టీచర్లపై సస్పెన్షన్‌.. ప్రజాస్వామ్య విరుద్ధం | - | Sakshi
Sakshi News home page

టీచర్లపై సస్పెన్షన్‌.. ప్రజాస్వామ్య విరుద్ధం

Aug 17 2026 1:53 AM | Updated on Aug 17 2026 1:53 AM

వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు

విశ్వేశ్వరరెడ్డి

ఉరవకొండ: ఉపాధ్యాయ సంఘాల నాయకులపై సస్పెన్షన్‌ వేటు వేయడం ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనంగా నిలుస్తోందని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహయింపు ఇవ్వాలనే న్యాయపరమైన డిమాండ్‌ పై కేంద్ర విద్యాశాఖ మంత్రిని కలిసేందుకు వెళ్లిన ఐదుగురు ఉపాధ్యాయులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష పూరితంగా సస్పెన్షన్‌ వేటు వేయడం దుర్మార్గమన్నారు. విపక్ష నాయకులపై ప్రయోగించే ‘రెడ్‌బుక్‌’ చర్యలను ఉపాధ్యాయులపై ప్రయోగించడం చూస్తుంటే ప్రశ్నించే గొంతుకలను అణచివేయడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందన్నారు. ఇది సరైన చర్య కాదని ఖండించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు సిద్ధం అవుతామన్నారు.

తాగునీటికే వాడుకోవాలి

ఉరవకొండ: నింబగల్లు వద్ద గుంతకల్లు బ్రాంచ్‌ కెనాల్‌ (జీబీసీ) హెడ్‌ నుంచి హెచ్చెల్సీ జలాలను అధికారులు విడుదల చేశారు. ఆదివారం కాలువలో 170 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా డీఈ మంజునాథ్‌ మాట్లాడుతూ ఎల్‌–నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా మొదటి ప్రాధాన్యత కింద తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలన్నారు. రైతులు పొలాలకు నీటిని మళ్లించుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.

నేటి నుంచి ఎఫ్‌ఏ–1 పరీక్షలు

అనంతపురం ఎడ్యుకేషన్‌: జిల్లాలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన స్వీయ మూల్యాంకన నమూనా పేపర్‌–1 (ఎఫ్‌ఏ–1) పరీక్షలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్‌.అయూబ్‌ హుస్సేన్‌ పరీక్షల నిర్వహణకు సంబంధించిన తుది షెడ్యూల్‌, మార్గదర్శకాలను జారీ చేశారు. 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ఈ నెల 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రాథమిక తరగతులకు సోమవారం తెలుగు, గణితం, 18న ఇంగ్లిష్‌, పర్యావరణ శాస్త్రం, 19న ఓఎస్‌ఎస్‌సీ పరీక్షలు నిర్వహిస్తారు.

6–10 తరగతులకు ఇలా..

ఆరు, ఏడు, ఎనిమిది తరగతులకు సోమవారం తెలుగు, గణితం, 18న హిందీ, సాధారణ శాస్త్రం, 19న ఇంగ్లిష్‌, సామాజిక శాస్త్రం, 20న ఓఎస్‌ఎస్‌సీ, జీవశాస్త్రం పరీక్షలు ఉంటాయి. 9, 10 తరగతులకు సోమవారం తెలుగు, గణితం, 18న హిందీ, భౌతిక శాస్త్రం, 19న ఇంగ్లిష్‌, సామాజిక శాస్త్రం, 20న ఓఎస్‌ఎస్‌సీ–1, ఓఎస్‌ఎస్‌సీ–2, జీవశాస్త్రం పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి 10.45 వరకు, 11 నుంచి 12.15 వరకు, మధ్యాహ్నం 1.15 నుంచి 2.30 వరకు, 2.45 నుంచి 4 గంటల వరకు నిర్వహిస్తారు.

ప్రశ్నపత్రాల భద్రతపై ప్రత్యేక దృష్టి..

1 నుంచి 5 తరగతులకు సంబంధించిన ప్రశ్నపత్రాలను పాఠశాల సముదాయాల్లో, 6 నుంచి 10 తరగతుల ప్రశ్నపత్రాలను మండల వనరుల కేంద్రాల్లో (ఎంఆర్‌సీ) భద్రపరిచారని డీఈఓ తెలిపారు. ఎంఈఓలు, పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు ప్రశ్నపత్రాలకు సంరక్షకులుగా వ్యవహరించాలని, ప్రతి పరీక్షా సెషన్‌కు గంట ముందు మాత్రమే సంబంధిత పాఠశాలలకు ప్రశ్నపత్రాల బండిళ్లను అందజేయాలని సూచించారు.

అక్కడమ్మాయి.. ఇక్కడబ్బాయి

కళ్యాణదుర్గం రూరల్‌: లండన్‌ అమ్మాయి.. కళ్యాణదుర్గం అబ్బాయి ప్రేమ వివాహంతో ఒక్కటయ్యారు. కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లికి చెందిన రఘురామప్రసాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. ఉద్యోగరీత్యా 2019లో లండన్‌కు వెళ్లాడు. అక్కడ డాక్టర్‌గా పనిచేస్తున్న సుజాన్‌లూయిస్‌ రిప్‌ అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. అలా ఆ పరిచయం కాస్తా వారి మధ్య ప్రేమకు దారితీసింది. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలూ అంగీకారం తెలపడంతో పెళ్లికి మార్గం సుగమమైంది. ఆదివారం బెంగళూరులోని ఓ రిసార్ట్‌లో ఇరుకుటుంబాల సమక్షంలో రఘురామప్రసాద్‌, సుజాన్‌లూయిస్‌ రిప్‌ భారతీయ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement