తురకపాలెం మిస్టరీ మరణాలు.. మృత్యు సవారీ.. కన్నిటి క్వారీ | Govt negligence in Turakapalem deaths | Sakshi
Sakshi News home page

తురకపాలెం మిస్టరీ మరణాలు.. మృత్యు సవారీ.. కన్నిటి క్వారీ

Aug 16 2026 4:30 AM | Updated on Aug 16 2026 4:30 AM

Govt negligence in Turakapalem deaths

మిస్టరీ మరణాలకు కారణమైన క్వారీ గుంతలోని నీరు (ఫైల్‌)

46 మంది మృత్యువాత.. కొందరికే అరకొర సాయం

ఏడాదిన్నరగా బాధిత కుటుంబాల ఎదురుచూపులు

పింఛన్‌ అయినా ఇవ్వాలని వేడుకుంటున్న 12మంది వితంతువులు 

అప్పుల ఊబిలో బాధిత కుటుంబాలు

ఇప్పటికీ కొనసాగుతున్న మరణాలు 

నీటి కాలుష్యమే కారణమంటున్న గ్రామస్తులు 

బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

గుంటూరు రూరల్‌:  గుంటూరు జిల్లా రూరల్‌ మండలంలోని తురకపాలెం గ్రామంలో మిస్టరీ మరణాలకు ఏడాదిన్నర దాటుతున్నా బాధిత కుటుంబాల కన్నీళ్లు మాత్రం ఇంకా ఆరలేదు. అంతుచిక్కని ఈ మరణాలపై పెద్దఎత్తున చర్చ జరుగుతున్నా.. ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నా.. ఇప్పటికీ మరణాలు కొనసాగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామంలో మొత్తం 46 మంది మృతి చెందినట్లు బాధిత కుటుంబాలు, గ్రామస్తులు చెబుతున్నారు. ఈ మరణాలకు మెలియాయిడోసిస్‌ కారణమని అప్పట్లో చర్చ జరిగింది.

అయితే మరణాల వెనుక అసలు కారణాలపై గ్రామస్తుల్లో ఇప్పటికీ అనుమానాలు కొనసాగుతున్నాయి. గ్రామ శివారులోని క్వారీ గుంతల్లో నిల్వ ఉన్న నీటిని ఎస్సీ కాలనీకి సరఫరా చేయడం వల్ల నీటి కాలుష్యం జరిగిందని, దాని ప్రభావంతోనే వరుస అనారోగ్యాలు, మరణాలు చోటుచేసుకున్నాయని గ్రామస్తులు అప్పటినుంచి ఆరోపిస్తున్నారు. వీటిపై సమగ్రంగా విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, తమకు సాయం అందించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు. 

ఇప్పటికీ ఆగని మరణాలు    
తురకపాలెంలో బాధిత కుటుంబాల కష్టాలు ఇప్పటికీ ఆగలేదు. ఇటీవల కూడా మరో కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పెరికల శ్రీనివాసరావు (48) రెండు నెలలపాటు తీవ్ర జ్వరంతో బాధపడి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. అనంతరం కడుపులో గడ్డ ఉన్నట్లు గుర్తించి ఆపరేషన్‌ చేయించుకున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంటికి వచి్చన నాలుగు రోజులకే ఆయన తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందారని భార్య వెంకాయమ్మ చెబుతోంది.

 ‘‘మా కుటుంబం కూలీ పనులపైనే ఆధారపడి ఉంది. చికిత్స కోసం అప్పులు చేశాం. సుమారు రూ.1.5 లక్షలు పరీక్షలు, మందుల కోసం ఖర్చయ్యాయి. 2024 డిసెంబర్‌లో ఇంటి రుణం చెల్లించలేదని బ్యాంకు అధికారులు ఇంటికి తాళాలు వేశారు. చేసేదేమీ లేక రేకుల షెడ్డు వేసుకుని ఉంటున్నాం. ఇప్పుడు భర్త కూడా లేరు. ముగ్గురు పిల్లలను చదివించడంతో పాటు కుటుంబాన్ని పోషించేందుకు కూలి పనులకు వెళ్తున్నా. ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి.. పింఛన్‌ మంజూరు చేసి ఆదుకోవాలి’’ అని ఆమె వేడుకుంటోంది. 

అరకొర సాయం.. కొందరికే పరిమితం 
మరణాల నేపథ్యంలో ప్రభుత్వం స్పందించినప్పటికీ బాధిత కుటుంబాలకు తగిన సాయం అందలేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది. గతేడాది కొందరు బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే మరో 17 మంది బాధిత కుటుంబ సభ్యులు ఇప్పటికీ ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్నారని వారు వాపోతున్నారు. ‘‘అప్పట్లో అధికారులు వచ్చారు.. హామీలు ఇచ్చారు. కొందరికి కొంచెం సాయం అందింది. మాకు మాత్రం ఇప్పటికీ ఎదురుచూపులే మిగిలాయి’’ అని బాధిత కుటుంబ సభ్యులు అంటున్నారు. 

పింఛన్‌ అయినా ఇవ్వండి: వితంతువుల వేడుకోలు   
భర్తలను కోల్పోయిన కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు మరింత తీవ్రంగా ఉన్నాయి. కనీసం వితంతు పింఛన్‌ అయినా మంజూరు చేయాలని 12 మంది బాధిత మహిళలు అధికారులను కోరుతున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదని వారు చెబుతున్నారు. ఆదాయ వనరు కోల్పోయిన కుటుంబాలు అప్పులు తీర్చలేక, పిల్లల చదువులు కొనసాగించలేక, రోజువారీ జీవనం కోసం కూలి పనులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవైపు కుటుంబ పెద్దను కోల్పోవడం.. మరోవైపు వైద్య ఖర్చుల కోసం చేసిన అప్పులు.. ఇంకోవైపు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపులు.. బాధిత కుటుంబాలను మరింత కుంగదీస్తున్నాయి. 

సాయం లేదు.. శాశ్వత ఉపశమనానికి చర్యల్లేవు   
తురకపాలెం ఘటనపై అప్పట్లో పెద్దఎత్తున చర్చ జరిగినప్పటికీ.. బాధిత కుటుంబాలకు దీర్ఘకాలిక ఉపశమనం కలి్పంచే చర్యలు మాత్రం కనిపించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. వరుస మరణాలకు కారణాలపై సమగ్ర విచారణ, నీటి వనరుల పరిశీలన, బాధిత కుటుంబాల పునరావాసం, వైద్య సహాయం, పింఛన్ల మంజూరు వంటి అంశాల్లో స్పష్టమైన కార్యాచరణ అవసరమని బాధితులు కోరుతున్నారు.

మరణించిన వారి కుటుంబాలను కేవలం అప్పటికప్పుడు పరామర్శించి, కొంత ఆర్థిక సాయం అందించడంతో బాధ్యత ముగిసినట్లుగా వ్యవహరించకుండా.. వారికి నిరంతర సహాయం అందించాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు వచి్చన మిస్టరీ మరణాల ఘటన ఇప్పుడు పాలకుల దృష్టికి దూరమైందన్న ఆవేదన తురకపాలెం బాధిత కుటుంబాలలో వ్యక్తమవుతోంది. చనిపోయినవారిని తిరిగి తీసుకురాలేకపోయినా.. వారి కుటుంబాలను ఆదుకోవడం, మరణాలకు అసలు కారణాలను తేల్చడం, భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత. తురకపాలెం బాధితులకు ఆ న్యాయం ఎప్పుడొస్తుందన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న.

భర్తను కోల్పోయి.. అప్పులతో మిగిలిన జీవితం
‘రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం మాది. అప్పులు చేసి ఆస్పత్రుల చుట్టూ తిరిగాం. అయినా నా భర్త ప్రాణాలు దక్కలేదు. అప్పులు మాత్రం మిగిలాయి. ఏడాదిన్నరగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా కనీసం పింఛన్‌ కూడా మంజూరు కాలేదు. మమ్మల్ని ఆదుకునేవారు ఎవరూ లేరు’ తురకపాలెం గ్రామానికి చెందిన దేవమ్మ ఆవేదన ఇది. ఆమె భర్త మేళం వెంకయ్య (55) వ్యవసాయ కూలీ. భార్యాభర్తలిద్దరూ కూలి పనులు చేసుకుంటూ జీవించేవారు.

 ఇద్దరు కుమార్తెలకు వివాహాలు చేసి పంపారు. 2024 మార్చి 18న వెంకయ్య తీవ్ర అనారోగ్యంతో మృతి చెందాడు. దాదాపు రెండు నెలలపాటు తీవ్రమైన జ్వరంతో ఆస్పత్రుల చుట్టూ తిరిగిన అనంతరం ఆయన ప్రాణాలు కోల్పోయారని దేవమ్మ చెబుతోంది. ‘ఆయన పోయిన నాటినుంచి మా కుటుంబాన్ని ఎవరైనా ఆదుకోకపోతారా అని ఎదురుచూస్తున్నా. ప్రభుత్వం ఇచ్చే సాయం కోసం ఎన్నోసార్లు అధికారుల చుట్టూ తిరిగాను. కనీసం వితంతు పింఛన్‌ అయినా వస్తే బతుకు నెట్టుకొస్తానని కోరాను. ఫలితం లేదు. ఇప్పుడు మిరపతోటల్లో కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నా’ అంటూ దేవమ్మ కన్నీటి పర్యంతమైంది.

కుమారుడిని కోల్పోయి.. అప్పుల్లో కూరుకుపోయిన తండ్రి 
గ్రామానికి చెందిన దొడ్డా జాన్‌బాబు కుటుంబానిది మరింత విషాదకర పరిస్థితి. జాన్‌బాబు, ఆయన కుమారుడు సతీష్ బాబు (40) ఇద్దరూ తీవ్రజ్వరంతో అనారోగ్యానికి గురయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో జాన్‌బాబుకు ఆపరేషన్‌ చేయాల్సి వచి్చంది. కొంతకాలం తర్వాత ఆయన ఇంటికి వచి్చనా కుమారుడు సతీష్‌బాబు పరి­స్థితి విషమించి అవయవాలు విఫలమై మృతి చెందాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 2024 డిసెంబర్‌ 11న సతీష్ బాబు మృతి చెందినట్లు కుటుంబం తెలిపింది. 

చికిత్స సమయంలో ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించినప్పటికీ పరీక్షలు, మందుల కోసం అదనంగా ఖర్చు చేయాల్సి వచి్చందని, మొత్తం మీద సుమారు రూ.4 లక్షల వరకు ఖర్చయిందని జాన్‌బాబు చెబుతున్నారు. ‘ఏడాదిన్నరగా మా కుటుంబాన్ని ఆదుకోవాలని అధికారులను వేడుకుంటున్నాం. ఒక్కరు కూడా పట్టించుకోలేదు. మా పరిస్థితి ఏమిటో ఎవరూ అడగలేదు. మాకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం చేయాలి’ అని ఆయన కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement