డేటా సెంటర్లకు 3.5 టీఎంసీలే కావాలని చంద్రబాబు చాలా తేలిగ్గా చెబుతున్నారు
ఆ నీటిని మళ్లించేస్తే విశాఖ ప్రజల పరిస్థితేంటో ఆలోచించరా?
సీఎంకు కేంద్ర మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ బహిరంగ లేఖ
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుకు 3.5 టీఎంసీల నీటిని కేటాయించడంపై కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ ఆందోళన వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబుకి లేఖ రాశారు. డేటా సెంటర్లకు అవసరమయ్యే నీటి పరిమాణం స్వల్పమేనని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే.. ఇక్కడ నీటి సమస్యంటే సీఎంకు చులకనగా ఉన్నట్లు అనిపిస్తోందని లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు మాటలు.. విశాఖ ప్రజల ఆవేదనను ఉదాసీనతతో తోసిపుచ్చడమేననీ, ఇది అవగాహనా లోపాన్ని సూచిస్తోందని విమర్శించారు. జాతీయ జల విధానం ప్రకారం తాగునీరు, సాగునీటి తర్వాతే పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వాలనీ.. ప్రస్తుతం నగరానికి ఏటా 5.16 టీఎంసీల నీరు అవసరం ఉండగా.. అందులో 68 శాతం నీటిని కేవలం డేటా సెంటర్లకే మళ్లించడం విచారకరమన్నారు.
ఏలేరు, స్థానిక రిజర్వాయర్ల ద్వారా వస్తున్న 9.6 టీఎంసీల నీటిలో ఇప్పటికే సగానికి పైగా స్టీల్‌ప్లాంట్, హెచ్‌పీసీఎల్, పోర్టులు, ఫార్మా కంపెనీలకు వెళుతోందన్న విషయాన్ని చంద్రబాబుకు లేఖలో గుర్తు చేశారు. విశాఖ ప్రజలు భవిష్యత్‌లో తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొనే ప్రమాదం ఉంటే.. పోలవరం ‘ఉత్తరాంధ్ర సుజల స్రవంతి’ నీటి లెక్కలను కూడా పరిగణనలోకి తీసుకోకుండా అదనంగా మరో 3 డేటా సెంటర్లతో పాటు ఆర్సెలార్ మిట్టల్ వంటి భారీ పరిశ్రమలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం ఆశ్చర్యకరమని పేర్కొన్నారు.
సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా పరిశ్రమలకు కేటాయించిన 5.34 టీఎంసీల నీరు పాత అవసరాలకే పరిమితమని, కొత్తవాటికి ఎక్కడినుంచి నీరు తెస్తారో ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక జలాశయాల నుంచి గానీ, ఏలేరు, పోలవరం నుంచి గానీ ఒక్క లీటరు నీటిని కూడా డేటా సెంటర్లకు మళ్లించకూడదని, చట్టాలను ఉల్లంఘించి ప్రజల అభిప్రాయం లేకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే విశాఖకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని శర్మ హెచ్చరించారు.


