ఆ తర్వాత వచ్చిన జె.బి. పట్నాయక్ ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్లి ఒడిశా విద్యుత్ సంస్కరణల చట్టం – 1995’ను తీసుకొచ్చింది. ఒడిశా విద్యుత్ నియంత్రణ మండలి (ఓఈఆర్‌సీ) ఏర్పాటు, అప్పటి రాష్ట్ర విద్యుత్ సంస్థ (ఓఎస్‌ఈబీ)ను ఉష్ణ విద్యుత్ ఉత్పత్తి, జల విద్యుత్ ఉత్పత్తి, నాలుగు పంపిణీ సంస్థలుగా విభజన చేసి విద్యుత్ రంగ సంస్కరణలను 1995 నాటికి తెచ్చారు. ఇదంతా మీరు మీ మామగారికి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పీఠం ఎక్కకముందే జరిగిపోయిన నిజం’’ అని ఆ పోస్టులో చెప్పారు.
మరో ముఖ్య విషయం!!
‘‘విద్యుత్ సంస్కరణల ఘనతను నాటి ఒడిశా ముఖ్యమంత్రి జేబీ పటా్నయక్.. సంస్కరణలను ప్రారంభించిన మాజీ ముఖ్యమంత్రి, ఆనాటి ప్రతిపక్ష నాయకుడు బిజూ పట్నాయక్‌కే ఇచ్చారు తప్ప ఎప్పుడూ తన ఖాతాలో వేసుకోలేదు. దాన్నే హూందాతనం అంటారు. సొంత డప్పు వాయించుకోవడం, పచ్చి అబద్ధాలు ఆడటం, ఇతరుల కృషిని తన ఖాతాలో వేసుకోవడం, తాను చేసే తప్పులకు ఇతరులను నిందించడం లాంటివి గౌరవప్రదమైన నాయకత్వ లక్షణాలు కావు. అది కేవలం నైతిక పతనం’’ అని స్పష్టం చేశారు.
‘నేను ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడుతాను. చంద్రబాబునాయుడు గారు తన మామగారికి పొడిచింది ’ఎదురుపోటు’ అని వారి మామగారే స్వయంగా చెప్పారు. అయితే, చంద్రబాబు వయసులో పెద్దవారనే గౌరవంతో నేను ’వెన్నుపోటు’ అని రాశాను. ఒకవేళ ఆ పదం మీకు తక్కువగా అనిపిస్తే, దాని స్థానంలో ’ఎదురుపోటు’ అని మార్చుకొని చదువుకోండి’’ అని చందబ్రాబుకు ‘ఎక్స్’లో సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు చురకలంటించారు.


