రాష్ట్రంలోని బోధనాస్పత్రుల్లో జూడాల శ్రమ దోపిడీ
ఏకబిగిన 36–48 గంటల పాటు పని
నిద్రలేమి, శారీరక అలసట, మానసిక ఆందోళనతో డిప్రెషన్‌లోకి..
పని ప్రదేశంలో మహిళా డాక్టర్లకు కనీస సౌకర్యాలు కరువు
శ్రమను దోచుకుంటూ స్టైపెండ్ పెంపులో సర్కారు లెక్కలు
సీఎం, మంత్రులు మాత్రం స్పెషల్ ఫ్లైట్లలో ప్రయాణాలు, అనవసర ఈవెంట్లతో రూ.వందల కోట్ల దుబారా
30 శాతం డిమాండ్ చేస్తుంటే మూడు శాతం పెంచుతారట
చంద్రబాబు సర్కారు తీరుపై వైద్యవర్గాల్లో తీవ్ర నిరసన
సాక్షి, అమరావతి : అపరిమిత పని గంటలు, సెలవులు ఇవ్వకుండా కనీస మానవ హక్కులను సైతం ఉల్లంఘిస్తూ జూనియర్ వైద్యుల (జూడా) శ్రమను ప్రభుత్వం దోచుకుంటోంది. పని ప్రదేశంలో కనీస సదుపాయాలు, భద్రత లేమి పరిస్థితుల్లో జూడాలు రోగులకు సేవలు అందిస్తున్నారు. ఇలా బోధనాస్పత్రుల్లో వైద్య సేవలకు వెన్నెముకలుగా నిలుస్తున్న వీరికి స్టైపెండ్ పెంపులో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష ప్రదర్శిస్తోంది. వివిధ ఈవెంట్ల నిర్వహణ.. సీఎం, మంత్రులు స్పెషల్ ఫ్లైట్స్, హెలికాప్టర్ తిరుగుళ్లు, ఇతర అనవసర కార్యక్రమాల కోసం రూ.వందల కోట్ల ప్రజాధనాన్ని దుబారా చేస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏమాత్రం లెక్కచేయని ప్రభుత్వ పెద్దలు.. జూడాల స్టైపెండ్ పెంపులో మాత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వారానికి 80–100 గంటలు పని..
ఎన్‌ఎంసీ మార్గదర్శకాల ప్రకారం జూడాలు వారానికి పరిమిత గంటలు పనిచేయాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని బోధనాస్పత్రుల్లో ఏకబిగిన 36 నుంచి 48 గంటల పాటు వైద్యశాఖ వీరితో విధులు చేయిస్తోంది. డ్యూటీకి డ్యూటీకి మధ్య కనీస గ్యాప్ కూడా ఉండటంలేదు. అర గంట, గంట వ్యవధిలోనే తిరిగి విధుల్లోకి జూడాలు హాజరు కావాల్సి వస్తోంది. కార్మిక చట్టాల ప్రకారం వారానికి 48 గంటల పని ప్రామాణికం కాగా.. జూనియర్ డాక్టర్లు వారానికి 80 నుండి 100 గంటలకు పైగా పనిచేయాల్సి వస్తోంది. సెలవులు, వీక్లీ ఆఫ్‌లు కూడా లేకుండా పనిచేస్తున్నారు.
నిద్రలేమి, తీవ్రమైన శారీరక అలసట, మానసిక ఆందోళనతో చాలామంది డిప్రెషన్‌లో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోప ణలున్నాయి. మరుగుదొడ్లు, తాగునీరు, పనిప్రదేశంలో రెస్ట్ రూమ్స్ కూడా లేని దుస్థితిలో మహిళా వైద్యులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. ఇలా తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో సేవలందిస్తున్న వీరికి స్టైపెండ్ విషయంలో చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై వైద్యవర్గాల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
అమాంతం కోత..
వాస్తవానికి.. ప్రతీ రెండేళ్లకొకసారి ప్రభుత్వం జూడాల స్టైపెండ్ పెంచాల్సి ఉంటుంది. కానీ, ఈ విషయంలో ఈ ఏడాది జనవరి నుంచి ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల్లో 1,200 మందికి పైగా పీజీ రెసిడెంట్ డాక్టర్లు ఉన్నారు. ఎంబీబీఎస్ హౌస్‌సర్జన్లు మూడు వేల మందికిపైగా ఉంటారు. ఏపీ కంటే తెలంగాణలో జూడాల స్టైపెండ్ మెరుగ్గా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో.. ద్రవ్యోల్బణం, పెరిగిన ఖర్చులకు తగ్గట్లుగా, తెలంగాణను ఆదర్శంగా తీసుకుని 30 శాతం స్టైపెండ్ పెంచాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. కానీ, కేవలం 3 శాతం మాత్రమే పెంచుతామని ప్రభుత్వం చెప్పడంపై జూడాలు రగిలిపోతున్నారు. పైగా.. ఇప్పటివరకూ ప్రభుత్వం ఆనవాయితీగా పెంచుతూ వస్తున్న 15 శాతం పెంపులో అడ్డగోలుగా కోత పెట్టేస్తోంది.


