చేతులెత్తేసిన పోలీసులు.. స్టేషన్‌లోకి దూసకెళ్లిన జనసేన కార్యకర్తలు | Janasena Activists Attempt Attack on Inaguduru Police Station | Sakshi
Sakshi News home page

చేతులెత్తేసిన పోలీసులు.. స్టేషన్‌లోకి దూసకెళ్లిన జనసేన కార్యకర్తలు

Jul 3 2026 12:40 PM | Updated on Jul 3 2026 2:27 PM

Janasena Activists Attempt Attack on Inaguduru Police Station

సాక్షి,కృష్ణా: మచిలీపట్నంలోని ఇనగుదురు పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. భారీ సంఖ్యలో తరలివచ్చిన జనసేన కార్యకర్తలు ఏకంగా పోలీస్ స్టేషన్‌లోకి చొరబడి రావణ్‌పై దాడికి యత్నించడం తీవ్ర కలకలం రేపింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని స్టేషన్ పైకే దూసుకొచ్చిన జనసేన శ్రేణులపై పోలీసులు వ్యవహరించిన తీరు ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

సాధారణంగా పోలీస్ స్టేషన్ పై దాడి జరిగితే ఉక్కుపాదంతో అణచివేయాల్సిన ఖాకీలు, ఇక్కడ మాత్రం పూర్తిగా 'లైట్' తీసుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్టేషన్‌లోకి దూసుకెళ్లిన జనసేన కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోకుండా, పోలీసులు అత్యంత సున్నితంగా వ్యవహరించడం వెనుక అధికార పార్టీ ఒత్తిళ్లు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.

లాఠీఛార్జ్ చేయకుండా, కేవలం రోప్‌లతో సర్దిచెప్పే ప్రయత్నం చేయడం పోలీసుల ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చింది.సొంత పార్టీ నేత, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అధికారంలో ఉన్నారనే ధీమాతోనే కార్యకర్తలు ఇంతలా రెచ్చిపోయారని స్థానికులు చర్చించుకుంటున్నారు. పోలీసుల హెచ్చరికలను, బారికేడ్లను సైతం లెక్కచేయకుండా స్టేషన్ వైపు దూసుకొచ్చినా ఖాకీలు మౌనప్రేక్షకులుగా ఉండిపోవడం శాంతిభద్రతల క్షీణతకు అద్దం పడుతోంది. అధికార పక్షానికి చెందిన వారైతే చట్టం చుట్టంగా మారిపోతుందా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

ప్రస్తుతం ఇనగుదురు పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ, ఆ ప్రాంతమంతా రణరంగంగా మారడానికి పోలీసుల అలసత్వమే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement