జాతీయ జెండాను ఎగురవేస్తున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్
మహిళా న్యాయవాదులు, ఉద్యోగులకు ప్రత్యేక మౌలిక వసతులు
పౌరహక్కుల పరిరక్షణలో న్యాయవ్యవస్థది కీలకపాత్ర
కోర్టులు రాళ్ల నిర్మాణాలుగా మిగిలిపోకూడదు..
సత్వర న్యాయం అందించే ఆలయాలుగా ఉండాలి
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్
హైకోర్టులో ఘనంగా స్వాతంత్య్ర దిన వేడుకలు
సాక్షి, అమరావతి: అత్యవసర కేసులతో పాటు పాత కేసులు, సీనియర్ సిటిజన్లు, బలహీన వర్గాల కేసుల విచారణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ తెలిపారు. మహిళా న్యాయవాదులు, మహిళా ఉద్యోగులకు ప్రత్యేక మౌలిక వసతులు కలి్పస్తున్నట్లు చెప్పారు. 80వ స్వాతంత్య్ర దిన వేడుకలు శనివారం హైకోర్టులో ఘనంగా జరిగాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జస్టిస్ లీసా గిల్ మాట్లాడుతూ.. పౌర హక్కుల పరిరక్షణలో న్యాయ వ్యవస్థది కీలక పాత్ర అని చెప్పారు.
సత్వర న్యాయం కోసం సాంకేతికను సమర్థవంతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం ఇప్పటికే హైకోర్టుతో పాటు జిల్లా కోర్టుల్లో డిజిటల్ విప్లవం తీసుకొచ్చామని తెలిపారు. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న కేసుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పారు. కోర్టులు కేవలం రాళ్లు, ఇటుకలతో కూడిన నిర్మాణాలుగా మిగిలిపోకూడదని, సత్వర న్యాయాన్ని అందించే ఆలయాలుగా ఉండాలని అన్నారు. రాజ్యాంగ విలువలు, న్యాయపాలన పరిరక్షణకు న్యాయవాదులు, న్యాయమూర్తులు అంకితభావంతో, పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులను 2,50,363 నుంచి 2,45,438కి తగ్గించగలిగామని తెలిపారు. గత ఏడాది కాలంలో నిర్వహించిన 4 లోక్ అదాలత్‌లలో 13.95 లక్షల కేసులు పరిష్కారమయ్యాయని చెప్పారు.
గ్రామీణ ప్రాంతాల్లో న్యాయ సేవలు అందించేందుకు 14 సంచార వాహనాలను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. అనంతరం హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎన్. ద్వారకానాథ్ రెడ్డి, అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, అడిషనల్ సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు, విశ్రాంత న్యాయమూర్తులు, అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇవన సాంబశివప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ తేనెపల్లి నిరంజన్, న్యాయవాదులు, రిజి్రస్టార్లు, హైకోర్టు సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం అదనపు భవనం ప్రాంగణంలో న్యాయమూర్తులందరూ మొక్కలు నాటారు. విజయవాడలోని విజయమేరి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఫర్ ది బ్లైండ్ విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపించి అలరించారు. ఏపీ న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హారి జాతీయ జెండాను ఆవిష్కరించారు.


