డీఎస్సీ డైవర్షన్‌ కోసమే..! | Chandrababu, Lokesh in a state of shock as GenZ is protesting against DSC | Sakshi
Sakshi News home page

డీఎస్సీ డైవర్షన్‌ కోసమే..!

Aug 16 2026 5:17 AM | Updated on Aug 16 2026 5:32 AM

Chandrababu, Lokesh in a state of shock as GenZ is protesting against DSC

అభూతకల్పనలతో గ్రూప్‌–1పై అనవసర రాద్ధాంతం

డీఎస్సీపై జెన్‌జీ నిలదీస్తుండడంతో చంద్రబాబు, లోకేశ్‌ ఉక్కిరిబిక్కిరి 

కోర్టు పర్యవేక్షణలో జరిగిన గ్రూప్‌ –1 నియామకాలను వివాదంగా మార్చే యత్నం 

కోవిడ్‌ నేపథ్యంలోనే డిజిటల్‌ మూల్యాంకనం 

వాటి ఫలితాలు వెలువడలేదు.. ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వలేదు

హాయ్‌ల్యాండ్‌లో అసలు మూల్యాంకనమే జరగలేదు.. సాక్షాత్తూ చంద్రబాబు హయాంలో ఏపీపీఎస్సీనే కౌంటర్‌లో హైకోర్టుకు ఆ విషయం స్పష్టం చేసింది 

ఇక అక్రమాలెక్కడ? స్కామ్‌ ఎక్కడ? 

హైకోర్టు ఆదేశాల మేరకే అత్యున్నత ప్రమాణాలతో మాన్యువల్‌ మూల్యాంకనం  

దాని ఆధారంగానే ఫలితాలు.. తుది ఎంపికలు

ఎంపికైన వారి ప్రొఫైల్స్‌ చూస్తే పరీక్షలెంత పారదర్శకంగా జరిగాయో అర్థమౌతుంది

వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రతిభకు పట్టమే తప్ప అక్రమాలకు ఆస్కారం లేదు

అత్యున్నత అధికారులతో మూడు ఇంటర్వ్యూ బోర్డులు

వైస్‌ చాన్సలర్‌లకూ ఇంటర్వ్యూ బోర్డులో స్థానం

ఎవరికీ అనుచిత లబ్ధి జరగలేదు.. మెరిట్‌ ఆధారంగానే ఎంపిక జరిగిందన్న సిట్‌ 

ఓ వైపు కోర్టు పర్యవేక్షణలో ప్రక్రియ.. మరోవైపు సిట్‌ నివేదికలో అక్రమాలకు ఆధారాల్లేవని స్పష్టీకరణ 

అయినా ఎల్లో మీడియా, బాబు కలిసి లోకేశ్‌ను రక్షించడానికి, ‘డీఎస్సీ’ని డైవర్ట్‌ చేయడానికి విఫలయత్నం

సాక్షి, అమరావతి: డీఎస్సీ అక్రమాలు, లీకేజీలపై జెన్‌జీ నిలదీస్తున్న వేళ.. అందరి దృష్టి మళ్లించేందుకు గ్రూప్‌–1పై పసుపురాతల ‘ఈనాడు’ అభూత కల్పనలకు తెగబడింది. డీఎస్సీ పాపాల నుంచి లోకేశ్‌ను కాపాడడానికి చంద్రబాబు వేసిన ఎత్తుగడ ఇది. నీట్‌ లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసిన నేపథ్యంలో డీఎస్సీ కుంభకోణంపై లోకేశ్‌ రాజీనామా చేయాలన్న డిమాండ్‌ రోజు రోజుకు పెరిగిపోతోంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా డీఎస్సీ కుంభకోణంపై వైఎస్సార్‌సీపీ నిలదీస్తుందన్న భయంతోనే చంద్రబాబు హడావిడిగా గ్రూప్‌–1 అక్రమాలంటూ కొత్త కథలు మొదలుపెట్టారు. వాస్తవానికి కోవిడ్‌ పరిస్థితుల కారణంగానే ఎపీపీఎస్‌సీ గ్రూప్‌–1 పరీక్షలలో డిజిటల్‌ మూల్యాంకనం చేపట్టారు. కానీ ఫలితాలు వెలువడలేదు. 

దాని ఆధారంగా ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వలేదు. ఎవరూ లబ్ధి పొందలేదు.  హాయ్‌ల్యాండ్‌లో అసలు మూల్యాంకనమే జరగలేదని, అక్కడ జరిగినది ప్రిపరేటరీ వర్క్‌ మాత్రమేనని సాక్షాత్తూ చంద్రబాబు హయాంలో కోర్టుకు సమర్పించిన అడిషినల్‌ అఫిడవిట్‌లో ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. ఒకవైపు మూల్యాంకనమే జరగలేదని కోర్టులో చెబుతారు. మరోవైపు అదే అంశంపై ఆరోపణలు, అనుమానాలు ఎందుకు రేపుతున్నారు?  హైకోర్టు ఆదేశాల మేరకే అత్యున్నత ప్రమాణాలతో మాన్యువల్‌ మూల్యాంకనం జరిగింది. దాని ఆధారంగానే తుది ఎంపికలు జరిగాయి. అసలు జవాబు పత్రాలు మార్చినట్లు, బార్‌కోడ్లు తారుమారు చేసినట్లు, ఎవరికైనా అక్రమంగా లబ్ధి చేకూర్చినట్లు ఆధారాలే లేవని సిట్‌ నివేదికే స్పష్టం చేసింది. మరి స్కామ్‌ ఎక్కడ? అంతేకాదు.. అభ్యర్థుల ప్రతిభ, ర్యాంకులు, తుది ఎంపికలో అక్రమాలు జరిగాయని కూడా సిట్‌ ఎక్కడా నిర్ధారించలేదు. ఒకవైపు కోర్టు పర్యవేక్షణలో అత్యంత పారదర్శకంగా ప్రక్రియ జరిగింది. మరోవైపు అక్రమాలకు ఆధారాలు లేవని సిట్‌ నివేదికే స్పష్టం చేసింది. మరి ఇంకా ఆరోపణలు ఎందుకు? డీఎస్సీ అక్రమాల నుంచి జనం దృష్టిని మళ్లించేందుకే ఈ డైవర్షన్‌ కథనాలు.. ఎల్లోవీుడియా, చంద్రబాబు కలిసి లోకేశ్‌ని రక్షించడానికే ఇలాంటి అభూతకల్పనలు వండివార్చుతున్నట్లు అర్థం కావడం లేదూ... 

అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి తప్పులు జరగలేదని స్పష్టం చేస్తూ సిట్‌ నివేదికలో పేర్కొన్న భాగం   

డీఎస్సీలాగా లీకేజీల్లేవ్‌.. అక్రమాల్లేవ్‌... 
వాస్తవానికి వైఎస్‌ జగన్‌ హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 పరీక్షల్లో ఇప్పుడు చంద్రబాబు హయాంలో జరిగిన డీఎస్సీ మాదిరిగా ఎలాంటి అక్రమాలు జరగలేదు. కావాల్సిన అభ్యర్థుల కోసం అనుకూల జీవోలు ఇవ్వలేదు. పరీక్షల నుంచి మినహాయింపులూ ఇవ్వలేదు. పేపర్‌ లీకేజీలు జరగలేదు. డీఎస్సీ మాదిరిగా ఏపీపీఎస్సీలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఫస్ట్‌ ర్యాంకుల్లాంటివి రాలేదు. 

కోవిడ్‌ వల్లే డిజిటల్‌ మూల్యాంకనం
కోవిడ్‌ నేపథ్యంలోనే రాష్ట్రప్రభుత్వం గ్రూప్‌–1 పరీక్షా పత్రాలను డిజిటల్‌ మూల్యాంకనం జరిపించింది. అయితే నోటిఫికేషన్‌ సమయంలో పేర్కొనలేదంటూ కొందరు అభ్యర్థులు కోర్టుకు వెళ్లడంతో టెక్నికల్‌ గ్రౌండ్స్‌లో డిజిటల్‌ మూల్యాంకనాన్ని కోర్టు నిలిపివేసింది. అంతే తప్ప డిజిటల్‌ మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని కాదు, కొంతమందికి అయాచిత లబ్ధి జరిగిందనీ కాదు. హైకోర్టు డిజిటల్‌ మూల్యాంకనం నిలిపేసిన తర్వాత, మాన్యువల్‌ మూల్యాంకనం ద్వారా మాత్రమే ఎంపిక ప్రక్రియ జరిగిందని స్పష్టంగా తెలిసినప్పటికీ, ఎంపిక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేయడం చంద్రబాబుకే చెల్లింది. ఎంతో కష్టపడి చదివి, కఠినమైన ఇంటర్వూ్యలో ఎంపికై, నాలుగేళ్లపాటు ఉన్నత ఉద్యోగాలు చేసి, ప్రజలకు సేవలందిస్తున్న 163 మంది గ్రూప్‌–1 ఆఫీసర్లపై చంద్రబాబు కత్తి కట్టారు. అత్యంత పకడ్బందీగా జరిగిన పరీక్షలో ఉత్తీర్ణులై ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా ఎంపికై ప్రస్తుతం ఉన్నత ఉద్యోగాల్లో ఉన్న 163 మంది జీవితాలతో కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఆటలాడుకుంటున్నారు.

హైకోర్టు పర్యవేక్షణలోనే మొత్తం ప్రక్రియ
అసలు ఈ నోటిఫికేషన్‌ ప్రారంభమైన దగ్గర నుంచి, ఉద్యోగాల భర్తీ వరకు మొత్తం ప్రక్రియ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకే సాగింది. అలాగే ఉద్యోగాలు సాధించిన వారు, ఉద్యోగాలు రాని వారు, కేసులు వేసిన వారు, ఇలా అందరి జవాబు పత్రాలన్నీ కూడా కోర్టు కస్టడీలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జవాబు పత్రాల మార్పులు, చేర్పులు జరగలేదని, తారుమారు కూడా కాలేదని సిట్‌ నిర్ధారించింది. ఉద్యోగాల భర్తీలో డిజిటల్‌ మూల్యాంకనాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. హైకోర్టు ఆదేశాల మేరకు చేసిన మాన్యువల్‌ మూల్యాంకనాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకున్నారు. మాన్యువల్‌ మూల్యాంకనంలో వచ్చిన మార్కులను మాత్రమే పరిగణనలోకి తీసుకునే ఉద్యోగాలు ఇచ్చారు. ఇంత న్యాయ పర్యవేక్షణ జరిగిన తర్వాత కూడా ఇప్పుడు ఈ తప్పుడు ప్రచారాలు చేయడం డీఎస్సీ లీకేజీ, అక్రమాల నుంచి డైవర్ట్‌ చేయడానికి కాక మరేమిటి?. అభ్యర్థుల ప్రతిభ, వారి ఎంపిక, వారి ర్యాంకుల్లో తప్పులు జరగలేదన్న విషయాన్ని సిట్‌ పదే పదే తన నివేదికలో స్పష్టం చేసింది. వారు తమ ప్రతిభ, మెరిట్‌ ఆధారంగానే ఉద్యోగాలకు ఎంపికయ్యారని నివేదికలో పేర్కొంది. అసలు వాల్యుయేషన్‌ ఎలా జరుగుతుందన్న దానిపై అటు ఎల్లో వీుడియాకు, ఇటు చంద్రబాబుకు అవగాహన లేకపోవడం వల్లే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.


అంతా సవ్యంగానే జరిగిందన్న ఏపీపీఎస్సీ
చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తొలి ఏడాదిలోనే 2025, ఏప్రిల్‌ 22న విజయవాడ సూర్యారావుపేట పోలీస్‌ స్టేషన్‌లో ఒక ఫిర్యాదు ఇప్పించి, ఏపీపీఎస్సీ మూల్యాంకనంపై విచారణకు ఓ సిట్‌ వేశారు..  వాదనల సమయంలో ప్రస్తుత ఏపీపీఎస్సీ పాలక మండలి తరఫున వాదనలు వినిపించిన అడ్వొకేట్‌ జనరల్‌ మూల్యాంకనం అంతా సవ్యంగానే సాగిందని స్పష్టంచేశారు. కౌంటర్‌ దాఖలు చేశారు. అటు తరువాత  హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం మరొక సిట్‌ను 2026, ఫిబ్రవరి 14న వేసింది. ఈ సిట్‌ వేసిన దగ్గర నుంచి హైకోర్టులో వాదనలు మారిపోయాయి, గతానికి భిన్నంగా రాజకీయ బాస్‌ల ఆదేశాలకు అనుగుణంగా వాదనలు మొదలయ్యాయి. రెండో సిట్‌ అందుకు అనుగుణంగానే రాజకీయ కోణంలో ప్రాథమిక నివేదికలు ఇచ్చింది. సిట్‌ నివేదిక మొత్తం చూస్తే అభ్యర్థుల అర్హతల మీద కాని, వారి సామర్థ్యాల మీద గాని, పరీక్షలు నిర్వహించిన విధానాల మీద కాని, జవాబు పత్రాలను తారుమారు చేసినట్టుగాని ఎక్కడా కూడా నిర్ధారణ కాలేదు. అయినప్పటికీ చంద్రబాబు, ఎల్లోవీుడియా బురదజల్లుతున్నాయి. ఉన్నత ఉద్యోగాల్లో ఉన్న వారు చంద్రబాబు రాజకీయ లబ్ధికోసం మానసిక వేదనను అనుభవించాల్సి వస్తోంది.


మూల్యాంకన ప్రక్రియ ఇలా ఉంటుంది...
మూల్యాంకనంలో భాగంగా వాల్యుయేటర్‌ దిద్దిన తర్వాత, చీఫ్‌ ఎగ్జామినర్‌కి ఇస్తారు. దాంట్లో ఏమైనా తేడాలున్నాయని చీఫ్‌ ఎగ్జామినర్‌ భావిస్తే, మళ్లీ ఆ జవాబుపత్రాన్ని మరొకసారి పరిశీలించమని మొదటి వాల్యుయేటర్‌ను కోరవచ్చు. లేదా మరో వాల్యుయేటర్‌కి అప్పగించవచ్చు. ఈ ప్రక్రియలో ప్రతి ప్రశ్న ఎవాల్యుయేటర్‌ దిద్దాడా? దిద్దిన ప్రతి ప్రశ్నకు మార్కులు వేశాడా? వేసిన ప్రతి మార్కును తిరిగి ఓఎంఆర్‌ షీట్లలో నింపారా? అని పరిశీలించి ఏమైనా తప్పులు ఉంటే ఆ తప్పులను సరిదిద్దమని మరోసారి వాల్యుయేటర్‌కి ఇస్తారు. ఈ కరెక్షన్స్‌ అన్నీ కూడా ప్రశ్నలవారీగా ఓఎంఆర్‌ షీటులో నమోదు చేస్తారు. ఇంత పకడ్బందీగా మూల్యాంకన ప్రక్రియ జరుగుతుంది. ప్రతిభ ఉన్న వారికి అన్యాయం జరగకుండా ప్రతి దశలో కూడా పరిశీలనా ప్రక్రియ ఉంటుంది. రెండు సార్లు ఇలాంటి ప్రక్రియలు ఉంటాయి. మరి ఈ ప్రక్రియను అక్రమంటూ తప్పుడు రాతలు రాసి రాజకీయం చేయడం చంద్రబాబుకే చెల్లింది. 

మూల్యాంకనంలో ఏకరూపత కోసం చీఫ్‌ ఎగ్జామినర్‌కు మార్కులను పరిశీలించి మాడరేట్‌ చేసే అధికారం ఉంటుంది అన్న అంశాన్ని ఎల్లో మీడియా మర్చిపోయింది. వాస్తవానికి జవాబు పత్రాల మూల్యాంకనం అనేక దశల్లో జరుగుతుంది. ఇందులో అనేక మంది పాలుపంచుకుంటారు. ఒక క్యాంపు ఆఫీసర్, ఆయన కింద అసిస్టెంట్‌ క్యాంప్‌ ఆఫీసర్, ఆయన కింద ఎగ్జామినర్, ఎగ్జామినర్‌ చేసిన మూల్యాంకనాన్ని పరిశీలించడానికి ఒక స్క్రూటినైజర్‌ ఉంటారు. వీళ్లందరి మీద ఒక చీఫ్‌ ఎగ్జామినర్‌ ఉంటాడు. ప్రతి జవాబు పత్రాన్ని వీళ్లంతా చూస్తారు. జవాబు పత్రం వీళ్లందరి దగ్గరకూ వెళ్తుంది. ప్రతి ఒక్కరూ పరిశీలిస్తారు. సరిదిద్దాల్సిన చోట దిద్దుతారు. ఈ దిద్దుబాట్లన్నీకూడా కంట్రోల్‌ బండిల్‌ స్లిప్పులో నమోదు అవుతాయి. ప్రతి ఒక్కరి సంతకాలు ఉంటాయి. అలాంటప్పుడు దిద్దివేతలు ఎలా అక్రమాలు అవుతాయి? 


అత్యున్నత అధికారులతో ఇంటర్వ్యూ బోర్డులు... 
విచిత్రంగా ఈ రెండో సిట్‌లో సభ్యుడిగా ఉన్న డీజీ ర్యాంకు అధికారి, సీనియర్‌ ఐపీఎస్‌ రవిశంకర్‌ అయ్యన్నార్, ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూ బోర్డులో సభ్యుడిగా ఉన్నారు. తదుపరి నోటిఫికేషన్లో అభ్యర్థులను ఇంటర్వ్యూ కూడా చేశారు. 163 మందిని ఎంపిక చేసే ప్రక్రియలో 24 మంది సీనియర్‌ ఐఏఎస్‌లు.. ఐపీఎస్‌లు ఇంటర్వ్యూ బోర్డులో సభ్యులుగా ఉన్నారు. వాళ్లు ఇంటర్వూ్యలకు మార్కులు కూడా వేశారు.

గతంలో ఒక బోర్డు.. వైఎస్సార్‌సీపీ హయాంలో మూడు బోర్డులు
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాకముందు ఏపీపీఎస్సీ ఎంపిక ప్రక్రియకు ఒక్కటే  ఇంటర్వ్యూ బోర్డు ఉండేది. అందులో ఒకరే  సివిల్‌ సర్వీసెస్‌ అధికారి ఉండేవారు. కానీ సంస్కరణల్లో భాగంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మూడు ఇంటర్వ్యూ బోర్డులు ఏర్పాటు చేసింది. గ్రూప్‌–1 నియామకాల్లో మొత్తంగా 24 మంది ఐఏఎస్, ఐపీఎస్‌లు ఇంటర్వూ్యలు చేశారు.

వీసీలకూ ఇంటర్వ్యూ బోర్డులో స్థానం.. 
ఎంపిక ప్రక్రియలో రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలకు చెందిన ఆరుగురు వైస్‌ఛాన్సలర్‌ (వీసీ)లకు కూడా ఇంటర్వ్యూ బోర్డులో స్థానం కల్పించారు. వారు కూడా అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసిన వారిలో ఉన్నారు. ఈ ఇంటర్వ్యూ బోర్డుల్లో ఉన్న సభ్యుల్లో, రెండు బోర్డులకు ఛైర్మన్లు అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం నియమించిన వారే ఉన్నారు.. వారిలో ఒకరు కె. విజయ్‌కుమార్‌ కాగా, మరొకరు ప్రొఫెసర్‌ పద్మరాజు.

గ్రూప్‌–1కి ఎంపికైన వారిలో 16 మంది ఐఏఎస్, ఐపీఎస్‌ సహా కేంద్ర సర్వీసులకు ఎంపికైనట్లు సిట్‌ వెల్లడించిన వారి వివరాలు  

జంబ్లింగ్‌ విధానంతో పారదర్శకత.. 
అప్పటి ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతం సవాంగ్‌ 104 మందిని ఇంటర్వ్యూ చేస్తే, చంద్రబాబు హయాంలో నియామకం అయిన కె. విజయ్‌ కుమార్‌ 102 మందిని ఇంటర్వ్యూ చేశారు. ఏ ఇంటర్వూ్యలో ఏ బోర్డు మెంబర్‌ ఉన్నారో కూడా తెలియకుండా.. జంబ్లింగ్‌ విధానాన్ని పాటించారు. దీనివల్ల అభ్యర్థుల ప్రయోజనాలు పూర్తిగా పరిరక్షించినట్లయింది.

హాయ్‌ల్యాండ్‌లో అసలు మూల్యాంకనమే జరగలేదు
హైకోర్టు సూచనల నేపథ్యంలో మాన్యువల్‌ ఎవాల్యుయేషన్‌కు ఏపీపీఎస్సీ సిద్ధమయ్యింది. కోవిడ్‌ నేపథ్యంలో హాయ్‌ల్యాండ్‌ను ఎంచుకున్నారు. కానీ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో అక్కడ మూల్యాంకనం జరగలేదు. ఇదే విషయాన్ని చంద్రబాబు హయాంలో ఏపీపీఎస్సీ కోర్టుకు సమర్పించిన అడిషినల్‌ అఫిడవిట్‌లో స్పష్టంగా పేర్కొంది. మాన్యువల్‌ ఎవాల్యూయేషన్‌కు అవసరమైన ప్రిపరేటరీ వర్క్‌ మాత్రమే అక్కడ జరిగిందని ఆ అఫిడవిట్‌లో ఏపీపీఎస్సీ స్పష్టంగా పేర్కొంది. అసలు అక్రమాలన్నీ హాయ్‌ల్యాండ్‌లోనే జరిగాయని, అక్కడే మూల్యాంకనం చేశారన్న పలువురి ఆరోపణలకు సిట్‌ కూడా తన నివేదికలో స్పష్టత ఇచ్చింది. హాయ్‌ల్యాండ్‌లో అసలు ఎలాంటి మూల్యాంకనం జరగలేదని తేల్చింది. గ్రూప్‌–1 వ్యవహారంలో హాయ్‌ల్యాండ్‌లో రెండో మూల్యాంకనం జరిగిందంటూ తప్పుడు ప్రచారాన్ని పదే పదే ప్రచారం చేస్తున్నారు. ‘అనర్హుల చేత మూల్యాంకనం చేయించారు’, ‘డేటా ఎంట్రీ ఆపరేటర్లతో పేపర్లు దిద్దించారు’ అంటూ తప్పుడు కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.

వైఎస్సార్‌సీపీ హయాంలోనే విప్లవాత్మక సంస్కరణలు 
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీపీఎస్సీలో భారీ సంస్కరణలు తీసుకొచ్చింది. అందులో భాగంగా... పారదర్శకత కోసం ఏపీపీఎస్సీ మూల్యాంకనంలో నిరంతర సీసీ కెమెరాల పర్యవేక్షణ పెట్టారు. పరీక్ష రాసే అభ్యర్థుల్లో డూప్లికేట్‌ క్యాండిడేట్‌ లేకుండా ఫేషియల్‌ రికగ్నిషన్, వేలిముద్రల స్వీకరణ, ప్రతి పరీక్షా హాల్లో సీసీ కెమెరాలు పెట్టారు. గతంలో ఎప్పుడూ ఇలా చేయలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఈ కఠినమైన, పారదర్శకమైన పద్ధతులు అవలంబించడం మొదలుపెట్టగానే, అటు సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఇవే పద్ధతులు అనుసరించడం మొదలుపెట్టింది.

పరీక్షలు పారదర్శకం.. అభ్యర్థుల ట్రాక్‌ రికార్డే నిదర్శనం
ఏపీపీఎస్సీ పరీక్షలు ఎంత సమర్థవంతంగా జరిగాయి, ఎంత పారదర్శకంగా జరిగాయి, ఎంత ప్రతిభ ఆధారంగా జరిగాయి అనడానికి ఎంపికైన అభ్యర్థుల ట్రాక్‌ రికార్డు కన్నా మరో నిదర్శనం ఉండదు. ఎంపికైన 163 మందిలో, ఇంటర్వ్యూలకు హాజరైన 325 మందిలో ఐఐటీల నుంచి 19 మంది, ఐఐఎంల నుంచి ఏడుగురు, ఎన్‌ఐటీల నుంచి 17 మంది, బిట్స్‌ పిలానీ నుంచి ఇద్దరు, ట్రిపుల్‌ ఐటీల నుంచి 13 మంది, ఇంజినీరింగ్, మెడిసిన్‌ లాంటి కోర్సులు పూర్తిచేసిన వారు 177 మంది, జనరల్‌ పీజీలు, గ్రాడ్యుయేట్లు 39 మంది ఉన్నారు.

సివిల్స్‌ అర్హత సాధించిన అభ్యర్థులు..
ఇందులో సివిల్‌ సర్వీసెస్‌ ఇంటర్వ్యూలకు ఎంపికైన వారు 39 మంది ఉంటే, ఇక్కడ ఉద్యోగాలు వచ్చిన తర్వాత కూడా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, ఐఆర్‌ఎస్‌లుగా ఇతర కేంద్ర సర్వీసులకు ఎంపికైన వారు 16 మంది ఉన్నారు. వీరిలో ఇద్దరికి సివిల్‌ సర్వీసుల్లో వేరే రాష్ట్రాల కేడర్‌ వస్తే సొంత రాష్ట్రాల్లోనే పనిచేద్దామని ఆ సివిల్‌ సర్వీసు పోస్టులను కూడా వదులుకుని ఇక్కడే కొనసాగుతున్నారు. పైగా ఇదే నోటిఫికేషన్లో ఉద్యోగాలు సాధించిన వారు కూడా, మళ్లీ ఏపీపీఎస్సీ నిర్వహించిన మరో నోటిఫికేషన్లో కూడా పరీక్షలు రాసి, డిప్యూటీ కలెక్టర్లుగా ఉద్యోగాలు పొందారు.

గ్రూప్‌–1కి ఎంపిక అయిన వారిలో ఐఐటీల నుంచి 19 మంది ఎంపికైనట్లు సిట్‌ వెల్లడించిన వివరాలు 

ఇంటర్వ్యూకు వచ్చిన వారిలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు
ఇవే ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూలకు హాజరైన 325 మందిలో కేంద్రప్రభుత్వ సంస్థల్లో పనిచేసినవారు 34 మంది, రాష్ట్ర ప్రభుత్వం, దానికి సంబంధించిన సంస్థల్లో పనిచేసిన వారు 103 మంది, ఇతర ఉద్యోగాలు చేసినవారు 101 మంది ఉన్నారు. ఐటీ రంగంలో నిపుణులుగానూ, బ్యాంకింగ్‌ రంగాల్లో ఉద్యోగులు గానూ, డాక్టర్లుగా పనిచేసిన వారూ ఉన్నారు. ఇదే రిక్రూట్మెంట్‌ లో ఎంపికైన వ్యక్తిని కుప్పం ఆర్డీఓగా చంద్రబాబు నియమించుకు­న్నారు. కోర్టు ఈ 163 మందిని నాన్‌ ఫోకల్‌ పోస్టుల్లో వేయాలని ఆదేశాలు ఇస్తే, ఇదే చంద్రబాబు మాత్రం ఆ ఆర్డీఓను తన నియోజకవర్గం కుప్పంలో ప్రత్యేకంగా నియమించుకున్నారు.  

దిద్దివేతలు ఎగ్జామినర్లవే
ఓఎంఆర్‌ షీట్లో దిద్దివేతలు గుర్తు తెలియని అజ్ఞాత వ్యక్తులు చేశారని, వారికి ఎలాంటి అర్హత లేదంటూ ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. వాస్తవానికి సిట్‌ తన నివేదికలో ఎగ్జామినర్లే దిద్దివేతలు చేశారని, కాకపోతే వాళ్లు మూల్యాంకనం చేసిన తర్వాత పొరపాటున కొన్నిచోట్ల సంతకాలు మరిచారని తేల్చి చెప్పింది. ఇదే విషయాన్ని ఎగ్జామినర్లు అంగీకరించారని సిట్‌ తన నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా ఇలా మరిచిపోవడాన్ని ఆసరాగా తీసుకుని ఎలాంటి బయటవ్యక్తులు దిద్దివేతలు చేసే అవకాశం కూడా లేదని తేల్చిచెప్పింది. సమాధాన పత్రాలు చెక్కు చెదరలేదు. మాన్యువల్‌ మూల్యాంకనంలో ఉపయోగించిన అభ్యర్థుల అసలు సమాధాన పత్రాలు చెక్కుచెదరకుండా ఉన్నాయని సిట్‌ నిర్ధారించింది. ఫోరెన్సిక్‌ నివేదికలు కూడా ఇదే విషయాన్ని చెప్పాయని సిట్‌ తన నివేదికలో పేర్కొంది. హాయ్‌ల్యాండ్‌లో జవాబు పత్రాలు 84 రోజుల పాటు ఉన్నప్పటికీ వాటిలో ఎలాంటి ట్యాంపరింగ్‌ లేదా మార్పులు జరగలేదన్నది ఫోరెన్సిక్‌ పరిశీలనలో తేలినట్లు సిట్‌ చెప్పింది.
ఎన్‌ఐటీల నుంచి 17 మంది ఎంపికైనట్లు సిట్‌ వెల్లడించిన వివరాలు 

కొందరికి లబ్ది చేకూర్చారన్న ఆరోపణలు తోసిపుచ్చిన సిట్‌...
ఎంపికైన 163 మంది అభ్యర్థులు, ఎంపిక కాని వారు, అలాగే హైకోర్టును ఆశ్రయించిన  408 మంది రిట్‌ పిటిషనర్ల విషయంలో ఒకే రకమైన మార్పుల నమూనాలు ఉన్నాయన్న సిట్, ఈ తేడాలు కేవలం ఒక నిర్దిష్ట సమూహానికే పరిమితం కాలేదని స్పష్టంగా పేర్కొంది. ముందుగా నిర్ణయించిన కొద్దిమందికే ప్రయోజనం చేకూర్చడానికి రికార్డులను సవరించారన్న ఆరోపణను సిట్‌ తోసిపుచ్చింది. మూల్యాంకనంలో మార్కులు పెరిగాయన్న దానికి సిట్‌ తన నివేదికలో చాలా స్పష్టమైన సమాధానం ఇచ్చింది. టోటల్‌ మార్కుల లెక్కింపులో దొర్లిన పొరపాటును సరిదిద్దడం వల్ల మాత్రమే మార్కుల పెరుగుదల జరిగిందని నిర్ధారించింది. తద్వారా మూల్యాంకన స్లిప్‌పై జరిగిన ప్రతి మార్పును మోసపూరిత తారుమారుగా చూడ్డానికి వీల్లేదని సిట్‌ తేల్చి చెప్పింది.

అక్రమాలకు ఆధారాల్లేవన్న సిట్‌.. 
నిజానికి సిట్‌ తన నివేదికలో ఎక్కడా కూడా గ్రూప్‌–1 సమాధాన పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని నిర్ధారించలేదు. బార్‌కోడ్లు మారలేదని స్పష్టం చేసినా, జవాబు పత్రాల మార్పిడి జరగలేదని చెప్పినా, మూల్యాంకనంలో ఎలాంటి అక్రమాల్లేవని తేల్చినా కూడా.. చంద్రబాబు, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం, తప్పుడు కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. హైకోర్టుకు సమర్పించిన 10 వేల పేజీల విచారణ నివేదికలో ‘ఒరిజినల్‌ జవాబు పత్రాలను మార్చినట్లు గానీ, బార్‌ కోడ్లను తారుమారు చేసినట్లు గానీ ఎలాంటి  ఆధారాలు లభించలేదని సిట్‌ తేల్చింది. ఏ ఒక్క అభ్యర్థికి కూడా లబ్ధి చేకూర్చినట్లు కూడా ఆధారాల్లేవంది. 287 బార్‌కోడ్ల వ్యత్యాసాలపై ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీ (సీఎఫ్‌ఎస్‌ఎల్‌) జరిపిన అత్యున్నత స్థాయి ఫోరెన్సిక్‌ పరీక్షల్లో అభ్యర్థుల పేపర్లు మారలేదని సిట్‌ తేల్చింది. అభ్యర్థుల గుర్తింపుపై గానీ, మూల్యాంకనంపై గానీ ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపలేదని సిట్‌ నివేదిక తేటతెల్లం చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement