రాజశేఖర్‌రెడ్డి, వాసుదేవరెడ్డిల అరెస్ట్ ముమ్మాటికీ అక్రమమే
మద్యం రవాణా కేసులో సిట్ తీరుపై హైకోర్టు ఆక్షేపణ
అందుబాటులోకి 121 పేజీల కామన్ ఆర్డర్ ప్రతి
సాక్షి, అమరావతి: మద్యం రవాణా కేసులో నిందితులు కేసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి అరెస్ట్ విషయంలో సీఐడీ సిట్ తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. మద్యం అక్రమ కేసులో బెయిల్ వచ్చిన వెంటనే అరెస్ట్ చేయడాన్ని కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఈ అరెస్ట్ ముమ్మాటికీ అక్రమమేనని తేల్చిచెప్పిన హైకోర్టు వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం చట్టవిరుద్ధమే అని స్పష్టం చేసింది. మద్యం రవాణా కేసులో తమ అరెస్ట్‌ను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ కేసిరెడ్డి, వాసుదేవరెడ్డి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ఇటీవల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ గేదెల తుహిన్ కుమార్ రెండు రోజుల క్రితం తీర్పు వెలువరించారు. రాజశేఖర్‌రెడ్డి, వాసుదేవరెడ్డిల అరెస్ట్‌ను అక్రమమని ప్రకటించారు. వారి తక్షణ విడుదలకు ఆదేశాలిచ్చారు. ఇందుకు సంబంధించి 121 పేజీల కామన్ ఆర్డర్ ప్రతి తాజాగా అందుబాటులోకి వచ్చింది.
అరెస్ట్‌కు ముందే వైద్య పరీక్షలా?
‘మద్యం రవాణా కేసులో చాలాకాలం అరెస్ట్ అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం భావించినప్పటికీ, 2026 ఏప్రిల్ 7వ తేదీన మద్యం అక్రమ కేసులో బెయిల్ లభించిన తరువాత నిందితులను అరెస్ట్, జ్యుడీషియల్ కస్టడీ కోసం అత్యవసరంగా చర్యలు తీసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. వీరిని ముందుగా కస్టడీలోకి తీసుకుని, తరువాత కోర్టులో అరెస్ట్ చూపారు. అరెస్ట్‌కు ముందు వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఇది బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 53కి విరుద్ధం. నిందితులు విచారణలో పాల్గొనడానికి ఎలాంటి ఆసక్తి చూపడంలేదనిగానీ లేదా వారు పరారీలో ఉన్నారనిగానీ సిట్ కౌంటర్ అఫిడవిట్ పేర్కొనలేదు. ఎలాంటి ఆరోపణలు లేనప్పుడు సీఆర్‌పీసీ నిబంధనలను ఉల్లంఘిస్తూ, నిందితులను అరెస్టు చేసి, ఆ తర్వాత హడావుడిగా జుడీషియల్ కస్టడీకి కోరాల్సిన అత్యవసర అవసరం ఎంత మాత్రం లేదు. చట్టం నిర్దేశించిన విధి విధానాలను సిట్ పాటించాల్సి తీరాల్సిందే. ప్రస్తుత కేసులో నిందితుల అరెస్ట్ అవసరం తప్పనిసరిగా ఉందని సిట్ నిరూపించలేకపోయింది’అని హైకోర్టు స్పష్టం చేసింది.
వ్యక్తిగత స్వేచ్ఛ అత్యంత ముఖ్యమైన ప్రాథమిక హక్కు
⇒ వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో చట్ట నిబంధనలను అనుసరించి తీరాల్సిందే. అధికరణ 21 కింద వ్యక్తిగత స్వేచ్ఛ అత్యంత ముఖ్యమైన ప్రాథమిక హక్కు.
⇒ దర్యాప్తు అవసరాలు, వ్యక్తిగత స్వేచ్ఛ మధ్య సమతుల్యత ఉండాలి.
⇒ దర్యాప్తు అధికారాలను ఉపయోగించి వ్యక్తి స్వేచ్ఛకు విఘాతం కలిగించరాదు.
⇒ రాజ్యాంగంలోని అధికరణ 21 ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన వ్యవహారాలలో చట్ట విధి విధానాలను అనుసరించకపోవడం తీవ్రమైన అక్రమ చర్యే అవుతుంది.
⇒ అధికరణ 22(1) ప్రకారం అరెస్ట్ చేసిన వ్యక్తికి అరెస్ట్‌కు సంబంధించిన గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ (అరెస్ట్‌కు దారి తీసిన వాస్తవ పరిస్థితులు)లను తెలియజేయడం రాజ్యాంగపరమైన తప్పనిసరి హక్కు.
⇒ కేవలం నామమాత్రంగా రీజన్స్ ఆఫ్ అరెస్ట్ (అరెస్ట్‌కు చూపే కారణాలు) చూపించడం సరిపోదు.
⇒ గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్.. రీజన్స్ ఆఫ్ అరెస్ట్ రెండూ ఒకటి కాదు.
⇒ గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్‌లో ఆ వ్యక్తిని ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందో తెలియచేసే వ్యక్తిగత, ప్రాథమిక వివరాలు ఉండాలి. ఒక వ్యక్తి అవసరమైతే తన రిమాండ్‌ను వ్యతిరేకించడానికి, బెయిల్ కోరడానికి ఇది దోహదపడుతుంది. గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ లిఖితపూర్వకంగా ఇవ్వాలని సుప్రీంకోర్టు ఎన్నో సందర్భాల్లో స్పష్టంచేసింది.
⇒ రిమాండ్‌కు కనీసం రెండు గంటల ముందు ఈ కారణాలను తెలియజేయాలి. లేదంటే దాని ఆధారంగా జరిగిన రిమాండ్ కూడా
చట్టవిరుద్ధం అవుతుంది.
⇒ రిమాండ్ రిపోర్ట్ మాత్రమే ఇవ్వడం గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఇచ్చినట్లు పరిగణించలేము.
⇒ రిమాండ్ రిపోర్ట్‌లో తగిన కారణాలున్నాయని చెబితే సరిపోదు. ఆ కారణాలను అరెస్ట్ చేసిన వ్యక్తికి ప్రత్యేకంగా అందించాల్సిందే.
⇒ న్యాయ వ్యవస్థ ఒకవైపు సక్రమమైన, సమర్థవంతమైన దర్యాప్తు ప్రయోజనాలను కాపాడుతూనే, మరోవైపు నిందితుల వ్యక్తిగత స్వేచ్ఛను సమతుల్యం చేయాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏ ఒక్క లక్ష్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదు.
⇒ దర్యాప్తు అధికారాలు న్యాయాన్ని అందించడానికి మాత్రమే ఉపయోగపడాలి. అనవసరంగా లేదా పరిమితికి మించి వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా ఉండకుండా చూడటం న్యాయస్థానాల బాధ్యత.


