డేటాప్రోతో చంద్రబాబు ప్రభుత్వ ఒప్పందం(ఫైల్)
మరో దొంగ కంపెనీకి బాబు సర్కారు రెడ్ కార్పెట్
పలు రాష్ట్రాల ప్రభుత్వాలను మోసం చేసిన డేటా ప్రో
2021లో ఈ కంపెనీపై జమ్మూ అండ్ కశ్మీర్‌లో ఏసీబీ కేసు నమోదు
తప్పుడు బిల్లులతో క్లెయిమ్‌లకు దరఖాస్తు చేసిన వైనం
విచారణలో బట్టబయలైన డేటా ప్రో నిర్వాకం
దీంతో ఆ కంపెనీని బ్యాన్ చేసిన ఆ రాష్ట్ర ప్రభుత్వం
ఇప్పుడు అదే కంపెనీతో చంద్రబాబు సర్కారు ఒప్పందం
సాక్షి, అమరావతి: దొంగ బిల్లులతో రాష్ట్ర ఖజానాకు భారీగా గండికొట్టే కంపెనీలకు చంద్రబాబు సర్కారు రెడ్ కార్పెట్ వేసి మరీ పిలుస్తోంది. రాష్ట్రంలో హరిత ఇంధన రంగంలో రూ.76,250 కోట్ల పెట్టుబడి పెడతానంటూ ఒప్పందం కుదుర్చుకున్న హైదరాబాద్‌కు చెందిన ఎకోరన్ ఎండీ యర్రంనేని లక్ష్మీప్రసాద్ ఏకంగా దొంగ ఇన్‌వాయిస్‌లతో రూ.64 కోట్లు కొట్టేసి అడ్డంగా దొరికిపోయి జైలుకు వెళ్లిన ఘటన మరవకముందే..ఇప్పుడు బాబు సర్కారు మరో దొంగ
కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఇటీవల ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికంటూ సీఎం చంద్రబాబు సమక్షంలో విశాఖకు చెందిన డేటా ప్రో కంప్యూటర్స్ లిమిటెడ్‌తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. నైపుణ్య శిక్షణ పేరిట ఈ కంపెనీ పలు రాష్ట్రాల్లో కార్యకలాపాలను కొనసాగిస్తూ దొంగ బిల్లులతో అడ్డంగా దొరికిపోవడమే కాకుండా కొన్నిరాష్ట్రాలు ఈ కంపెనీపై ఏకంగా నిషేధాన్ని కూడా విధించాయి. ఇలాంటి ఘన చరిత్ర కలిగిన కంపెనీతో చంద్రబాబు స్వయంగా ఒప్పందం చేసుకోవడం ఇప్పుడు అధికారవర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది.
జమ్మూ అండ్ కశ్మీర్‌లో ఏసీబీ కేసు
శిక్షణ ఇవ్వకుండానే ఇచ్చేసినట్లు చూపించడమే కాకుండా వారికి ఉపాధి కల్పించినట్లు దొంగ సర్టిఫికెట్లు సమర్పించి రూ.కోట్లు కొట్టేయడానికి పథకం వేసి విశాఖకు చెందిన డేటాప్రో కంప్యూటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ జమ్మూ అండ్ కశ్మీర్ ప్రభుత్వానికి అడ్డంగా దొరికిపోయింది. జమ్మూ కశ్మీర్ రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్ కు చెందిన ‘హిమాయత్ ప్రోగ్రామ్’ను అమలు చేయడానికి 2018లో జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం డేటాప్రోతో ఒప్పందం కుదుర్చుకుంది.రూ.30 కోట్ల ప్రాజెక్టు వ్యయంలో తొలి విడత రూ.7 కోట్లు చెల్లించగా మలివిడత సొమ్ము కోసం ఏకంగా 89 మంది నకిలీ అభ్యర్థుల జాబితాను సమర్పించి ఏసీబీకి ఈ కంపెనీ అడ్డంగా దొరికిపోయింది.
మొత్తం శిక్షణ ఇచ్చినట్లు చూపించిన 136 మంది అభ్యర్థుల్లో 89 మంది నకిలీ అభ్యర్థులే ఉన్నట్లు తేలింది. వీరంతా ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు పొందారంటూ దొంగ బ్యాంకు ఖాతాలను జమ్మూ కశ్మీర్ రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్‌కు డేటా ప్రో సమర్పించింది. దీనిపై ఆ రాష్ట్ర ఏసీబీ సెపె్టంబర్ 1, 2021న ఎఫ్‌ఐఆర్ నంబర్ 08/2021తో కేసు నమోదు చేసింది. దర్యాప్తు అనంతరం 2022లో జమ్మూ కశ్మీర్ పరిపాలన యంత్రాంగం రూ.3 కోట్ల జరిమానా విధించడంతో పాటు ఈ కంపెనీ ఖాతాలను జప్తు చేసి కంపెనీని రాష్ట్రంలో బ్లాక్ లిస్ట్‌లో చేర్చింది.
అంతేకాకుండా దేశవ్యాప్తంగా డేటాప్రో కార్యకలాపాలను నిషేధించాలంటూ కేంద్రానికి కూడా విజ్ఞప్తి చేసింది. విశాఖ కేంద్రంగా 2008లో ప్రసాద్ రంగినేని, ప్రసాద్ సిద్ధవరపు డైరెక్టర్లుగా ఉన్న ఈ కంపెనీ పలు రాష్ట్రాల్లో నైపుణ్య శిక్షణ పేరిట ఈ విధమైన మోసాలు చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అటువంటి కంపెనీతో సీఎం చంద్రబాబే ఎంవోయూ కుదుర్చుకోవడంపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.


