అనంతపురం సిటీ: అనంతపురం సర్వజనాస్పత్రిలోని గైనిక్ విభాగం బాత్రూమ్‌లో శిశువు మృతదేహం కలకలం రేపింది. గురువారం బాత్రూమ్ శుభ్రం చేసేందుకు వెళ్లిన పారిశుధ్య కార్మికురాలు మృతశిశువును గుర్తించి సూపర్‌వైజర్‌కు సమాచారమిచ్చారు. ఆయన సూచనతో మృత శిశువును గుట్టుచప్పుడు కాకుండా అక్కడి నుంచి తొలగించారు. కాగా, ఈ అంశంపై అన్నీ అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. పూర్తి స్థాయిలో అవయవాలు ఎదగని స్థితిలో ఉన్న పిండాన్ని బాగా శుభ్రం చేసి బాత్రూమ్‌లో పడేసినట్లుగా తెలుస్తోంది.
కాగా..రెండు, మూడు రోజులుగా జీజీహెచ్‌లోని లేబర్ వార్డులో ఎలాంటి అబార్షన్లూ జరగలేదని ఆస్పత్రి రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. బాత్రూమ్‌లో అబార్షన్ జరిగి ఉంటే అక్కడ రక్తపు మరకలు పడి ఉండాలి. కానీ అలాంటి ఆనవాళ్లు ఏవీ అక్కడ లేవు. అంతేకాక, మృతశిశువుపై కూడా ఎలాంటి రక్తపు మరకలు లేకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. ఈ అంశంపై జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి విచారణకు ఆదేశించారు.
కాగా, గైనిక్ విభాగంలోని నర్సింగ్ సిబ్బందితో తమకున్న విభేదాల కారణంగా నర్సులను ఇబ్బంది పెట్టే క్రమంలో బాత్రూమ్‌లో మృతశిశువు అంశాన్ని పారిశుధ్య కార్మికులు ఉపయోగించుకున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే తాము తీసిన ఫొటోను తెలిసిన వారికి పంపి, అంశం కాస్త బహిర్గతమయ్యేలా చేసినట్లు అనుమానిస్తున్నారు.


