రాయదుర్గం/ బొమ్మనహాళ్/ కణేకల్లు: జిల్లాకు వరప్రదాయిని తుంగభద్ర జలాశయం. సాగు, తాగునీటికి ఈ డ్యామ్ ఎంతగానో ఉపయోగపడుతోంది. ఎల్–నినో ప్రభావం కారణంగా తుంగభద్ర నదీపరివాహక ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొని ముందస్తు వర్షాలు కురవలేదు. ఆ తర్వాత భారీ వర్షాలు రావడంతో డ్యామ్‌లో పది రోజుల నుంచి ఇన్‌ఫ్లో పుంజుకుంది.డ్యామ్‌లో ప్రస్తుతం 92 టీఎంసీల నీరు నిల్వ ఉండి.. 25 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. హెచ్చెల్సీ నీరు తాగునీటికెంత అవసరమో.. సాగుకు కూడా అంతే అవసరం. జిల్లాలోని కణేకల్లు, బొమ్మనహాళ్, డీ హీరేహాళ్, విడపనకల్లు, గుంతకల్లు ప్రాంతాల్లోని తరి భూములకు హెచ్చెల్సీ నీరే ఆధారం. ఈ భూములకు మరో ప్రత్యామ్నాయ సాగునీటి వసతి లేదు. ప్రధానంగా హెచ్‌ఎల్‌ఎంసీ కింద కణేకల్లు, బొమ్మనహాళ్, డీ హీరేహాళ్, విడపనకల్లు మండలాల్లో సుమారు 36 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో తరి భూమి 29 వేల ఎకరాలుండగా... ఆరుతరి భూమి 7వేల ఎకరాలుంది. టీబీ డ్యామ్‌కు వరదనీరొస్తాయనే ఆశతో రైతులు ముందుగానే నెలరోజుల క్రితం బోర్ల కింద వరినారు, మిరప నార్లు పోసుకొన్నారు. ఆయకట్టుకు నీరిస్తే నాట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
వరినారు ముదిరిపోతుందనే ఆందోళన..
వరినారు 30 లేదా 40 రోజుల్లో పొలాల్లో నాట్లు వేయాలి. ప్రస్తుతం కణేకల్లు, బొమ్మనహళ్ మండలాల్లోని కణేకల్లు, కె.మారెంపల్లి, యర్రగుంట, ఉద్దేహాళ్, బొమ్మనహాళ్, శ్రీధరఘట్ట, గోనేహాళ్, లింగదహాళ్, దేవగిరి క్రాస్ తదితర గ్రామాల్లో రైతులు వరినారు పోసుకొని నెలరోజులవుతోంది. మరి కొన్ని రోజులు పోతే ఈ నారు ముదిరిపోయి పనికి రాకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎకరా విస్తీర్ణంలో వరినారు సాగుకు ఒక్కో రైతుకు రూ.20వేల వరకు ఖర్చయ్యింది. ఆయకట్టుకు సాగునీరివ్వకపోతే ప్రధానంగా నాలుగు మండలాల్లోని రైతులు భారీగా నష్ట పోవాల్సి వస్తుంది. తాగునీటితోపాటు సాగునీటికి కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
2017 పరిస్థితి పునరావృతం..
సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం అంటే 2017లో టీబీ డ్యామ్ గడ్డుకాలం ఎదుర్కొంది. తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు నెలకొని డ్యామ్ నిండలేదు. ఆ సమయంలో కూడా ఆయకట్టుకు నీరివ్వలేమని అధికారులు కరాకండిగా చెప్పారు. అయితే రైతులు సాగునీళ్ల కోసం పట్టుబట్టడంతో హెచ్‌ఎల్‌ఎంసీ పరిధిలోని ఆయకట్టులో సాగుకు జిల్లా అధికార యంత్రాంగం నీరిచ్చింది. కణేకల్లు, బొమ్మనహాళ్, డీ హీరేహాళ్, విడపనకల్లు ప్రాంతాల్లో ఆయకట్టుకు సాగునీరొచ్చింది. ఇప్పుడు కనీసం హెచ్‌ఎల్‌ఎంసీ (హై లెవల్ మెయిన్ కెనాల్) పరిధిలోని ఆయకట్టుకై నా నీరివ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
బొమ్మనహాళ్: టీబీ డ్యాం నుంచి హెచ్చెల్సీ ద్వారా ఆయకట్టు భూములకు వెంటనే సాగునీటిని విడుదల చేయాలని వైఎస్సార్‌సీపీ రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం బొమ్మనహాళ్ మండలం గోనేహాళ్ క్రాస్ సమీపంలోని హెచ్చెల్సీని రైతులు, వైఎస్సార్‌సీపీ నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం స్ధానిక విలేకరులతో మాట్లాడుతూ తుంగభద్ర జలాశయంలో ప్రస్తుతం 92 టీఎంసీల నీరు నిల్వ ఉండి 25 వేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో నమోదవుతున్నా హెచ్చెల్సీ ద్వారా తాగునీటికి మాత్రమే సరఫరా చేస్తున్నారని తెలిపారు. కర్ణాటకలో ఆయకట్టు రైతులకు నవంబర్ 11 వరకు రోజుకు 1,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రైతులకు మాత్రం సాగునీరు ఎప్పుడు విడుదల చేస్తారో ఇంతవరకు చెప్పలేదన్నారు. ఈ నెల 19వ తేదీకల్లా డిస్టిబ్యూటరీ కాలువలకు నీరు విడుదల చేయకపోతే 20వ తేదీన వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి భారీ ధర్నా చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు ఎంసీహెచ్ రాజ్‌కుమార్, ఉషారాణి, మండల కన్వీనర్లు బ్రహ్మానందరెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, సీనియర్ నాయకులు వెంకటాక్షిపతిరెడ్డి, ఆలేరి రాజగోపాల్‌రెడ్డి, పైనేతి తిమ్మప్ప చౌదరి, పాటిల్ నాగిరెడ్డి, పరమేశ్వర, మారెంపల్లి మారెన్న, కళేకుర్తి జమరామ్‌రెడ్డి, మల్లికార్జున, ఎల్.లోకేష్, హళ్లి నాగరాజు, మాక్బూల్ బాషా, ఆర్కే బద్రి, ఆది సదుర్గు చంద్రశేఖర్‌రెడ్డి, యండ్రకాయల వన్నూరప్ప, ప్రకాష్, ఆనంద్, జగన్, రామ్‌చరణ్ తదితరులు పాల్గొన్నారు.
తుంగభద్ర డ్యామ్‌లో నీరు పుష్కలంగా ఉంది. అయినా ఆయకట్టుకు నీరివ్వకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పది రోజుల క్రితం డ్యామ్ పరిస్థితి అధ్వానంగా ఉండేది. ఆ తర్వాత ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలతో
తుంగభద్ర డ్యామ్ పరిస్థితి మెరుగుపడింది. పొరుగున ఉన్న కర్ణాటకలో హెచ్చెల్సీ కింద 90 రోజులపాటు ఆయకట్టుకు నీరిచ్చేందుకు అక్కడ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఏపీలో చంద్రబాబు సర్కారు మాత్రం ఆయకట్టుకు నీరిచ్చే విషయంలో మీనమేషాలు లెక్కిస్తుండటం పట్ల రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
టీబీ డ్యామ్‌లో గరిష్టస్థాయిలో నీటి నిల్వ
సాగునీటి విడుదలపై
ఆయకట్టుదారుల ఆశలు
ముందస్తుగా బోర్లకింద
వరినారు పోసుకున్న రైతులు
హెచ్చెల్సీ ఆయకట్టుకు నీరివ్వకుంటే ధర్నా


