కొత్త పింఛన్‌ కాకమ్మ కథే! | Chandrababu govt evil plan on Elderly people for New pension | Sakshi
Sakshi News home page

కొత్త పింఛన్‌ కాకమ్మ కథే!

Jun 15 2026 5:04 AM | Updated on Jun 15 2026 5:04 AM

Chandrababu govt evil plan on Elderly people for New pension

పండుటాకులను మభ్యపుచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వ దుష్ట పన్నాగం 

కొత్త పింఛన్లు ఇచ్చేస్తున్నారంటూ మోసపూరిత ప్రకటనలు

రెండేళ్లు పూర్తవుతుండడంతో ఎల్లో మీడియాలో తప్పుడు కథనాలు 

జూన్‌ 12 నుంచి ప్రభుత్వం కొత్త పింఛన్లు ఇవ్వనుందని నెలన్నర రోజులుగా విస్తృత ప్రచారం  

అవ్వాతాతలు, అర్హులైన లబ్ధిదారులు సచివాలయాలకు పరుగులు 

పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు వేలాదిగా తరలివస్తుండడంతో గందరగోళం 

అలాంటిదేమీ లేదని, సచివాలయాల వరకూ వచ్చి ఇబ్బంది పడవద్దని ఉద్యోగుల సందేశాలు 

అందరికీ చెప్పలేక వాట్సాప్‌ స్టేటస్‌లుగా పెట్టుకుంటున్న సచివాలయ ఉద్యోగులు 

చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణే బంద్‌ 

వెబ్‌సైట్‌లో కొత్త పెన్షన్‌ దరఖాస్తు స్వీకరించే ఆప్షన్‌ తీసేసిన సర్కార్‌ 

రెండేళ్లలో 6.14 లక్షల వరకు తగ్గిపోయిన పింఛన్ల సంఖ్య 

దివ్యాంగుల పింఛన్లను తగ్గించేందుకు రీవెరిఫికేషన్‌ చేస్తున్న బాబు సర్కార్‌..

సాక్షి, అమరావతి: ‘‘ప్రస్తుతం కొత్త పింఛన్ల దరఖాస్తు స్వీకరణకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ఆదే­శాలు వెలువడలేదు. ప్రభుత్వం నుంచి అధికారిక మార్గదర్శకాలు వెలువడిన వెంటనే ప్రజలకు తెలియచేయబడును’’ కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి గ్రామ, వార్డు సచివాలయాలకు ఫోన్లు చేసి విచారిస్తున్న వారికి ఉద్యోగులు తెలియజేస్తున్న సందేశమిది. ఎక్కువ మందికి ఇదే సమా­చారం చెప్పాల్సి వస్తుండడంతో ఈ సందేశాన్ని పలువురు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు తమ వాట్సాప్‌ స్టేటస్‌ మెసేజ్‌లుగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో రెండేళ్ల క్రితం చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కొత్తగా ఒక్క పింఛన్‌ కూడా మంజూరు కా­లేదు. 

కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన ఆన్‌లైన్‌ పోర్టల్‌ సైతం నిలిచి­పోయింది. అయితే, నెలన్నర నుంచి అధికార టీడీపీ అనుకూల మీడియాలో ‘వితంతువులకు పింఛను భరోసా – జూన్‌ నుంచి కొత్త వారికి– కూటమి ప్రభు­త్వం మూడో వసంతంలోకి అడుగిడే వేళ మంజూరు’ అంటూ ప్రత్యేక కథనాలు ప్రచురితమయ్యాయి. ఇదే అంశంపై మంత్రి అచ్చెన్నాయుడు సహా కొందరు మంత్రులు ప్రకటన చేసినట్టు కథనాలు వచ్చాయి. ఇవి చూసి రెండేళ్లగా కొత్త పింఛన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎదురుచూస్తున్న లక్షలాది మంది అర్హులైన అవ్వాతాతలు, వితంతువులు దరఖాస్తు చేసుకోవడానికి రోజూ సచివాలయాలకు వచ్చి పోతున్నారు. అయితే సచివాలయ ఉద్యోగుల సందేశాలను బట్టి ఇదంతా ఉత్తుత్తి ప్రచారమేనని తేలిపోయింది. కూటమి ప్రభుత్వం మభ్యపుచ్చే పథకాలలో ఇది కూడా భాగమేనని స్పష్టమయ్యింది. 

అధికార పార్టీ ఎమ్మెల్యేల ఆదేశాలతో ఉత్తుత్తి దరఖాస్తుల డ్రామా.. 
స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేల మౌఖిక సూచనలతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో  కొత్త పింఛన్ల పేరిట ఉత్తుత్తి దరఖాస్తుల డ్రామా  మొదలైంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ పీఏల ద్వారా వాళ్ల పరిధిలోని గ్రామ వార్డు సచివాలయాలకు ఫోన్లు చేసి కొత్త పింఛన్ల కోసమంటూ ఎవరు వచ్చినా వాళ్లకు ‘ప్రభుత్వం ఇప్పుడు కొత్తవి ఇవ్వడం లేద’ని చెప్పకుండా వాళ్లిచ్చే కాగితాలు  తీసుకోవాలంటూ మౌఖిక ఆదేశాలిచ్చారు. దీంతో.. ఉమ్మడి పశ్చిమ గోదావరి సహా పలు జిల్లాల్లో పింఛన్ల కోసమని సచివాలయాలకు వచ్చే వారి నుంచి దరఖాస్తులను తీసుకొని సిబ్బంది వాటన్నింటినీ పక్కన పడేశారు. ‘ప్రభుత్వం కొత్త పింఛన్లు ఇస్తుందంట..’ అన్న ఉత్తుత్తి ప్రచారాన్నే నమ్మి మే నెలలో ఏలూరు జిల్లా ఉంగటూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని భీమడోలు మండలం పూళ్ల గ్రామ పంచాయతీ పరిధిలోని ఎంఎంపురం సచివాలయంలో 44 మంది పింఛను ఫారాలు ఇచ్చి వెళ్లారు. అందులో 16 మంది అవ్వాతాతల పింఛన్‌ కోసమైతే, మరో 28 మంది వితంతు, దివ్యాంగుల పింఛన్ల కోసం. మరోవైపు.. అదే పూళ్ల గ్రామ పంచాయతీలోనే పూళ్ల – 1 సచివాలయంలో మరో 30 మంది ఇలాంటి పింఛన్‌ ఫారాలు ఇచ్చి వెళ్లారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు అసెంబ్లీ నియోజకవర్గం దువ్వ గ్రామ పంచాయతీ పరిధిలోనూ ఇదే పరిస్థితి.  దువ్వ –1 సచివాలయంలో కూడా 29 మంది కొత్త  పింఛన్ల కోసం  ఫారాలు ఇవ్వగా, దువ్వ రెండో సచివాలయంలో మరో 20 మంది కొత్త పింఛన్ల ఫారాలు ఇచ్చి వెళ్లారు.  

ఆరు నెలలకొకసారి ఇలాంటి మభ్య పెట్టే ప్రకటనలతోనే.. 
ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ల పూర్తవుతున్న సందర్భంగా ఈ జూన్‌ 12 నుంచి కొత్త పింఛన్లు అంటూ ప్రచారం చేశారు. గత ఏడాది డిసెంబరు నెలలో జరిగిన కలెక్టర్ల సదస్సులోనూ జిల్లాకు రెండు వందల కొత్త పింఛన్లను మంజూరు చేయనున్నట్టు అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులు, కేన్సర్‌ రోగులు, వికలాంగులకు ప్రాధాన్యత ఇచ్చి జిల్లాకు రెండు వందల చొప్పున ఆయా జిల్లాల ఇన్‌చార్జి మంత్రుల ఆధ్వర్యంలో కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నటు ప్రకటించింది. కానీ, దానికి సంబంధించి ఇప్పటిదాక అధికారిక ఉత్తర్వులైతే వెలువడలేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో వృద్ధాప్య పింఛను కనీస అర్హత వయస్సు 60 ఏళ్లు కాగా గత ఎన్నికల సమయంలో కూటమి పార్టీల మేనిఫెస్టోలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కొత్తగా 50 ఏళ్లకే మంజూరు చేయనున్నట్టు హామీ ఇచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో కొత్త పింఛన్ల మంజూరే ఆగిపోయింది. 2024 జూన్‌ నుంచి రాష్ట్రంలో అర్హులు కొత్త పింఛన్ల కోసం  దరఖాస్తు చేసుకునే ఆన్‌లైన్‌ పోర్టల్‌ను ప్రభుత్వం పూర్తిగా మూతపెట్టేసింది. 

రెండేళ్లలో పింఛన్ల సంఖ్య ఆరు లక్షలపైనే తగ్గుదల.. 
చంద్రబాబు ప్రభుత్వం కొత్త పింఛన్లు ఇవ్వకపోవడం ఒక ఎత్తయితే.. ఇచ్చే పింఛన్ల సంఖ్య కూడ గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నాటి సంఖ్యతో పోల్చితే  ఆరు లక్షలకు పైబడి తగ్గిపోయాయి. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో దేశంలో మరే రాష్ట్రంలో లేనట్టుగా అత్యధికంగా 66,34,742 మంది లబ్దిదారులు పింఛను పొందారు. తర్వాత కాలంలో పెన్షన్ల సంఖ్య సాధారణంగా పెరగాలి. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంఖ్య క్రమంగా తగ్గిపోతూ వచ్చింది.  ఈ నెల 1, 2 తేదీల్లో  పూర్తయిన పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం డబ్బులు పంపిణీ చేసిన లబ్దిదారుల సంఖ్య 60,19,920 మాత్రమే. అంటే గత ప్రభుత్వంలో పెన్షన్లు పొందిన లబ్ధిదారుల సంఖ్య కన్నా ప్రస్తుతం దాదాపు 6.14 లక్షల వరకు తగ్గిపోయాయి. అదే వైఎస్‌జగన్‌ ప్రభుత్వ హయాంలో (2019–24 మధ్య ఆ ఐదేళ్ల కాలంలో) అప్పటి ప్రభుత్వం 29.51 లక్షల కొత్త పింఛన్లు మంజూరు చేసినట్టు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారికంగా ప్రకటించింది.  

దివ్యాంగుల మెడపై కత్తి... 
పింఛన్లలో మరిన్ని కోతలు పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం దారులు వెతుకుతోంది. పింఛన్లు తీసుకుంటున్న దివ్యాంగుల్లో పెద్ద సంఖ్యలో అనర్హులు ఉన్నారంటూ ప్రచారం చేస్తుండడంతో ఎవరి పింఛన్‌ ఆపేస్తారోనని వారిలో భయాందోళనలు నెలకొన్నాయి. పింఛన్లు పొందుతున్న దాదాపు 8 లక్షల మంది దివ్యాంగులకు ఇప్పుడు కొత్తగా అర్హత నిర్ధారణ కోసమంటూ డాక్టర్ల ద్వారా రీ వెరిఫికేషన్‌ ప్రక్రియను చేపట్టారు. దివ్యాంగులు, మెడికల్‌ పింఛన్లు తీసుకునే 8 లక్షల మందికీ రీ వెరిఫికేషన్‌ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ గ్రామాల్లో టీడీపీ సానుభూతిపరులు అనుకునే వారికి ఇప్పటి దాక పరీక్షల నోటీసులు ఇవ్వలేదు. అలా రెండు లక్షల మందిని ఈ పరీక్షల నుంచి మినహాయించి మిగిలిన ఆరు లక్షల మంది దివ్యాంగులకు మాత్రమే ఈ రీ వెరిఫికేషన్‌ పరీక్షలు చేపట్టడం గమనార్హం.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement