కర్నూలు: తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను అక్రమ కేసులతో వేధిస్తున్న కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. అక్రమ కేసులు పెడితే భయపడతామని అనుకోవడం పొరపాటన్నారు. అక్రమ కేసులకు తాము భయపడే ప్రసక్తే లేదన్నారు కాటసాని. కర్నూలు జిల్లా పర్యటనలో తమ పార్దీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వచ్చిన ప్రజాదరణ చూసి తమపై కేసులు పెట్టారని, వాటికి తామేమీ భయపడమన్నారు.
‘మీ కేసులతో వైఎస్ జగన్ నుంచి మమ్మల్ని వేరు చేయలేరు. ఇచ్చిన హామీలలను కూటమి ప్రభుత్వం అమలు చేయకపోవడంతోనే వైఎస్ జగన్‌కు ప్రజల ఆదరణ పెరుగుతుంది. వైఎస్ జగన్‌తో ప్రజలకు మేలు జరుగుతుందని నమ్మకంతోనే జనాలు నీరాజనం పడుతున్నారు. కూటమి ప్రభుత్వం మాపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయించింది. వైఎస్ జగన్‌ను చూసేందుకు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు. జన సమీకరణ చేశారంటూ పోలీసులు తప్పుడు కేసులు పెట్టారు. మీరు పెట్టే తప్పుడు కేసులపై వైఎస్సార్‌సీపీ న్యాయపోరాటానికి సిద్ధం’ అని హెచ్చరించారు.


