కోవెలకుంట్లలో వైన్‌షాపు వెనుకవైపు నుంచి మద్యం బాటిళ్లు అమ్ముతున్న దృశ్యం
బాటిల్‌పై రూ.50 నుంచి రూ.100 అధికం.. మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి నియోజకవర్గంలో జోరుగా విక్రయాలు
సాక్షి టాస్క్ ఫోర్స్: జనవరి 26, ఆగస్టు 15, అక్టోబర్ 2 తేదీల్లో దేశవ్యాప్తంగా మద్యం, మాంసం విక్రయించకూడదనే నిబంధన చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చాక అమలు కావడంలేదు. ఆయా తేదీల్లోను మద్యం, మాంసం విక్రయాలు నిరాటంకంగా సాగుతున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం రోజు శనివారం నంద్యాల జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మద్యం, మాంసం విక్రయాలు జోరుగా జరిగాయి. రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి సొంత నియోజకవర్గం బనగానపల్లెలో మద్యం ఏరులై పారింది. ఎక్సైజ్‌శాఖ అధికారులు మద్యం షాపులకు లక్క అతికించి మూసివేశారు.
వైన్‌షాపుల యాజమాన్యం ప్రైవేట్ వ్యక్తులను ఏర్పాటు చేసుకుని ముందురోజే మద్యం బాటిళ్లను బయటకు తరలించి విక్రయాలు జరిపినట్లు తెలుస్తోంది. ఒక్కో బాటిల్‌పై ఎంఆర్‌పీ కంటే రూ.50 నుంచి రూ.100 వరకు అదనంగా వసూలు చేసి సొమ్ము చేసుకున్నారు. జిల్లాలో వివిధ ప్రాంతాలతోపాటు బనగానపల్లె, కోవెలకుంట్ల, సంజామల, అవుకు, కొలిమిగుండ్ల తదితర మండలాల్లో శనివారం మద్యం విక్రయాలు ఎక్కువగా జరిగినట్లు తెలిసింది. కోవెలకుంట్లలోని గుంజలపాడు రహదారి పక్కన ఉన్న వైన్‌షాపులో రెండోవైపు డోర్ నుంచి మద్యం విక్రయించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


