లోకాయుక్తగా జస్టిస్ మల్లికార్జునరావు
ఆయన పేరును ఖరారు చేసిన చంద్రబాబు నేతృత్వంలోని కమిటీ
స్కిల్ కుంభకోణంలో చంద్రబాబుకు బెయిల్ ఇచ్చిన జస్టిస్ మల్లికార్జునరావు
మొదట మధ్యంతర బెయిల్ ఇచ్చి.. ఆ తర్వాత పూర్తిస్థాయి బెయిల్ మంజూరు
2024లో ఒక విశ్రాంత ఏసీజే పేరును ఈ పదవికి సిఫారసు చేసిన హైకోర్టు సీజే
ప్రధాన న్యాయమూర్తి సిఫారసును చెత్తబుట్టలో పడేసిన చంద్రబాబు
ఎటువంటి ఇబ్బందీ ఎదురుకాకుండా ఏకంగా లోకాయుక్త చట్టానికి సవరణలు
తద్వారా లోకాయుక్త ఎంపిక నుంచి హైకోర్టు సీజే తొలగింపు..
తన నేతృత్వంలో సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకున్న బాబు
గత రెండేళ్లుగా లోకాయుక్త పదవిని భర్తీ చేయకుండా ఎప్పటికప్పుడు వాయిదా
ఈ క్రమంలో జస్టిస్ మల్లికార్జునరావు పదవీ విరమణ.. వెంటనే ఇస్తే విమర్శలు వస్తాయని 6 నెలలు వేచి చూసిన బాబు
ఎట్టకేలకు కీలక పదవికి జస్టిస్ మల్లికార్జునరావు ఎంపిక
సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావును లోకాయుక్తగా ఎంపిక చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. హైకోర్టు న్యాయమూర్తిగా ఇటీవల పదవీ విరమణ చేసిన జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావును లోకాయుక్తగా నియమించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో జరిగిన సెలక్షన్ కమిటీలో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. త్వరలో జస్టిస్ మల్లికార్జునరావు నియామకానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఐదేళ్ల పాటు ఆయన లోకాయుక్త పదవిలో కొనసాగుతారు.
వందల కోట్ల రూపాయల నిధుల గోల్‌మాల్ వ్యవహారం
2014–19 మధ్య చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా, స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం జరిగింది. వందల కోట్ల రూపాయల మేర నిధుల గోల్‌మాల్ జరిగినట్లు ఫిర్యాదు అందడంతో సీఐడీ కేసు నమోదు చేసింది. ప్రాథమిక విచారణ జరిపి స్కిల్ కుంభకోణంపై ప్రాథమిక ఆధారాలు సేకరించింది. 2023 సెప్టెంబర్ 9న చంద్రబాబును అరెస్ట్ చేసింది. విజయవాడ ఏసీబీ కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. విజయవాడ కోర్టు.. హైకోర్టు.. సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ నిరాకరించాయి. 54 రోజుల పాటు రాజమండ్రి కారాగారంలో ఉన్నారు. హైకోర్టులో రోస్టర్ మారడంతో చంద్రబాబు బెయిల్ పిటిషన్ జస్టిస్ మల్లికార్జునరావు ముందు విచారణకు వచ్చింది. అనారోగ్య కారణాలతో చంద్రబాబుకు మొదట నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన జస్టిస్ మల్లికార్జునరావు ఆ తరువాత 2023 నవంబర్‌లో పూర్తిస్థాయి బెయిల్ మంజూరు చేశారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిఫారసులనే పక్కనపడేసిన బాబు
వాస్తవానికి లోకాయుక్త ఎంపిక ప్రధాన న్యాయమూర్తి (సీజే) సిఫారసుతో జరుగుతుంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో లోకాయుక్తగా నియమితులైన జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి 2024 సెప్టెంబర్‌లో పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి చంద్రబాబు ప్రభుత్వం లోకాయుక్త నియామకాన్ని వాయిదా వేస్తూ వచ్చింది. నిజానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక విశ్రాంత తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) పేరును 2024లో లోకాయుక్త పదవికి సిఫారసు చేశారు. అయితే ఈ సిఫారసును చంద్రబాబు పక్కనపడేశారు. సదరు విశ్రాంత ఏసీజే లోకాయుక్త పదవిని ఇవ్వడం వల్ల ఆ పదవికి ఆయన వన్నెతెస్తారని చంద్రబాబుకు కొందరు సూచించినా ఆయన పట్టించుకోలేదు. చంద్రబాబు మనసులో వేరే ఆలోచన ఉండటంతో సీజే సిఫారసును పట్టించుకోలేదని ఇప్పుడు చర్చ జరుగుతోంది.
ప్రధాన న్యాయమూర్తిని తప్పించేందుకు ఏకంగా చట్ట సవరణ
ప్రధాన న్యాయమూర్తి సిఫారసును కాదని ముందుకు వెళ్లడం చట్ట ప్రకారం సాధ్యం కాకపోవడంతో ఏకంగా లోకాయుక్త చట్టానికే సవరణలు చేశారు. ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించకుండానే లోకాయుక్తను నియమించేలా చట్టాన్ని సవరించారు. లోకాయుక్త, ఉప లోకాయుక్త ఎంపిక బాధ్యతలను ముఖ్యమంత్రి నేతృత్వంలోని కమిటీనే తీసుకుంటుందని 2024 డిసెంబర్‌లో చేసిన సంబంధిత చట్ట సవరణలో చంద్రబాబు ప్రభుత్వం పేర్కొంది.
ఈ కమిటీలో ముఖ్యమంత్రి, అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్, హోంమంత్రి, ప్రతిపక్ష నేత ఉంటారు. అయితే శాసనసభలో ప్రతిపక్ష నేత ఎవరూ లేకుంటే మిగిలిన నలుగురే నిర్ణయం తీసుకోవచ్చునని చట్ట సవరణలో పేర్కొంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్ష హోదాను నిరాకరించిన నేపథ్యంలో చంద్రబాబు నేతృత్వంలోని నలుగురే నిర్ణయం తీసుకునే వెసులుబాటు కలిగింది. దీంతో హైకోర్టు సీజేను సంప్రదించకుండానే లోకాయుక్త నియామకాన్ని చేపట్టేందుకు చంద్రబాబుకు మార్గం సుగమం అయిందని చర్చ నడుస్తోంది.
అదుగో, ఇదుగో అంటూ హైకోర్టుకు చెబుతూ... చివరకు జస్టిస్ మల్లికార్జునరావుకు పదవి...
లోకాయుక్త పదవి ఖాళీ అయి దాదాపు రెండు సంవత్సరాలు కావొస్తున్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోడంతో ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది. లోకాయుక్త నియామకం విషయాన్ని ప్రశ్నిస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. చంద్రబాబు చేసిన లోకాయుక్త చట్ట సవరణను సైతం హైకోర్టు ముందు సవాలు చేశారు. హైకోర్టు సైతం లోకాయుక్త పదవి భర్తీకి ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని సైతం ఆదేశించింది. అయితే ప్రభుత్వం మాత్రం అదిగో చెబుతాం.. ఇదిగో చెబుతాం అంటూ కాలయాపన చేస్తూ వచ్చింది.
ఎంతో మంది లోకాయుక్త పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయినా కూడా వాటిని చంద్రబాబు పట్టించుకోలేదు. ఇదిలా కొనసాగుతుండగానే, జస్టిస్ మల్లికార్జునరావు హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణ చేసిన వెంటనే పదవి ఇస్తే విమర్శలు వస్తాయనే ఉద్దేశంతో ఓ ఆరు నెలలు ఆగారని, చివరకు తాను అనుకున్న విధంగా జస్టిస్ మల్లికార్జునరావును లోకాయుక్తగా నియమించారని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.
లోకాయుక్త పోస్టును రాజకీయ నియామకంగా మార్చేసిన పరిస్థితి
చట్ట ప్రకారం అవినీతి కేసుల్లో లోకాయుక్త దర్యాప్తు పరిధిలోకి మంత్రులు కూడా వస్తారు. అయితే చంద్రబాబు మాత్రం హోంమంత్రికి సెలక్షన్ కమిటీలో స్థానం కల్పించారు. తద్వారా లోకాయుక్త పరిధిలోకి వచ్చే వారే లోకాయుక్తను నియమించే స్థితికి చట్టాన్ని దిగజార్చారు. అంతిమంగా లోకాయుక్త వ్యవస్థ స్వతంత్రతను చంద్రబాబు కాలరాశారు. అనుకున్న విధంగా చట్ట సవరణ చేసిన తరువాత కూడా లోకాయుక్త పదవి భర్తీకి చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. న్యాయపరమైన చిక్కులను అధిగమించేందుకు పలుమార్లు నోటిఫికేషన్లు జారీ చేసి ఉపసంహరించుకున్నారని, ఎవరికి లోకాయుక్త పదవి ఇవ్వాలో ముందుగానే నిర్ణయించుకున్న
చంద్రబాబు, అందుకు అనుగుణంగా కాలయాపన చేస్తూ వచ్చారని సోషల్ మీడియా విశ్లేషిస్తోంది.
చంద్రబాబు తీసుకొచ్చిన ఈ చట్ట సవరణపై సర్వత్రా, ముఖ్యంగా న్యాయవ్యవస్థలోనే తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రధాన న్యాయమూర్తిని ఉద్దేశపూర్వకంగా విస్మరించారని న్యాయవ్యవస్థలో తీవ్ర విమర్శలు వచ్చాయి. తద్వారా లోకాయుక్త పోస్టును రాజకీయ పోస్టుగా మార్చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. చట్ట సవరణ ద్వారా లోకాయుక్త చట్టం ఉద్దేశాన్ని నీరుగార్చేశారని న్యాయ నిపుణులు దుమ్మెత్తిపోశారు. అయితే వీటిని చంద్రబాబు ఏ మాత్రం లెక్క చేయలేదు.


