గౌరవ వందనం స్వీకరిస్తున్న సీఎం చంద్రబాబు
హామీలన్నీ అమలుచేశామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన
వాస్తవానికి సూపర్‌సిక్స్, సూపర్ సెవన్ హామీలన్నీ పూర్తిగా ఎగవేత
సాక్షి, అమరావతి: ‘నిజాలు మాట్లాడితే నీ తల వేయిముక్కలవును గాక’.. అని వెనకటికి ఓ మహామునికి శాపం ఉన్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నోరు విప్పితే అబద్ధాలు తప్ప ఆయన నోటి నుంచి ఎప్పుడూ నిజాలు రావు. వేదిక ఏదైనా.. సమయం ఎప్పుడైనా ఆయన అలవోకగా.. అనర్గళంగా.. కన్నార్పకుండా పచ్చి అబద్ధాలు చెప్పడం ఆయన సహజ లక్షణం. ఎందుకంటే.. శనివారం నాటి 80వ పంద్రాగస్టు వేడుకల సందర్భంగా ఆయన వల్లెవేసిన అబద్ధాలు విన్నా, చూసినా ఇది నిజమేననిపిస్తుంది. గుంటూరు జిల్లా నేలపాడులో చంద్రబాబు ఏమన్నారు.. వాస్తవాలేమిటో ఒక్కసారి పరిశీలిస్తే..
చంద్రబాబు: సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశాం. ఎన్నికల్లో ఇచి్చన హామీలన్నీ అమలుచేసేశాం, చెప్పినవే కాదు. చెప్పనవి కూడా అమలుచేస్తున్నాం..
వాస్తవం: అధికారంలోకి రావడమే పరమావదిగా సూపర్ సిక్స్ సూపర్ సెవన్ అంటూ ఎన్నికల్లో నోటికొచి్చనట్లు ఎడాపెడా హామీలు గుప్పించారు. రెండేళ్లు దాటినా వాటిలో ఏ ఒక్కటి పూర్తిస్థాయిలో అమలుచేసిన పాపాన పోలేదు.
⇒ అధికారంలోకి వచీ్చరాగానే ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఆడబిడ్డలకు నీకు రూ.15వేలు.. నీకు రూ.15వేలు.. నీకు రూ.15వేలు ఇస్తామంటూ ఓట్లు దండుకుని ఇప్పుడా ఊసెత్తడంలేదు.
⇒ ఇంటికొక ఉద్యోగం, ఉద్యోగం వచ్చే వరకు ప్రతీ నిరుద్యోగికి రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీ పత్తాలేదు.
⇒ 50 ఏళ్లు నిండిన ప్రతీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజికవర్గాలకు చెందిన వారికి పింఛన్లు ఇస్తామన్న హామీ అమలుకు నోచుకోలేదు. పైగా.. 6.20 లక్షల పింఛన్లకు కోత వేశారు. ఇక ఈ 26నెలల్లో కొత్తగా ఏ ఒక్కరికీ పింఛన్ ఇచ్చిన పాపాన పోలేదు.
⇒ అన్నదాత సుఖీభవ కింద ప్రతీ రైతుకు ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం, తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు రూ.15వేలు చొప్పున ఇస్తామంటూ సూపర్ సిక్స్‌లో హామీలు ఇచ్చారు. ఆచరణకు వచ్చేసరికి తొలి ఏడాది నిస్సిగ్గుగా ఎగ్గొట్టి గడిచిన రెండేళ్లలో అర్హుల్లో అడ్డగోలుగా కోతలు పెడుతూ అరకొరగా ఇస్తున్నారు. పైగా రూ.2వేలు కోతపెట్టి రూ.13 వేలకు పరిమితం చేయగా, కొంతమందికి రూ.8 వేలు, మరికొంతమందికి రూ.9వేలు, ఇంకొంతమందికి రూ.10 వేల మాత్రమే విదిల్చారు.
⇒ డ్వాక్రా అక్కాచెల్లెమ్మలకే కాదు.. అన్నదాతలకు సైతం సున్నా వడ్డీ పథకానికి ఎగనామం పెట్టారు. దీపం–2 పథకం కింద ఏటా ప్రతీ మహిళకు మూడు గ్యాస్ సిలెండర్లు ఉచితంగా ఇస్తామన్న హామీ ఉత్త గ్యాసే అని తేలిపోయింది. తొలి ఏడాది సింగిల్ సిలెండర్‌తో సరిపెట్టగా, రెండేళ్లుగా రెండు సిలెండర్లకు కుదించేశారు. ఇప్పుడీ రాయితీ సొమ్ములు పడుతున్నాయో లేదో కూడా ఎవరికీ తెలియని దుస్థితి నెలకొంది.
⇒ ఇలా సూపర్‌సిక్స్‌తో సహా 143 హామీలు అమలులో చేతులెత్తేసిన సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా సూపర్ సిక్స్‌తో సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలుచేశామని ప్రకటించడం విస్మయానికి గురిచేస్తోంది.
చంద్రబాబు: ఉద్యోగులకు బకాయిలన్నీ చెల్లించేశాం..
వాస్తవం: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచి్చంది మొదలు ఉద్యోగ, ఉపాధ్యాయుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. పీఆర్సీ కమిషనర్‌ను నియమించలేదు. పీఆర్సీ ఇస్తారో లేదో కూడా తెలియని పరిస్థితి. ఐఆర్ ఇవ్వలేదు. ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇలా ఉద్యోగులకు దాదాపు రూ.50 వేల కోట్ల బకాయిలున్నాయి. అవేమీ చెల్లించకుండానే రెండేళ్లలో రూ.30,849 కోట్ల బకాయిలు చెల్లించేశామని చంద్రబాబు ప్రకటించడంపట్ల ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ బకాయిలు ఎవరికి చెల్లించారో, ఎప్పుడు చెల్లించారో బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి.
చంద్రబాబు: రెండేళ్లుగా విద్యుత్ ఛార్జీలు పైసా కూడా పెంచలేదు.. వచ్చే మూడేళ్లలో పెంచబోం..
వాస్తవం: బాదుడే బాదుడు అంటూ రెండేళ్లుగా ఎడాపెడా విద్యుత్ ఛార్జీలు పెంచేస్తున్నారు. తొలి ఏడాదిలోనే చంద్రబాబు ప్రభుత్వం రూ.15,485.36 కోట్ల ఛార్జీల భారాన్ని వేసింది. 2024–25 ఆరి్థక సంవత్సరానికి రూ.2,787.18 కోట్లు ప్రజల నుంచి ముక్కుపిండి వసూలుచేసింది. ఇక 2025–26 ఆరి్థక సంవత్సరానికి రాష్ట్ర ప్రజల నుంచి రూ.2,800.28 కోట్లు వసూలుచేశారు. ఈ లెక్కన ఇప్పటివరకూ వేసిన భారం రూ.21,072.82 కోట్లు. ఇది కాకుండా మరో రూ.555.30 కోట్ల భారం వేసేందుకు రెడీగా ఉన్నారు. ఈ లెక్కన వివిధ రూపాల్లో విద్యుత్ ఛార్జీల పేరిట రూ.21,628.12 కోట్ల మేర భారం ప్రజలపై మోపిన చంద్రబాబు నేడు నిస్సిగ్గుగా రెండేళ్లలో ఒక్క పైసా పెంచలేదని చెప్పడం, పైగా వచ్చే మూడేళ్లలో పైసా కూడా పెంచబోమని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉంది.
చంద్రబాబు: 22ఏ నుంచి భూములన్నీ తొలగించేశాం..
వాస్తవం: వైఎస్ జగన్ హయాంలో హక్కులు కల్పించిన 13.59 లక్షల ఎకరాల ఫ్రీహోల్డ్ భూములు, రెండు లక్షల ఎకరాల చుక్కల భూములు, 50 వేల ఎకరాల అనాదీనం భూములు, 40 వేల ఎకరాల షరతులుగల పట్టా భూములతో పాటు 20 లక్షల ఎకరాల భూములను చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచీ్చరాగానే 22ఏ నిషేధిత భూముల జాబితాలో పెట్టింది. ప్రతీవారం ప్రతీ జిల్లా కేంద్రాల్లో జరిగే గ్రీవెన్స్‌లో వచ్చే ఫిర్యాదుల్లో నూటికి 80 శాతం ఈ 22ఏ భూములకు సంబంధించినవే. ఆ భూములకు సంబంధించిన లక్షలాది రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడంలేదు. కొందరు టీడీపీ నాయకుల భూములను మాత్రం 22ఏ నుంచి తొలగించి మొత్తం భూములను తొలగించినట్లుగా డబ్బా కొట్టుకుంటున్నారు.
చంద్రబాబు: నాలుగు పోర్టులు, నాలుగు హార్బర్లు నిరి్మంచేస్తున్నాం..
వాస్తవం: తీర ప్రాంత రూపురేఖలు మారుస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్ వే పోర్టులతో పాటు 10 ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్‌ల్యాండ్ సెంటర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వీటిలో చాలావరకు వైఎస్ జగన్ హయాంలోనే 50–80 శాతం వరకు పనులు పూర్తయ్యాయి. అలాంటిది.. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టులను తామే శరవేగంగా నిర్మిస్తున్నామని.. జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్లూ నిరి్మస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు. పైగా.. వైఎస్ జగన్ హయాంలోనే అన్ని అనుమతులు సాధించి 89 శాతానికి పైగా పనులు పూర్తిచేసిన భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయాన్ని తామే నిరి్మంచినట్లుగా బిల్డప్ ఇచ్చుకుంటున్నారు. ఇలా తాను చేయని పనులను తన ఖాతాలో వేసుకుని చంద్రబాబు ఎక్కడాలేని క్రెడిట్ చోరికి పాల్పడుతున్నారు.
చంద్రబాబు: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు..
ఏటా జాబ్ క్యాలెండర్..
వాస్తవం: అధికారంలోకి వచ్చి 26 నెలలు గడిచిపోయింది. మెగా డీఎస్సీ పేరిట దగా చేయడం తప్ప ఆయా ప్రభుత్వ శాఖల్లో లక్షలాదిగా ఖాళీగా ఉన్న ప్రభుత్వోద్యోగాలను భర్తీచేసిన పాపాన పోలేదు. ఏటా జాబ్ క్యాలెండర్లు ప్రకటిస్తామని ఇచ్చిన హామీకి విరుద్ధంగా రెండేళ్లుగా జాబ్ క్యాలెండర్లు ప్రకటించనేలేదు. మెగా డీఎస్సీ–2025 ద్వారా 15,941 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ వెనుక ఏ స్థాయిలో స్కాంలు జరిగాయో చెప్పక్కర్లేదు. ఉపాధ్యాయ పోస్టులను దొంగ సరి్టఫికెట్లతో తమ పార్టీ కార్యకర్తలకు పప్పుబెల్లాల అమ్ముకున్నారన్న ఆరోపణలపై నోరు విప్పితే ఒట్టు.
ఎదురుదాడి చేయడం తప్ప సీబీఐ విచారణకు ఒప్పుకోవడంలేదు. ఈ అక్రమాలకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిన విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ను వెనకేసుకొస్తూ మెగా డీఎస్సీని పారదర్శకంగా నిర్వహించామని చంద్రబాబు శనివారం స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో పచ్చి అబద్ధాలు చెప్పారు. పైగా.. ఇక నుంచి ఏటా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేస్తామని, అలాగే.. ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని కూడా చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ఇప్పటికే 10 వేలకు పైగా ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేశామన్నారు.


