breaking news
Crop yield
-
దిగుబడి ఆధారిత పంటల బీమా గడువు పొడిగింపు
సాక్షి, అమరావతి: ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) కింద దిగుబడి ఆధారిత పంటల ప్రీమియం చెల్లింపు గడువును మరోసారి బీమా కంపెనీలు పొడిగించాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆగస్టు 31 వరకు ప్రీమియం చెల్లింపునకు వెసులుబాటు కల్పించాయి. గడువు పొడిగించినా అన్ని జిల్లాల్లో.. అన్ని పంటలకు ఈ అవకాశం ఉండదు. కొన్ని క్లస్టర్లలో వరికి మాత్రమే పొడిగింపు వర్తిస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో నోటిఫై చేసిన అన్ని పంటలకు అవకాశం ఇచ్చారు. అనంతపురం, తిరుపతి, గుంటూరు, నంద్యాల, విశాఖపట్నం, పల్నాడు, శ్రీకాకుళం, వైఎస్సార్ కడప జిల్లాల్లో పొడిగింపు వరి పంటకు మాత్రమే వర్తిస్తుంది. వీటిలో కొన్ని జిల్లాల్లో రుణాలు తీసుకున్న రైతులకు మాత్రమే అర్హత కల్పించారు.అన్నమయ్య, ఏలూరు, ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల్లో వరికి మాత్రమే అవకాశం ఇవ్వగా.. ఇక్కడ రుణాలు తీసుకున్న, తీసుకోని రైతులకు నెలాఖరు వరకు ప్రీమియం చెల్లింపునకు అవకాశం కల్పించారు. చిత్తూరు, కృష్ణా, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాల్లో నోటిఫై చేసిన అన్ని పంటలకు అందరు రైతులకు అవకాశం కల్పించారు. శ్రీసత్యసాయి, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నోటిఫై చేసిన అన్ని పంటలకు అవకాశం ఉన్నా రుణాలు తీసుకున్న రైతులకే అవకాశం కల్పించారు. అనకాపల్లి, కోనసీమ, కర్నూలు, బాపట్ల, ఎనీ్టఆర్, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అన్ని పంటలకు రుణ, రుణేతర రైతులకు అవకాశం కల్పించారు. కాగా ఇప్పటివరకు రాష్ట్రంలో వాతావరణ ఆధారిత పంటల బీమా పరిధిలో 14.75 లక్షల ఎకరాల్లో సాగైన నోటిఫై చేసిన పంటలకు 4.85 లక్షల మంది రైతులు ప్రీమియం చెల్లించారు. అదే సమయంలో పీఎంఎఫ్‌బీవై కింద దిగుబడి ఆధారిత పంటలకు సంబంధించి 23.05 లక్షల ఎకరాల్లో సాగైన నోటిఫై చేసిన పంటలకు 9.28 లక్షల మంది రైతులు ప్రీమియం చెల్లించినట్లు వ్యవసాయశాఖ గణాంకాలు చెబుతున్నాయి. సాగు లేకున్నా బీమా చేయించాల్సిందే రైతు సేవా కేంద్రాల(ఆర్ఎస్కే) సిబ్బంది మెడపై కత్తి పెట్టి మరీ పంటల బీమా నమోదు కోసం ఒత్తిడి తీసుకొస్తున్నారు. తీవ్ర కరువు ప్రభావంతో ఖరీఫ్ పంటల సాగు నత్తనడకన సాగుతోంది. సాగు లక్ష్యం 80 లక్షల ఎకరాలుకాగా.. ఇప్పటి వరకు 41.97 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. తీవ్ర ఉష్ణోగ్రతల ప్రభావంతో సాగైన పంటల్లో సైతం 30–40 శాతం వరకు పంటలు ఎండిపోయాయి. ఎకరాకు రూ.15వేల నుంచి రూ.20వేల వరకు పెట్టుబడి పెట్టినా పంటలు మొలకెత్తని పరిస్థితి నెలకొంది. సాగు చేసినా, చేయకపోయినా సరే పంటల బీమా నమోదు చేయించాల్సిందేనంటూ ఆర్ఎస్కే సిబ్బందిపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో ఇప్పటికే పెట్టుబడి రూపంలో తీవ్రంగా నష్టపోయిన రైతుల నుంచి ప్రీమియం మొత్తాన్ని బలవంతంగా వసూలు చేస్తున్నారు. వాస్తవానికి ఈ పంట నమోదు ప్రామాణికంగా పంటల బీమా నమోదు చేయాలి. కానీ.. ఈ–క్రాప్ నత్తనడకన సాగుతోంది. వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు సాగు చేయక.. ఈ–క్రాప్‌లో నమోదు కాకపోతే తమ పరిస్థితి ఏమిటని రైతులు ప్రశి్నస్తున్నారు. పంటల బీమా పరిహారం మాట దేవుడెరుగు అప్పులుచేసి చెల్లిస్తున్న ప్రీమియం తిరిగి వచ్చే పరిస్థితి ఉంటుందో లేదో తెలియక రైతులు గగ్గోలు పెడుతున్నారు. రెండేళ్లుగా వరుస విపత్తులతో తీవ్రంగా నష్టపోతున్నా పైసా పరిహారం కూడా రైతులకు అందని పరిస్థితి నెలకొంది. గడువు పెంచినంత మాత్రాన సంఖ్యల కోసం హడావుడిగా నమోదు చేయకుండా.. రైతు వాస్తవంగా సాగు చేసిన పంట, విస్తీర్ణం, బీమా పరిధి, రైతు అర్హత వంటి అంశాలను నిర్ధారించిన తర్వాతే బీమా నమోదు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
ఈ 3జీ కటింగ్‌తో.. ఒక్క మొక్క 3 రెట్లు దిగుబడి!
మిద్దె తోటల్లో మొక్కలు గుబురుగా పెరిగి, ఎక్కువ దిగుబడి రావటానికి చేసే ఒక ముఖ్యమైన పద్ధతే 3జీ కటింగ్. ప్రధానంగా తీగ జాతి మొక్కలైన సొర, కాకర, దోస, బీర వంటి పంటలకు ఇది బాగా ఉపయోగపడుతుంది.1. మొక్క మొదటి తరాన్ని 1జీ అని, దాని నుంచి వచ్చే కొమ్మలను 2జీ అని, ఆ కొమ్మల నుంచి వచ్చే మరిన్ని కొమ్మలను 3జీ అని అంటారు. మొక్కకు కేవలం మగ పూలు కాకుండా, ఎక్కువ ఆడ పూలు (కాయలుగా మారేవి) రావటానికి ఈ పద్ధతిని వాడతారు.2. మొదటి తరం (1G -1st Generation) : మొక్క పెరగడం ప్రారంభించినప్పుడు, ప్రధాన కాండం సుమారు 7–8 అడుగుల పొడవు పెరిగే వరకు ఉంచాలి. ఆ తర్వాత, ఆ ప్రధాన కాండం చివరను (కొనను) కత్తిరించాలి. దీన్నే 1జీ కటింగ్ అంటారు.3. రెండో తరం (2G -2nd Generation) : ప్రధాన కాండం కత్తిరించిన తర్వాత ఆకు మూలల నుంచి కొత్తగా 2–3 కొమ్మలు వస్తాయి. వీటిని 2జీ కొమ్మలు అంటారు. ఈ 2జీ కొమ్మలు కూడా 2–3 అడుగులు పెరిగిన తర్వాత, వాటి చివరలను కూడా కత్తిరించాలి.4. మూడో తరం(3G -3rd Generation) : ఇప్పుడు 2జీ కొమ్మల నుంచి మరిన్ని కొత్త కొమ్మలు (3జీ) వస్తాయి.ఈ 3జీ కొమ్మలపైనే అత్యధికంగా ఆడ పూలు వస్తాయి, ఫలితంగా కాయలు ఎక్కువగా కాస్తాయి.5. మొక్క ఆరోగ్యంగా ఉన్నప్పుడు, కనీసం 10–12 ఆకులు ఉన్నప్పుడే కటింగ్ ప్రారంభించాలి.6. పొద జాతి మొక్కలకు (మిరప, టమోటా, మందార, మల్లె వంటివి) మనం చేసే కటింగ్‌ను సాధారణంగా ‘పించింగ్’ అని కూడా అంటారు. మొక్క 10–12 ఆకులతో ఒక అడుగు ఎత్తు పెరిగినప్పుడు, పై భాగంలోని లేత చిగురును తుంచేయాలి.7. చిగురు తుంచిన చోట నుండి రెండు, మూడు కొత్త కొమ్మలు వస్తాయి. అవి కొంచెం పెరిగిన తర్వాత వాటి చిగుర్లను కూడా తుంచితే, మొక్క మరింత గుబురుగా మారి ఎక్కువ పూలు, మొగ్గలు వస్తాయి.8. గోరుచిక్కుడు మొక్కకు సాధారణంగా 3జీ కటింగ్ అవసరం ఉండదు, ఎందుకంటే ఇది సహజంగానే కొమ్మలతో పెరుగుతుంది. అయితే మరీ పొడవుగా పెరుగుతుంటే పైభాగాన్ని తుంచవచ్చు.9. టమాటాలో 3జీ కటింగ్ కంటే సక్కర్స్ తొలగించటం, ప్రూనింగ్ చేయటం దిగుబడి పెంచడానికి బాగా పనిచేస్తుంది.10. టమాటాలో ΄ాకే రకాలు ఉంటాయి. ఇవి చాలా ఎత్తు పెరుగుతాయి. వీటి చివరలను కట్ చేస్తే పెరుగుదల ఆగిపోతుంది. కాబట్టి, సాధారణంగా వీటి కాండం పక్కల నుండి వచ్చే అనవసరమైన చిన్న రెమ్మలను తీసేయాలి. 11. పొద రకం టమాటా మొక్కలు కొంత ఎత్తు పెరిగి ఆగిపోతాయి. వీటిని ఎక్కువగా కత్తిరించాల్సిన అవసరం లేదు, కేవలం కింద నేలకు తగిలే ఆకులను తీసేస్తే సరిపోతుంది.12. టమాటా మొక్కలు లో అనవసరమైన కొమ్మలను లేదా చివరలను కత్తిరించడం వల్ల మొక్క తన శక్తిని పండ్లు పెద్దవిగా పెరగడానికి, త్వరగా పక్వానికి రావడానికి ఉపయోగిస్తుంది. సీజన్ చివరలో మొక్క చివరలను కత్తిరించడం వల్ల కొత్తగా పూలు పూయడం ఆగి, అప్పటికే ఉన్న కాయలు త్వరగా పండుతాయి.13. కటింగ్ చేసిన వెంటనే మొక్కకు లిక్విడ్ ఫెర్టిలైజర్ (జీవామృతం లేదా బియ్యం కడిగిన నీళ్లు) లేదా వర్మీ కంపోస్ట్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఎందుకంటే కొత్త కొమ్మలు రావడానికి మొక్కకు శక్తి కావాలి. ఆవు పేడ, మూత్రం, బెల్లం, శనగపిండితో తయారుచేసే జీవామృతం మొక్కకు అమృతంలా పనిచేస్తుంది. ఇది వారానికి ఒకసారి. పోయవచ్చు.14. గోళ్లతో తుంచడం కంటే పదునైన కత్తెర వాడటం మేలు. కత్తిరించిన భాగం వద్ద కొంచెం పసుపు రాస్తే ఇన్ఫెక్షన్ సోకకుండా ఉంటుంది. 15. కటింగ్ తరువాత మొక్క పైన నీరు చల్లకుండా, మొదట్లో మాత్రమే పోయాలి. 16. తీగ జాతి మొక్కలలో (సొర, బీర, కాకర వంటివి) పూత, పిందె దశలో ఉన్నప్పుడు 3జీ కటింగ్ చేయడం సరైన పద్ధతి కాదు. 3జీ కటింగ్ ప్రక్రియను మొక్క చిన్నగా ఉన్నప్పుడే (సుమారు 1 మీటర్ లేదా 6–8 ఆకులు ఉన్నప్పుడు) ప్రారంభించాలి. దీని ఉద్దేశ్యం కొత్త రెమ్మలను (2జీ, 3జీ కొమ్మలను) పుట్టించి, వాటిపై ఎక్కువ ఆడ పూలను వచ్చేలా చేయడం.17. పూత, పిందె దశలో కొమ్మలను కత్తిరించడం వల్ల ఇప్పటికే ఉన్న పూలు, పిందెలు రాలిపోయే అవకాశం ఉంది. అలాగే, మొక్క తన శక్తిని కొత్త కొమ్మల ఉత్పత్తికి మళ్లిస్తుంది, దీనివల్ల ఉన్న కాయలు సరిగ్గా పెరగవు. తగినంత ఎరువులు, నీరు అందిస్తే కాయలు నాణ్యంగా పెరుగుతాయి.18. ఒకవేళ మొక్క కేవలం మగ పూలనే పూస్తూ, అసలు పిందెలు పడకపోతే, అప్పుడు చివరి రెమ్మలను కొద్దిగా తుంచవచ్చు (పించింగ్). కానీ పద్ధతి ప్రకారం చేసే 3జీ కటింగ్ మాత్రం పంట ప్రారంభ దశలోనే పూర్తి చేయాలి. 19. 3ఎ కటింగ్ ద్వారా ఒకే మొక్క నుండి సాధారణం కంటే 2 నుండి 3 రెట్లు ఎక్కువ దిగుబడిని సాధించవచ్చు.20. మొక్కకు నత్రజని ఎక్కువగా అందడం వల్ల ఆకులు, మగ పూలు విపరీతంగా వస్తాయి. బూడిద లేదా అరటిపండు తొక్కల పొడి వంటివి వేయడం ద్వారా పొటాషియం, ఫాస్పరస్ అంది, ఆడ పూల సంఖ్య పెరుగుతుంది. అరటిపండు తొక్కలను 2–3 రోజులు నీటిలో నానబెట్టి, ఆ నీటిని మొక్కలకు పోయడం వల్ల పొటాషియం అందుతుంది.21. ఇంట్లో వాడిన కోడిగుడ్డు పెంకులను పడేయకుండా, వాటిని పొడి చేసి మట్టిలో కలపడం లేదా నీటిలో వేసి మరిగించి ఆ నీటిని చల్లార్చి మొక్కలకు పోయటం ద్వారా కాల్షియం అంది పిందెలు కుళ్ళిపోకుండా ఉంటాయి. పూత రాలకుండా బలంగా ఉంటుంది.22. హ్యాండ్ ΄ాలినేషన్ చేయాలి. ఒకవేళ తోటలో తేనెటీగలు లేకపోయినా లేదా ఆడ పూలు తక్కువగా ఉన్నా పిందెలు కాయలుగా మారవు. అప్పుడు మనమే స్వయంగా పరాగ సంపర్కం చేయవచ్చు. బాగా వికసించిన మగ పూవును కోసి, దాని రేకులను తీసివేసి ఆ మగ పూవు మధ్యలో ఉండే పరాగ రేణువులను ఆడ పూవు (పువ్వు కింద చిన్న పిందె ఉండేది) మధ్య భాగంలో మెల్లగా తాకించాలి.. ఈ పనిని ఉదయం 6 నుండి 9 గంటల లోపు చేస్తే ఫలితం బాగుంటుంది.23. బాగా పులిసిన మజ్జిగలో కొద్దిగా ఇంగువ కలిపి ఒక లీటరుకు 10 లీటర్ల నీరు కలిపి మొక్క అంతా తడిచేలా పిచికారీ చేయడం వల్ల పూత బాగా వస్తుంది. ఇది ‘మిరకిల్ లిక్విడ్’ లాగా పనిచేస్తుంది. ఇంగువను పిచికారీ చేయటం వల్ల పూత రాలదు. మగ పూల కంటే ఆడ పూలు వచ్చే అవకాశం పెరుగుతుంది.24. మట్టి ఎప్పుడూ తడిగా ఉండేలా చూసుకోవాలి. కానీ నీరు నిలవకుండా జాగ్రత్త పడాలి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే మగ పూలు పెరిగే అవకాశం ఉంటుంది.- కొల్లి కృష్ణ కుమారి, అడ్మిన్, గుంటూరు జిల్లా, మిద్దె తోటల బృందం. మొబైల్: 94906 02366 -
వట్టివేరుతో గట్టి మేలు!
మెట్ట భూమిలో ఏదైనా ఒక ఆరుతడి పంటను సాగు చేస్తే ఏమవుతుంది? పంట దిగుబడి వస్తుంది, తద్వారా రైతుకు ఆదాయం వస్తుంది. అది సరే. కానీ, భూమికి, భూగర్భ జలాలకు ఏమవుతుంది? సాధారణంగా భూమిలో సారం తగ్గటంతోపాటు భూగర్భంలో నీరూ కొంత తగ్గుతుంది. అందుకే, ఈ నష్టం పూడ్చటానికి, పంట దిగుబడి బాగా రావటానికి ఎరువులు తెచ్చి వేస్తూ ఉంటాం. బోర్లు లేదా బావులు తవ్వి నీటి సదుపాయం కల్పించుకుంటాం. కానీ, వట్టివేరు పంట విషయంలో అలా కాదు. ఈ పంటను నాటితే అద్భుతమైన, విలువైన సుగంధ తైలం లభిస్తుంది. అంతేకాదు, ఆ నేల సుసంపన్నమవుతుంది. పొలంలో నుంచి మట్టి వానకు కొట్టుకుపోదు. ఎందుకంటే, వాన నీరు చాలా వరకు భూమిలోకి అద్భుతంగా సహజంగా ఇంకుతుంది. ఈ శక్తి వట్టివేరు పంటకు ఎలా వచ్చిందంటే.. దాని విశిష్టమైన, లోతైన, పటిష్టమైన కుచ్చు వంటి వేరు వ్యవస్థ ద్వారానే చేకూరింది, ప్రకృతిసిద్ధంగా!ఫౌండేషన్ విశేష కృషి... మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల ప్రతి ఏటా మన దేశంలో సుమారు 53 లక్షల టన్నుల భూమి పైపొర మట్టి కొట్టుకుపోతోందని అంచనా. ఈ నష్టాన్ని అరికట్టే ఒక ఉపాయం వట్టివేరు సాగు. వర్షాధారిత ప్రాంతాల రైతులకు ఇది అత్యంత లాభదాయకమైన మార్గంగా నిలుస్తోందని అనుభవాలు చెబుతున్నాయి. వట్టివేరు పంట సాగును రైతాంగంలోకి విస్తృతంగా వ్యాప్తి చెయ్యటంలో తమిళనాడు రాష్ట్రంలో విశేష కృషి జరుగుతోంది. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ‘ఇండియా వెటివర్ ఫౌండేషన్’ ఈ కృషిలో ఎంతో ముందంజలో ఉంది. తీవ్రమైన నేల కోతను నివారించి, నీటి కొరతను అధిగమించేందుకు ‘వట్టివేరు సాంకేతికత’ రైతులకు స్పష్టమైన ఫలితాలను అందిస్తోంది.ఎకరానికి 12–15 కిలోల సుగంధ నూనె ఉత్పత్తి భూమి లోపలికి లోతుగా విస్తరించే వేర్లను గనక జాగ్రత్తగా తీసి, అందులో నుంచి నూనెను సంగ్రహిస్తే ఎకరానికి 12–15 కిలోల సుగంధ నూనె లభిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో కిలో నూనె ధర రూ. 20,000–35,000 వరకు ఉంటుంది. ప్రతీ కోతకు ఎకరానికి 3–5 టన్నుల లేత పశుగ్రాసం లభిస్తుంది. ఎండిన గడ్డితో మహిళా సంఘాలు నెలకు రూ. 5,000 నుండి రూ. 8,000 వరకు అదనపు ఆదాయం పొందుతున్నారు. తక్కువ ఖర్చుతో 90% వరకు వర్షాధార భూముల్లో మట్టి కొట్టుకుపోకుండా నివారించి, వాణిజ్యపరంగా అదనపు ఆదాయాన్ని అందించే దిశగా వెటివర్ ఫౌండేషన్ రైతులకు మార్గదర్శకత్వం వహిస్తోంది. వర్షాధారిత ప్రాంతాల రైతులకు ఇది అత్యంత లాభదాయకమైన మార్గం. తెలుగు రాష్ట్రాల్లో వర్షాధార వ్యవసాయంలో వట్టివేరు పంటను విస్తృతంగా ్రపోత్సహించేందుకు నిర్మాణాత్మక కృషి చేస్తే అన్ని విధాలా మేలు జరుగుతుంది.వట్టివేరుపై సమగ్ర శిక్షణ ఇస్తాంఅనేక ఔషధ, సుగంధ పంటలతో పాటు వట్టివేరు పంట సాగు పద్ధతులు, అనువైన నేలలు, ప్రాసెసింగ్ పద్ధతులు, వాణిజ్య అవకాశాలు తదితర అంశాలపై రైతులకు హైదరాబాద్ బోడుప్పల్‌లోని మా కార్యాలయంలో అప్పుడప్పుడూ శాస్త్రీయంగా సమగ్ర శిక్షణ ఇస్తున్నాం. నాణ్యమైన వట్టివేరు పిలకలను కూడా రైతులకు అందుబాటులోకి తెస్తున్నాం. ఆసక్తి గల రైతులు మమ్మల్ని సంప్రదించవచ్చు. – డాక్టర్ జీడీ కిరణ్ బాబు, సైంటిస్ట్ ఇన్చార్జ్, కేంద్రీయ ఔషధ, సుగంధ మొక్కల పరిశోధనా సంస్థ (సీఎస్ఐఆర్ – సీమాప్), బోడుప్పల్, హైదరాబాద్ +914027201131, 27200272,Email: crchyd@cimap.res.in రైతులకు ఉచిత ప్రాక్టికల్ శిక్షణవట్టివేరు వేర్లు నేల కోతను 90% వరకు తగ్గిస్తాయి. వాన నీరు 60% వరకు భూమిలోకి ఇంకుతుంది. రైతుల్లో అవగాహన పెంచేందుకు వెటివర్ ఫౌండేషన్ వేలాది మంది రైతులకు క్షేత్రస్థాయిలో ఉచిత ప్రాక్టికల్ శిక్షణ ఇస్తోంది. ఒక ఎకరం పొలంలో గట్ల వెంట నాటేందుకు సుమారు 2,000 – 3,000 వ్యాధి రహిత పిలకలు అవసరమవుతాయి. నాణ్యమైన వట్టివేరు పిలకలను కూడా ఫౌండేషన్ రైతులకు పంపిణీ చేస్తోంది. -
కచ్చితత్వం దిశగా...
పక్షుల, పాముల, జంతువుల ప్రవర్తనను చూసీ...ఆకాశం తీరుతెన్నులు గమనించీ, గాలివాటు, దాని వేగం గ్రహించీ వాతావరణాన్ని అంచనా కట్టే గతకాలపు రోజుల నుంచి ఇవాళ ఏం జరుగుతుందో, వచ్చే నాలుగైదు రోజుల్లో ఎలాంటి వాతావరణం ఉండబోతున్నదో, రాగల సంవత్సరమంతా ఎలాంటి స్థితిగతులుంటాయో స్పష్టంగా వివరించే సమాచారం అందరికీ అందుబాటులో కొచ్చింది. గత నూట యాభయ్యేళ్లుగా అవిచ్ఛిన్నంగా ఈ పనిలోనే నిమగ్నమై కోట్లాది పౌరులకు చేదోడువాదోడుగా నిలిచిన భారతీయ వాతావరణ విభాగం(ఐఎండీ) తన వార్షికోత్సవాన్ని మంగళ వారం ప్రధాని మోదీ సమక్షంలో ఘనంగా నిర్వహించుకుంది. ఒక దేశ విజ్ఞాన శాస్త్ర అవగాహన ఆ దేశంలోని వైజ్ఞానిక సంస్థల ప్రగతిలో ప్రతిఫలిస్తుందని ఈ సందర్భంగా మోదీ చెప్పిన మాట అక్షరసత్యం. ఈ నూటయాభయ్యేళ్లలో ఐఎండీ సాధించిన ప్రగతి ఇందుకు సాక్ష్యం. ‘వాన రాకడ... ప్రాణం పోకడ’ ఎవరికీ తెలియదనే నానుడి నుంచి మనం చాలా దూరం వచ్చాం. ఇక పోవటం ఖాయమనుకున్న ప్రాణాన్ని నిలబెట్టడానికీ, పునర్జన్మ ఇవ్వడానికీ అధునాతన వైద్య సదుపాయాలు విస్తృతంగా అందుబాటులోకొచ్చాయి. అలాగే వాన ఎక్కడ కురుస్తుందో, దాని తీవ్రత ఏపాటో అంచనా వేయగలుగుతున్నాం. తుపాను ఏర్పడే అవకాశాలు, దాని గమ్యం, గమనం, అది మోసుకు రాగల విపత్తు గురించీ హెచ్చరించటంతో పాటు కరవుకాటకాల ప్రమాదాన్ని తెలియజెప్పటం ఆ రంగంలో సాధించిన ప్రగతికి తార్కాణం. మూడు రోజుల వరకూ వాతావరణం ఎలా ఉండబోతు న్నదో చెప్పే స్వల్పకాలిక అంచనాలు, పదిరోజుల వరకూ వాతావరణ పోకడల్ని వివరించగల మధ్య శ్రేణి అంచనాలు, నెల పాటు ఏ వారమెలా వుంటుందో తెలియజేయగల సామర్థ్యం ఇప్పుడు మన సొంతం. ఇంకా స్థానిక వాతావరణాలను అంచనా వేయగలిగే దిశగా ఐంఎండీ ముందుకెళ్తోంది.పేరులో తప్ప జనాభా రీత్యా, సంపద రీత్యా, లేదా విస్తీర్ణం రీత్యా ఏ రకంగానూ ‘గ్రేట్’ అనే పదానికి అర్హత లేని బ్రిటన్ నుంచి వచ్చిన వలస పాలకులు ఈ దేశంలోని వాతావరణ తీరుతెన్నులు చూసి అయోమయంలో పడ్డారు. వీటిని సక్రమంగా అంచనా వేసే సాధనాలు లేకపోతే సరిగా పాలించటం అసాధ్యమన్న నిర్ణయానికొచ్చిన ఫలితంగానే 1875లో సర్ చార్లెస్ చాంబర్లేన్ నేతృత్వంలో ఐఎండీని నెలకొల్పారు. అంతవరకూ రైతులు సంప్రదాయంగా అనుసరిస్తూ వచ్చిన విధానాలన్నీ క్రమేపీ కనుమరుగై వాతావరణ అధ్యయనం కొత్త పుంతలు తొక్కటం ప్రారంభించింది. కేవలం బ్రిటన్ వాతావరణాన్ని పోలి వుంటుందన్న ఏకైక కారణంతో తమ వెసులుబాటు కోసం సిమ్లాలోని పర్వత ప్రాంతంలో మొదలెట్టిన ఐఎండీ వల్ల పెద్దగా ప్రయోజనం ఉండటం లేదని గ్రహించాక 1928లో పుణేకు తరలిరావటం, ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఢిల్లీకి వెళ్లటం తప్పనిసరైంది. ఐఎండీ డైరెక్టర్ జనరల్‌గా వచ్చిన గిల్బర్ట్ వాకర్ 1904–1924 మధ్య రెండు దశాబ్దాల సమయంలో భారత వాతావరణంలో చోటుచేసుకున్న అసాధారణతలపై అధ్యయనం చేయటంతో అనేక అంశాలు బయటపడ్డాయి. ముఖ్యంగా ఉష్ణమండల ప్రాంత పసిఫిక్ మహా సముద్ర జలాలపై ఉండే వాయుపీడనంలో వచ్చే హెచ్చుతగ్గులే ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ స్థితిగతులను ప్రభావితం చేస్తున్నాయని ఆ అధ్యయనం తేల్చాక వాతావరణాన్ని అర్థంచేసుకునే తీరే మారిపోయింది. పసిఫిక్ జలాలపై ఉండాల్సిన సాధారణ ఉష్ణోగ్రతలో మైనస్ 17 డిగ్రీల సెల్సియస్ మేరకు హెచ్చితే లాæనినో... ఆ ఉష్ణోగ్రత మైనస్ 17 డిగ్రీల కన్నా తగ్గితే లానినా ఏర్పడు తుందని తేలింది అప్పుడే. ఇదంతా అర్థమయ్యాక రాగల కాలంలో వాతావరణమెలా వుండనున్నదో అంచనా వేయటం సులభమైంది. వాతావరణంలో విడిచిపెట్టే బెలూన్లు గాలిలో తేమనూ, ఉష్ణోగ్రతనూ ఇట్టే చెప్పగలుగుతుండగా ఉపగ్రహాలు నేల పరిస్థితుల గురించి సమాచారం ఇస్తున్నాయి.స్వాతంత్య్రానంతరం వాతావరణాన్ని కొలవటానికి రాడార్ల వంటి ఉపకరణాలు అందుబాటు లోకొచ్చాయి. 1971లో తొలి తుపాను హెచ్చరిక కేంద్రం ఏర్పాటైతే, 1990ల్లో ఇస్రో ఉపగ్రహాలు పంపే డేటాతో వాతావరణ అంచనాల కచ్చితత్వం పెరిగింది. సెకనుకు కొన్ని లక్షల గణనలను చేయగలిగిన అధునాతన సూపర్ కంప్యూటర్ వినియోగం మొదలయ్యాక రుతుపవనాలు, తుపానుల గురించి మాత్రమే కాదు... వడగాల్పులు, వరదల వంటి వైపరీత్యాల గురించి కూడా చెప్పగలుగుతున్నారు. మన దేశంలో సాగుకు యోగ్యమైన భూమిలో 60 శాతం కేవలం వర్షాధారం కావటం, జనాభాలో మూడింట రెండొంతుల మందికి జీవనాధారం వ్యవసాయమే కావటం వల్ల ఐఎండీ చెప్పే అంచనాలు ఎంతో అవసరం. అందుకే వర్షాలు సరిగ్గా ఎక్కడ పడతాయో, ఏ ప్రాంతంలో వడగాడ్పులు వీచవచ్చో, ఎక్కడ పిడుగులు పడే అవకాశం ఉన్నదో కూడా పదేళ్లుగా చెప్పగలుగుతోంది. కృత్రిమ మేధ దీన్ని మరింత పదునెక్కించింది.ఐఎండీ అంచనాల వల్ల ప్రభుత్వాలు అప్రమత్తమై లక్షలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించటం, వేలాది ప్రాణాలను కాపాడుకోవటం సాధ్యమవుతోంది. ఇది మున్ముందు ఇంకా విస్తరించి కనీసం అయిదురోజుల ముందు 90 శాతం కచ్చితత్వంతో చెప్పగలిగే విధానాలను అభివృద్ధి చేసుకోవాలనీ, ఆఖరికి భూకంపాల రాకడను సైతం పసిగట్టగలగాలనీ ఐఎండీ 2047 విజన్ డాక్యుమెంటు విడుదల సందర్భంగా మోదీ చేసిన సూచన శిరోధార్యం. ఈ అంచనాలు మన దేశానికి మాత్రమే కాదు...ఆసియా ప్రాంత దేశాలకు సైతం ఎంతో మేలుచేస్తాయి. పంటల దిగుబడిపై, ఆర్థికవ్యవస్థ తీరుతెన్నులపై మరింత మెరుగైన అంచనాలకు తోడ్పడతాయి. -
తక్కువ ఖర్చుతో...పంటభూమిలో విషానికి బ్యాక్టీరియాతో చెక్
రసాయనిక వ్యవసాయం వల్ల కాలుష్య కాసారంగా మారిపోయిన వ్యవసాయ భూములను తక్కువ ఖర్చుతో, సులభంగా, సమర్థవంతంగా శుద్ధి చేసే కొన్ని జాతుల సూక్ష్మజీవుల మిశ్రమాన్ని ముంబై ఐఐటి పరిశోధకులు కనుగొన్నారు. రసాయనిక పురుగుమందుల వల్ల, ఇతరత్రా కాలుష్య కారకాల వల్ల పంట భూములు నాశనమవుతున్న సంగతి తెలిసిందే.విషతుల్య కాలుష్య కారకాలను హరించటంతో పాటు నేలలో ఉన్నప్పటికీ మొక్కలకు అందుబాటులో లేని పోషకాలను అందుబాటులోకి తేవటం ద్వారా పనిలో పనిగా పంట దిగుబడిని కూడా పెంపొందించడానికి ఈ ‘బ్యాక్టీరియా కాక్టెయిల్’ ఉపయోగపడుతున్నదని ముంబై ఐఐటి పరిశోధకులు ప్రకటించారు. ముంబై ఐఐటిలో బయోసైన్సెస్, బయోఇంజినీరింగ్ విభాగం అధిపతి ప్రొఫెసర్ ప్రశాంత్ ఫలే మార్గ దర్శకత్వంలో సందేశ్ పపడే ఈ పరిశోధన చేశారు. మట్టిలోని విషాలను విచ్చిన్నం చేసి తీసివేయటంతో పాటు ఈ బ్యాక్టీరియా అధికోత్పత్తికి దోహదం చేసే గ్రోత్ హార్మోన్ల పెరుగుదలకు ఊతం ఇస్తున్నాయని, అదేసమయంలో హానికారక శిలీంధ్రాలను అరికడుతున్నాయని, తద్వారా పోషకాల లభ్యత పెరుగుతోందని గుర్తించారు. రసాయనిక పురుగుమందులు, తెగుళ్ల మందుల వాడకాన్ని తగ్గించటానికి.. నేలల ఆరోగ్యం, ఉత్పాదకశక్తిని పెంపొందించడానికి ఉపయోడపడుతోందని ప్రొఫెసర్ ప్రశాంత్ ఫలే వెల్లడించారు. రసాయనిక పురుగుమందులు, తెగుళ్ల మందులలోని బెంజీన్ వంటి ఆరోమాటిక్ కాంపౌండ్స్ వల్ల నేలలు కలుషితం కావటం వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. ఈ సమ్మేళనాలు విషతుల్యమైనవి. విత్తనం మొలక శాతాన్ని ఇవి తగ్గిస్తాయి. పంట మొక్కల ఎదుగుదలకు, దిగుబడికి ప్రతిబంధకంగా మారుతున్నాయి. ధాన్యాలు, గింజల్లో, మొక్క భాగాల్లో ఈ విషతుల్యమైన సమ్మేళనాలు చేరి΄ోతాయి. కార్బారిల్, నాఫ్తలిన్, బెంజోయేట్, 2,4–డ్రైక్లోరోఫెనాక్సియేసెటిక్ ఆసిడ్, థాలేట్స్‌ను పురుగుమందుల్లో విస్తృతంగా వాడుతున్నారు. సౌందర్యసాధనాలు, దుస్తులు, నిర్మాణ రంగం, ఆహార రంగంలో వాడే ప్రిజర్వేటివ్స్, అద్దకం, పెట్రోలియం, ప్లాస్టిక్ ఉత్పత్తి రంగాల్లో కూడా ఈ విషతుల్యమైన సమ్మేళనాలను వాడుతున్నారు. వీటి వల్ల మట్టి, నీరు, గాలి కలుషితం అవుతున్నాయి. అయితే, ఈ కలుషితాలను తొలగించడానికి ప్రస్తుతం అనుసరిస్తున్న రసాయనిక పద్ధతి లేదా కలుషితమైన మట్టిని తొలగించటం వంటి పద్ధతులు అధిక ఖర్చుతో కూడినవే కాక సమస్యను సమూలంగా పరిష్కరించకుండా తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే కలిగిస్తున్నాయి. ఈ దృష్ట్యా సమస్యాత్మక నేలలను శుద్ధి చేసుకోవటానికి ఐఐటి ముంబై పరిశోధకుల కృషి తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.సహజ పద్ధతిలో శుద్ధిఘాటైన వాసనలతో కూడిన రసాయనిక విషపదార్థాలను చక్కగా విచ్ఛిన్నం చేయటానికి సూడోమోనాస్, అసినెటోబాక్టర్ తదితర జాతుల బ్యాక్టీరియా ఉపయోగపడుతున్నట్లు గుర్తించారు. ఇవి విషతుల్య సమ్మేళనాలను తిని.. హానికరం కాని, విషరహిత సమ్మేళనాలుగా మార్చుతున్నాయి. ఆ క్రమంలో కలుషిత∙పర్యావరణాన్ని ఇవి సహజంగా శుద్ధి చేస్తున్నాయని ఫలే వ్యాఖ్యానించారు.పెరిగిన పోషకాల లభ్యత ఫాస్ఫరస్, పొటాషియం వంటి నీట కరగని స్థూల పోషకాలను ఈ బ్యాక్టీరియా నీట కరిగేలా చేస్తుంది. తద్వారా పంట మొక్కల వేర్లు అదనపు పోషకాలను పీల్చుకునే అవకాశం కల్పిస్తాయి. నిస్సారమైన భూముల్లో పెరిగే పంట ఐరన్‌ను ఎక్కువగా తీసుకోలేకపోతుంటుంది. ఈ సూక్ష్మజీవులు సైడెరోఫోర్స్ అనే పదార్ధాన్ని విడుదల చేయటం ద్వారా ఐరన్‌ను సరిగ్గా తీసుకునేలా చేస్తాయి. అంతేకాకుండా ఇండోల్ అసెటిక్ ఆసిడ్ (ఐఎఎ) అనే గ్రోత్ హార్మోన్‌ను ఈ బ్యాక్టీరియా విడుదల చేసి దిగుబడిని పెంచుతుంది. ఇంకా ప్రొఫెసర్ ఫలే ఇలా అన్నారు.. ‘సూడోమోనాస్, అసెనెటోబాక్టర్ జెనెరకు చెందిన అనేక జాతుల సూక్ష్మజీవుల మిశ్రమాన్ని వాడిన తర్వాత గోధుమ, పెసర పాలకూర, మెంతికూర తదితర పంటల దిగుబడి 40–45% వరకు పెరిగింది. మట్టిలో రసాయనాలను కొన్ని రకాల బ్యాక్టీరియా విచ్ఛిన్నం చేస్తుంటే, మరికొన్ని సూక్ష్మజీవులు మొక్కల పెరుగుదలను పెంపొందించే హార్మోన్ ఉత్పత్తికి, చీడపీడల బెడద నుంచి దీటుగా తట్టుకునేందుకు ఉపయోగపడుతున్నాయని, కలసికట్టుగా పనిచేస్తే కలిగే ప్రయోజనం ఇదే అన్నారు ప్రొ. ఫలే. -
ఇద్దరు అన్నదాతల ఆత్మహత్య
మిరుదొడ్డి (దుబ్బాక)/ రామగిరి (మంథని): ఏడు బోర్లు వేసినా నీరందక పంట ఎండిపోవడంతో మనోవేదనతో ఓ రైతు, ఆరుగాలం కష్టపడ్డా నీటి కొరతతో పత్తి పంటకు దిగుబడి రాలేదన్న బాధతో మరో రైతు పురుగుల మందు తాగి తనువు చాలించారు. సిద్దిపేట, పెద్దపల్లి జిల్లాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. వివరాలు.. తొగుట మండల కేంద్రానికి చెందిన చిక్కుడు శ్రీనివాస్‌కు (48) వ్యవసాయమే జీవనాధారం. భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడిని పోషించుకుంటూ బతుకు వెళ్లదీస్తున్నాడు. మిరుదొడ్డి మండల పరిధిలోని కాసులా బాద్ శివారులో నాలుగు ఎకరాల భూమిని కొనుగో లు చేసి వరి పంట వేశారు. భూగర్భ జలాలు వట్టిపోవడం.. మండుతున్న ఎండలతో రెండు ఎకరాలు పంట పూర్తిగా ఎండిపోయింది. దీంతో సుమారు రూ.6 లక్షల వరకు అప్పు చేసి 7 బోరు బావులు తవ్వంచాడు. అందులో ఒకటి రెండు బోరు బావుల నుంచి సన్నటి నీటి ధార మాత్రం వస్తోంది. పొట్ట దశకు వచ్చిన రెండు ఎకరాలకు సాగు నీరు అందక ఎండు ముఖం పట్టింది. దీంతో మనోవేదనకు గురైన శ్రీనివాస్ శనివారం సాయంత్రం పొలం వద్దే పురుగు మందు తాగాడు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మరోఘటనలో పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లద్నాపూర్ గ్రామానికి చెందిన ఉడుత సంతోష్ యాదవ్ (34) రెండేళ్లక్రితం ఇల్లు నిర్మించుకున్నాడు. ఇందుకోసం కొంత అప్పు తీసుకొచ్చాడు. తనకున్న 8 ఎకరాల్లో పత్తి వేశాడు. ఇందుకోసం బ్యాంకులో మరికొంత లోన్ తీసుకున్నాడు. అప్పు రూ.35 లక్షల వరకు చేరింది. పత్తి పంట అధిక దిగుబడి వస్తే మొత్తం అప్పు తీర్చవచ్చని భావించాడు. కానీ, తెగుళ్లు, నీటి కొరతతో ఆశించిన దిగుబడి రాలేదు. దీంతో మనస్తాపం చెందిన సంతోష్ ఈనెల 3న గడ్డి మందు తాగాడు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మరణించాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
ఇద్దరు రైతుల ఆత్మహత్య
వేలేరు/తలమడుగు: రాష్ట్రంలో ఇద్దరు అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారు. నీరు తడి లేక పంట ఎడిపోయి ఒకరు.. పంట దిగుబడి సరిగా రాక అప్పుల్లో కూరుకుపోయి తీర్చే దారిలేక మరొక రైతు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. హనుమకొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో రెండ్రోజుల వ్యవధిలో జరిగిన ఈ రైతుల ఆత్మహత్య లకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా వేలేరు మండలం పీచర గ్రామానికి చెందిన పిట్టల సుధాకర్(43)కు మూడెకరాల వ్యవ సాయ భూమి ఉంది. కొంతభాగం మొక్కజొన్న సాగుచేశాడు. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోవడంతో అప్పులు చేసి బావిలో సైడ్ బోర్లు వేయించాడు. అయినా నీరు పడకపోవడంతో పంట చేతికందే సమయంలో ఎండిపోయింది. బోర్లు వేసేందుకు, పంట పెట్టుబడికి, రెండేళ్ల క్రితం కూతురు పెళ్లికి తెచ్చిన అప్పు మిత్తి కలిపి రూ.12లక్షల వరకు ఉంది. ఇటు పంట ఎండిపోవడం, అటు అప్పు తీర్చే మార్గం లేక తీవ్ర మనస్తాపం చెందాడు. సోమవారం మధ్యాహ్నం చేలోకి వెళ్లిన సుధాకర్ ఎండిన పంటలను చూసి తీవ్ర మనోవేదనతో పురుగుల మందుతాగాడు. చుట్టు పక్కల రైతులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వెంటనే వారు అక్కడకు వెళ్లి చూడగా.. అప్పటికే సుధాకర్ మృతి చెందాడు. మంగళవారం మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. పొలానికి వెళ్లొస్తానని చెప్పి... ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం బరంపూర్ గ్రామానికి చెందిన కాకర్ల ఆశన్న (43)కు రెండెకరాల 19 గుంటలతో పాటు తన భార్య సుచరిత పేరిట మూడెకరాల 30 గుంటల పొలం ఉంది. మొత్తం ఆరెకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు. ఈ సీజన్లో అందులో పత్తి, కంది పంటలు సాగు చేశాడు. పత్తి పెట్టుబడి కోసం ఆదిలాబాద్‌లోని ఎస్బీఐలో భార్యాభర్తల ఇద్దరు పేరుమీద రూ.4లక్షలు, ప్రైవేట్ వ్యక్తుల నుంచి మరో రూ.4లక్షలు అప్పు తీసుకున్నాడు. ఈ దంపతులిద్దరికీ ఇద్దరు సంతానం. కుమార్తె డిగ్రీ, కుమారుడు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. ఇటీవలే కుమార్తెకు పెళ్లి సంబంధాలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో పంట దిగుబడి సరిగా రాక, తెచ్చిన అప్పు తీర్చే దారిలేక మనస్తాపం చెందిన ఆశన్న మంగళవారం ఉదయం పొలానికి వెళ్లొస్తానని చెప్పి ఇంటినుంచి బయల్దేరాడు. అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా...వారు అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే ఆశన్న మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
అధిక ఎరువులు వాడితే అనర్థమే
నవాబుపేట: రసాయన ఎరువులు అధికంగా వాడితే అనర్థమే అని వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా దిగుబడి తగ్గి, పెట్టుబడులు పెరుగుతాయని అంటున్నారు. సాధారణంగా నేల స్వభావం, భూసారాన్ని బట్టి ఎరువులు వాడాలి. కానీ రైతులంతా ఒకే రకమైన ఎరువులను వినియోగిస్తున్నారు. వరి సాగులో ఎకరాకు 50కేజీల డీఏపీ, 100 కేజీల యూరియా వాడాలి. కానీ రైతులు ఎకరాకు రెండు బస్తాలకు తగ్గకుండా డీఏపీ వేస్తున్నారు. పైరు నాటే సమయంలో బస్తాకు అదనంగా 25 కేజీల పొటాష్‌ను కలిపి వేయాల్సి ఉన్నా రైతులు వేయడం లేదు. వరికి యూరియాను నాలుగు సార్లు వాడాలి. వాడిన ప్రతి సారి 30 కేజీల చొప్పున వాడాలి. పొట్టదశలో యూరియాకు 25 కేజీల పొటాష్‌ను కలిపి వాడాలి. అయితే రైతులు చాలా వరకు నాటిన 20 రోజులకు 50 కేజీలు, మధ్యలో 50 కేజీలు వాడుతున్నారు. ఇక పత్తి పంట విషయానికి వస్తే విత్తేకంటే ముందే ఎకరాకు మూడు నాలుగు అంగుళాల లోతున పడేలా 50 కేజీల డీఏపీ వాడాలి. అయితే వర్షాధారంగా సాగు చేసే పంటల్లో విత్తనాలు మొలుస్తాయో లేదోనని పత్తి విత్తేటప్పుడు ఎరువులు వేయడం లేదు. కనీసం 25సెం.మీ. లోతులో భూమిలో పదును ఉండేలా వర్షం పడినప్పుడు ఎరువుతో పాటు పత్తి గింజలు వేస్తే మంచి ఫలితం ఉంటుంది. పత్తితో పాటు అన్ని ఖరీఫ్ పంటలకు 50 కేజీల వరకు మాత్రమే డీఏపీ వాడాలి. అయితే రైతులు పైరు ఎదుగుదల దశలో రెండు మూడు బస్తాలు వరకు డీఏపీని పై పాటుగా చల్లుతున్నారు. దీని వల్ల అంతగా ప్రయోజనం ఉండదు. పోషకాలు ఉన్న కాంప్లెక్స్ ఎరువులు రెండు బస్తాలు వాడితే సరిపోతుంది. అధిక భాస్వరంతో నష్టం అధిక మోతాదులో భాస్వరం వాడడం వల్ల దిగుబడులపై క్రమంగా తీవ్ర ప్రభావం చూపుతుంది. తొలి రెండేళ్ల పాటు దిగుబడులు బాగా వచ్చినా ఆ తర్వాత ఎరువులు వాడినా దిగుబడులు రానంతగా నేల దెబ్బతింటుంది. భాస్వరం భూమి లోపలి పొరల్లో నిల్వ ఉండి నేల గట్టిగా మారి పంటలకు నష్టం కలిగిస్తుంది. సమతూల్యత ఏది? ప్రతి మొక్కకూ నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా అవసరం. రైతులు అవగాహన లోపంతో కొన్ని రకాల కాంప్లెక్స్ ఎరువుల్లో ఉండని పోషకాలను అదనంగా చేర్చి వాడాల్సిన విషయం రైతులకు తెలియదు. ఉదాహరణకు 28 – 28 – 0, డీఏపీలోను పొటాష్ ఉండదు. ఈ ఎరువులు వినియోగించినప్పుడు పైరు ఎదుగుదల దశలో పైపాటుగా యూరియాను వాడాలి. దుక్కిలో కాంప్లెక్స్ ఎరువులు వాడాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నా పైపాటుగా కూడా వాడుతుండడంతో ఎరువుల్లో పోషకాలు సరిగ్గా మొక్కకు చేరక వృథా అవుతున్నాయి. సూక్ష్మ పోషకాల అవసరాన్ని రైతులు గుర్తించకపోవడంతో పంటల్లో దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయి. సేంద్రియ ఎరువులు తప్పని సరి రైతులు రసాయన, సేంద్రియ ఎరువులు సగం మోతాదులో వాడాల్సి ఉంది. కేవలం రసాయన ఎరువులే వాడటం వల్ల భూ సారం తగ్గిపోయి నిస్సారంగా మారుతుంది. మొదట్లో బాగానే దిగుబడులు వచ్చినా క్రమంగా భూ సారం తగ్గి దిగుబడులు రావు. సేంద్రియ ఎరువులు వాడడం వల్ల బరువు నేలలు గుళ్ల బారి వేర్లు చక్కగా పెరగటానికి సహాయపడుతుంది. అవగాహన కల్పిస్తున్నాం ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. మోతాదుకు మించి ఎరువులు వాడడం వల్ల కలిగే నష్టాన్ని తెలియజేస్తున్నాం. ఏ పంటకు ఏ సమయంలో ఎంత ఎరువు వాడాలి అనేది తెలిస్తే పంట దిగుబడిలో ప్రయోజనం కనిపిస్తుంది. ఆ దిశగా రైతులకు సూచనలు ఇస్తున్నాం. అంతేకాకుండా భూసార పరీక్షలపై అవగాహన కల్పిస్తున్నాం. – ప్రసన్నలక్ష్మి, ఏఓ -
దిగుబడి తగ్గినా.. విత్తన కంపెనీదే బాధ్యత
సాక్షి, హైదరాబాద్ : పంట దిగుబడి తక్కువైనా విత్తన కంపెనీలే బాధ్యత వహించడంతోపాటు రైతులకు నష్ట పరిహారం చెల్లించేలా చూడాలని కేంద్రానికి రాష్ట్ర వ్యవసాయశాఖ కీలక ప్రతిపాదన చేసింది. కేంద్ర విత్తన ముసాయిదా బిల్లు–2019పై ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది. ప్రైవేటు కంపెనీలు విత్తనాల సామర్థ్యంపై చేస్తున్న అధిక ప్రచారం వల్ల రైతులు వాటిని కొనుగోలు చేసి పంటలపై ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నారని సర్కారు పేర్కొంది. తీరా పంట దిగుబడి తక్కువయ్యే సరికి అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారని వ్యవసాయశాఖ ఆ సమావేశంలో ప్రస్తావించింది. అందువల్ల నిర్ధారించిన మేరకు పంట దిగుబడి రాకపోతే కంపెనీలు రైతులకు నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్రం కోరింది. దీనివల్ల కంపెనీల ఇష్టారాజ్య ప్రచారానికి అడ్డుకట్ట వేయొచ్చనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. మరోవైపు విత్తనం ద్వారా పంట నష్టం జరిగితే పరిహారాన్ని వినియోగదారుల రక్షణ చట్టం–1986 ప్రకారం ఆయా కోర్టుల్లో నిర్ధారించాలని ముసాయిదా బిల్లులో పేర్కొన్నారని, దీనివల్ల పరిహారం ఆలస్యమవుతుందని రాష్ట్ర వ్యవసాయశాఖ అభిప్రాయపడింది. దానికి బదులుగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉండే వ్యవసాయ నిపుణుల కమిటీలు నష్ట పరిహారాన్ని నిర్ధారించాలని కేంద్రానికి ప్రతిపాదించింది. నకిలీ విత్తన దందా అడ్డుకట్టకు అనుమతి అక్కర్లేదు... నకిలీ విత్తనాలు విక్రయించే ముఠాలపై దాడులు చేయడం, ఆయా విత్తనాలను స్వాధీనం చేసుకోవడానికి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలని కేంద్ర విత్తన ముసాయిదాలో ప్రస్తావించడాన్ని రాష్ట్ర వ్యవసాయశాఖ తప్పుబట్టింది. మండల వ్యవసాయాధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అనుమతిని అప్పటికప్పుడు తీసుకోవడం కష్టమని, దీనివల్ల నకిలీ విత్తన విక్రయదారులు తప్పించుకునే ప్రమాదముందని అభిప్రాయపడింది. అందువల్ల ప్రత్యేకంగా అనుమతి అవసరంలేదని సూచించింది. ముసాయిదాపై జరిగిన సమావేశంలో పాల్గొన్న పలు బడా కంపెనీలు కంపెనీకి, ప్రతి విత్తన వెరైటీకి ప్రతి రాష్ట్రంలోనూ రిజిస్ట్రేషన్ చేయాలన్న నిబంధనను ఎత్తేయాలని కోరగా రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రతిపాదనను అంగీకరించొద్దని స్పష్టంచేసింది. దేశవ్యాప్తంగా అన్ని వెరైటీ విత్తనాలు అన్ని రాష్ట్రాల వాతావరణానికి తగ్గట్లుగా ఉండవని, అన్నిచోట్లా పండవని, కాబట్టి ప్రతి రాష్ట్రంలోనూ తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సిందేనని కేంద్రాన్ని కోరింది. ధరల నియంత్రణపై అస్పష్టత విత్తన ధరల నియంత్రణపై ముసాయిదా బిల్లులో అస్పష్టత నెలకొంది. అవసరమైతే విత్తన ధరలను నియంత్రిస్తామని మాత్రమే ముసాయిదాలో ఉంది. దీనివల్ల ధరల నియంత్రణ సక్రమంగా జరిగే అవకాశం ఉండదు. విత్తన ధరలపై స్పష్టమైన నియంత్రణ లేకపోతే కంపెనీలు ఇష్టారాజ్యంగా ధరలను పెంచే అవకాశముంది. దీనిపై ముసాయిదాలో మార్పులు చేయాలని కోరుతాం. – డి.నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయ నిపుణుడు ఇకపై అన్ని విత్తనాల రిజిస్ట్రేషన్ తప్పనిసరి... ఇకపై అన్ని రకాల విత్తనాలు, వెరైటీలకు రిజిస్ట్రేషన్ తప్పనసరి చేయడాన్ని ముసాయిదా బిల్లులో ప్రస్తావించడం మంచి పరిణామమని రాష్ట్ర వ్యవసాయశాఖ అభిప్రాయపడింది. ప్రస్తుతం ప్రైవేటు హైబ్రిడ్ విత్తనాల రిజిస్ట్రేషన్ జరగట్లేదని, కొత్త నిబంధన వల్ల ఇది తప్పనసరి అవుతుందని పేర్కొంది. ఖరీఫ్‌లో అన్ని పంటల కంటే పత్తి, మొక్కజొన్నను తెలంగాణలో ఎక్కువగా సాగు చేస్తారని, అవన్నీ ప్రైవేటు హైబ్రిడ్ విత్తనాలేనని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. కాబట్టి ఆయా ప్రైవేటు విత్తనాల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేయడం వల్ల కంపెనీలకు బాధ్యత ఏర్పడుతుందని అంటున్నారు. మామిడి, మిరప, టమాట తదితర అన్ని రకాల నర్సరీలు కూడా రిజిస్ట్రేషన్ చేయాల్సిందేనని ముసాయిదాలో పేర్కొన్నారని వ్యవసాయశాఖ తెలిపింది. -
ఈ సారి భారీ దిగుబడి
ఉమ్మడి జిల్లాలో ఖరీఫ్ ధాన్యం మార్కెట్‌ను ముంచెత్తే అవకాశాలున్నాయి. ఈసారి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర పెట్టి ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేయడం కష్టమేనని అంటున్నారు. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలనే ఎక్కువగా ఆశ్రయించే అవకాశాలున్నాయి. కాస్త ముందుగానే ధాన్యం రాక ప్రారంభమవుతుందని అధికారులు భావిస్తున్నారు. కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించిన మంత్రి పోచారం వచ్చేనెల 1 నుంచే కొనుగోళ్లు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు 48 గంటల్లో డబ్బులు చెల్లించాలన్నారు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : నిజామా బాద్, కామారెడ్డి జిల్లాల్లో ఈసారి ఖరీఫ్ లో రికార్డు స్థాయిలో ధాన్యం మార్కెట్లో కి వస్తుందని అధికార యంత్రాంగం అం చనా వేసింది. సుమారు ఆరున్నర లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు కే్రందాలకు రావచ్చంటున్నారు. గతే డాది కంటే రెం డున్నర రేట్లు అధికంగా ధాన్యం మార్కెట్‌ను ముంచెత్తే అవకాశాలున్నాయి. ప్రైవేటు కొనుగోళ్లు తక్కువే.. ఈసారి కనీస మద్దతు ధర పెరగడంతో రైతులు ప్రైవేటులో విక్రయించే బదులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే ఎక్కువ గా ధాన్యం తీసుకువస్తారని భావిస్తు న్నా రు. గ్రేడ్–ఎ రకం ధాన్యానికి కనీస మద్ద తు ధర గత ఏడాది కంటే క్వింటాలుపై సుమారు రూ.180 పెరిగింది. కామన్ రకానికి కూడా క్వింటాలుకు రూ.200 పెం చారు. ఈసారి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రూ.1,770 పెట్టి ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేయడం కష్టమేనని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలనే ఎక్కువగా ఆశ్రయించే అవకాశాలున్నాయి. ఎన్నికల ఏడాది కావడంతో.. ఎన్నికల ఏడాది కావడం.. పైగా రైతులకు సంబంధించిన అంశం కావడంతో అధికా ర యంత్రాంగం ఈసారి కొనుగోలు ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించింది. ఏ మాత్రం తేడా వచ్చినా ప్రతిపక్ష పార్టీలు దీన్ని తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలుండటంతో ప్రభుత్వం ముంద స్తు ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 465 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయా లని నిర్ణయించారు. రైతుల నుంచి పెద్ద ఎ త్తున డిమాండ్ వస్తుండటంతో ఈ కేం ద్రాల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. ముందస్తుగా ధాన్యం.. ఏటా నవంబర్ మాసంలో ధాన్యం కొనుగోళ్లు ఊపందుకుంటాయి. అయితే ఈసా రి కాస్త ముందస్తుగానే ధాన్యం రాక ప్రారంభమవుతుందని అధికారులు భావిస్తున్నారు. బోధన్, వర్ని తదితర ప్రాంతాల్లో రైతులు ముందుగా వరినాట్లు వేసుకున్నారు. దీంతో ఇక్కడ ముందుగానే వరి కోతకొచ్చే అవకాశాలున్నాయి. అక్టోబర్ రెండో వారం నుంచే ధాన్యం మార్కెట్లోకి రానుందని, ఈ మేరకు కొనుగోలు కేంద్రాలపై దృష్టి సారించారు. మంత్రి పోచారం సమీక్ష ధాన్యం కొనుగోళ్లపై మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సమీక్షించారు. మంగళవారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించిన మంత్రి పోచారం అక్టోబర్ 1 నుంచే కొనుగోళ్లు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. కేంద్రాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూసుకోవాలని, ధాన్యం విక్రయించిన రైతులకు 48 గంటల్లో డబ్బులు చెల్లించేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ధాన్యంతో పాటు మొక్కజొన్న, కంది, పెసర వంటి పంటలను ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కొనుగోలు చేస్తా మని అన్నారు. ఇందుకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయని, అనుమతి వచ్చిన వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని ఆదేశించారు. సమీక్షలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు ఎంఆర్ఎం రావు, సత్యనారాయణ, మార్క్‌ఫెడ్, పౌరసరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు. -
జింక్ సబ్సిడీ.. అధికారుల దోపిడీ!
- వ్యవసాయ శాఖలో సూక్ష్మపోషక ఎరువులు పక్కదారి - రైతులకు సబ్సిడీతో ఇవ్వకుండా డీలర్ల ద్వారా విక్రయం సాక్షి, హైదరాబాద్: రైతులకు సబ్సిడీపై అందించాల్సిన జింక్ సల్ఫేట్‌ను రాష్ట్రంలో అనేక చోట్ల కొందరు వ్యవసాయాధికారులు పక్కదారి పట్టిస్తున్నారు. రైతులకు విక్రయించాల్సింది పోయి ప్రైవేటు డీలర్లకు కొందరు వ్యవసాయాధికారులు (ఏవో)కట్టబెడుతూ సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో రైతులు పూర్తి ధరకు ప్రైవేటు డీలర్ల వద్ద జింక్‌ను కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మార్క్‌ఫెడ్ లోని కొందరు జిల్లాస్థాయి అధికారులు కూడా ఏవోలకు సహకరిస్తున్నట్లు సమాచారం. 70 శాతం భూముల్లో జింక్ లోపం రాష్ట్రంలో 70% పైగా పంట భూముల్లో జింక్ లోపం ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జింక్ లోపముంటే మొక్క ఎదగదు. పూత, కాత పడిపోతుంది. పంట దిగుబడి గణనీయం గా తగ్గిపోతుంది. భూసార పరీక్షల ఆధారంగా ఏ భూమిలో ఎంత జింక్ లోపముందో గుర్తి స్తారు. లోపమున్న భూముల్లో జింక్ సల్ఫేట్‌ను ప్రతీ మూడు పంటలకోసారి వేయాలి. 2,500 మెట్రిక్ టన్నుల కొనుగోలు జింక్ లోపాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఏటా జింక్ సల్ఫేట్‌ను సరఫరా చేసే బాధ్యతను మార్క్‌ఫెడ్‌కు అప్పగించింది. జింక్ లోపాన్ని గుర్తించాక జిల్లా వ్యవసాయ శాఖల నుంచి ఇండెంట్ ఆధారంగా ప్రభుత్వం జింక్ సల్ఫేట్‌ను సరఫరా చేస్తుంది. 2016–17 సంవత్సరానికి సంబంధించి ఒక్కో మెట్రిక్ టన్నుకు రూ.36,400 ధరకు పలు కంపెనీల నుంచి 2,500 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది. వరి రైతుకు సబ్సిడీ పోను కిలో రూ.24, పప్పుధాన్యాలు వేసే రైతుకు సబ్సిడీ పోను కిలోకు రూ.18.20కు రైతుకు విక్రయించాలి. 2016–17కు సంబంధించి రూ.9.1 కోట్ల విలువైన 2,500 మెట్రిక్ టన్నుల జింక్‌ను జిల్లాలకు మార్క్‌ఫెడ్ సరఫరా చేసింది. సబ్సిడీ సొమ్ము ఇలా కాజేశారు జింక్ సల్ఫేట్‌ను జిల్లా మార్క్‌ఫెడ్ మేనేజర్ల ద్వారా ఏవోలకు సరఫరా చేశారు. ఏవోలే నేరుగా రైతులకు సబ్సిడీపై పంపిణీ చేయాలి. అయితే రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో కొందరు ఏవోలు రైతులకు విక్రయించకుండా స్థానికంగా ఉండే ప్రైవేటు ఎరువుల డీలర్లకు అప్పగించి వారి ద్వారా సబ్సిడీ లేకుండానే రైతులకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఖమ్మం జిల్లాలో కూసుమంచి మండలంలో ఒక ప్రైవేటు డీలర్ వద్ద జింక్ సల్ఫేట్ బస్తాలు తాజాగా పట్టుబడ్డాయి. ఇలాగే మరిన్ని జిల్లాల్లోనూ ఇలాంటి అక్రమాలు చోటుచేసుకున్నట్లు సమాచారం. యుటిలైజేషన్ సర్టిఫికెట్లూ రాలేదు 2016–17లో సరఫరా చేసిన జింక్ సల్ఫేట్కు సంబంధించి ఇంకా అనేక జిల్లాల నుంచి యుటిలైజేషన్ సర్టిఫికెట్లు (యూసీ) రాలేదని మార్క్‌ఫెడ్ ఎరువుల విభాగం ముఖ్య అధికారి బాలు నరేంద్ర ‘సాక్షి’కి తెలిపారు. గత రబీకి సంబంధించి ఖమ్మం జిల్లా నుంచి ఒక్క యూసీ రాలేదన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో రైతులకు జింక్ అమ్మకుండా డీలర్ల ద్వారా విక్రయించినట్లు తెలిసిందని చెప్పారు. జింక్ సల్ఫేట్ అక్రమ దందాలో రూ.2 కోట్లకు లెక్కలు తేలడం లేదని అంచనా. ఖమ్మం జిల్లాలో జింక్ పక్కదారి పట్టినట్లు తెలిసినా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడంలో వ్యవసాయ శాఖ విఫలమైందనే విమర్శలున్నాయి.


