దిగుబడి ఆధారిత పంటల బీమా గడువు పొడిగింపు | AP Extends Deadline for Yield-Based Crop Insurance | Sakshi
Sakshi News home page

దిగుబడి ఆధారిత పంటల బీమా గడువు పొడిగింపు

Aug 16 2026 5:32 AM | Updated on Aug 16 2026 5:32 AM

AP Extends Deadline for Yield-Based Crop Insurance

ఈనెల 31 వరకు పొడిగిస్తూ బీమా కంపెనీల నిర్ణయం

సాక్షి, అమరావతి: ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) కింద దిగుబడి ఆధారిత పంటల ప్రీమియం చెల్లింపు గడువును మరోసారి బీమా కంపెనీలు పొడిగించాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆగస్టు 31 వరకు ప్రీమియం చెల్లింపునకు వెసులుబాటు కల్పించాయి. గడువు పొడిగించినా అన్ని జిల్లాల్లో.. అన్ని పంటలకు ఈ అవకాశం ఉండదు. కొన్ని క్లస్టర్లలో వరికి మాత్రమే పొడిగింపు వర్తిస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో నోటిఫై చేసిన అన్ని పంటలకు అవకాశం ఇచ్చారు. అనంతపురం, తిరుపతి, గుంటూరు, నంద్యాల, విశాఖపట్నం, పల్నాడు, శ్రీకాకుళం, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో పొడిగింపు వరి పంటకు మాత్రమే వర్తిస్తుంది. వీటిలో కొన్ని జిల్లాల్లో రుణాలు తీసుకున్న రైతులకు మాత్రమే అర్హత కల్పించారు.

అన్నమయ్య, ఏలూరు, ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల్లో వరికి మాత్రమే అవకాశం ఇవ్వగా.. ఇక్కడ రుణాలు తీసుకున్న, తీసుకోని రైతులకు నెలాఖరు వరకు ప్రీమియం చెల్లింపునకు అవకాశం కల్పించారు. చిత్తూరు, కృష్ణా, ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లాల్లో నోటిఫై చేసిన అన్ని పంటలకు అందరు రైతులకు అవకాశం కల్పించారు. శ్రీసత్యసాయి, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నోటిఫై చేసిన అన్ని పంటలకు అవకాశం ఉన్నా రుణాలు తీసుకున్న రైతులకే అవకాశం కల్పించారు. 

అనకాపల్లి, కోనసీమ, కర్నూలు, బాపట్ల, ఎనీ్టఆర్, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అన్ని పంటలకు రుణ, రుణేతర రైతులకు అవకాశం కల్పించారు. కాగా ఇప్పటివరకు రాష్ట్రంలో వాతావరణ ఆధారిత పంటల బీమా పరిధిలో 14.75 లక్షల ఎకరాల్లో సాగైన నోటిఫై చేసిన పంటలకు 4.85 లక్షల మంది రైతులు ప్రీమియం చెల్లించారు. అదే సమయంలో పీఎంఎఫ్‌బీవై కింద దిగుబడి ఆధారిత పంటలకు సంబంధించి 23.05 లక్షల ఎకరాల్లో సాగైన నోటిఫై చేసిన పంటలకు 9.28 లక్షల మంది రైతులు ప్రీమియం చెల్లించినట్లు వ్యవసాయశాఖ గణాంకాలు చెబుతున్నాయి.  

సాగు లేకున్నా బీమా చేయించాల్సిందే 
రైతు సేవా కేంద్రాల(ఆర్‌ఎస్‌కే) సిబ్బంది మెడపై కత్తి పెట్టి మరీ పంటల బీమా నమోదు కోసం ఒత్తిడి తీసుకొస్తున్నారు. తీవ్ర కరువు ప్రభావంతో ఖరీఫ్‌ పంటల సాగు నత్తనడకన సాగుతోంది. సాగు లక్ష్యం 80 లక్షల ఎకరాలుకాగా.. ఇప్పటి వరకు 41.97 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. తీవ్ర ఉష్ణోగ్రతల ప్రభావంతో సాగైన పంటల్లో సైతం 30–40 శాతం వరకు పంటలు ఎండిపోయాయి. ఎకరాకు రూ.15వేల నుంచి రూ.20వేల వరకు పెట్టుబడి పెట్టినా పంటలు మొలకెత్తని పరిస్థితి నెలకొంది. సాగు చేసినా, చేయకపోయినా సరే పంటల బీమా నమోదు చేయించాల్సిందేనంటూ ఆర్‌ఎస్‌కే సిబ్బందిపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో ఇప్పటికే పెట్టుబడి రూపంలో తీవ్రంగా నష్టపోయిన రైతుల నుంచి ప్రీమియం మొత్తాన్ని బలవంతంగా వసూలు చేస్తున్నారు. 

వాస్తవానికి ఈ పంట నమోదు ప్రామాణికంగా పంటల బీమా నమోదు చేయాలి. కానీ.. ఈ–క్రాప్‌ నత్తనడకన సాగుతోంది. వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు సాగు చేయక.. ఈ–క్రాప్‌లో నమోదు కాకపోతే తమ పరిస్థితి ఏమిటని రైతులు ప్రశి్నస్తున్నారు. పంటల బీమా పరిహారం మాట దేవుడెరుగు అప్పులుచేసి చెల్లిస్తున్న ప్రీమియం తిరిగి వచ్చే పరిస్థితి ఉంటుందో లేదో తెలియక రైతులు గగ్గోలు పెడుతున్నారు. రెండేళ్లుగా వరుస విపత్తులతో తీవ్రంగా నష్టపోతున్నా పైసా పరిహారం కూడా రైతులకు అందని పరిస్థితి నెలకొంది. గడువు పెంచినంత మాత్రాన సంఖ్యల కోసం హడావుడిగా నమోదు చేయకుండా.. రైతు వాస్తవంగా సాగు చేసిన పంట, విస్తీర్ణం, బీమా పరిధి, రైతు అర్హత వంటి అంశాలను నిర్ధారించిన తర్వాతే బీమా నమోదు చేయాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement