రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుస్తోంది | Botsa Satyanarayana Participated in 80th Independence Day Celebrations | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుస్తోంది

Aug 16 2026 4:45 AM | Updated on Aug 16 2026 4:45 AM

Botsa Satyanarayana Participated in 80th Independence Day Celebrations

గాంధీజీ చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న బొత్స సత్యనారాయణ, అప్పిరెడ్డి తదితరులు

ప్రశ్నించే గొంతులను నొక్కడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం 

శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ 

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా స్వాతంత్య్ర దిన వేడుకలు

సాక్షి, అమరావతి: స్వాతంత్య్ర స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రంలో నేడు పోలీసు రాజ్యం నడుస్తోందని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతిపక్ష శ్రేణులు, ప్రజలపై అక్రమ కేసులతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ నేత, శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. తాడేపలిల్లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన స్వాతంత్య్ర దిన వేడుకల్లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలను రాజకీయ కోణంలో చూడటం, అన్యాయాన్ని ప్రశ్నించే గొంతుకలను నొక్కాలని చూడటం బ్రిటిష్‌ పాలనను తలపిస్తోందని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని చెప్పారు.

పౌరులకు స్వేచ్ఛ, వాక్‌ స్వాతంత్య్రం, సమానత్వపు హక్కులు ఏ ముఖ్యమంత్రో ఇచ్చినవి కావని, అవి డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ అందించిన రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులని స్పష్టం చేశారు. ఎన్నికలు జరిగినంత మాత్రాన ప్రజాస్వామ్యం పూర్తి కాదని, ఎన్నికల మధ్య కాలంలోనూ ప్రజల గొంతుకు విలువ, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారికి రక్షణ, ప్రతి అర్హుడికి సంక్షేమం అందినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం, స్వాతంత్య్ర స్ఫూర్తి సాకారమవుతాయని అన్నారు. నిజమైన స్వాతంత్య్రం, అభివృద్ధి అంటే కేవలం కాంక్రీటు భవనాలు, రోడ్లు నిర్మించడం కాదని.. పేదవాడికి ఉచిత విద్య, మెరుగైన వైద్యం, రైతులకు భరోసా, మహిళలకు భద్రత, యువతకు ఉపాధి లభించిన రోజే సంపూర్ణ స్వాతంత్య్రం వచ్చినట్లని చెప్పారు.

పాలకుల అధికారం శాశ్వతం కాదని, కేవలం ప్రజాస్వామ్యం, రాజ్యాంగం మాత్రమే శాశ్వతమని గుర్తుచేస్తూ.. పోలీసు వ్యవస్థ అధికార పార్టీ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల రక్షణ కోసం పనిచేయాలని ఆయన హితవు పలికారు. సమాజంలో వివక్ష, అణచివేత, పేదరికం లేని వ్యవస్థను నిర్మించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ప్రజల పక్షాన నిలబడి, వారి హక్కుల సాధన కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం తమ పార్టీ నిరంతరం రాజీలేని పోరాటం చేస్తుందని ఉద్ఘాటించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే మత్స్యలింగం, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement