బ్రహ్మసముద్రం/కళ్యాణదుర్గం: అక్రమ రిజిస్ట్రేషన్లు, భూదందాలకు కళ్యాణదుర్గం సబ్ రిజి స్ట్రార్ కార్యాలయం అడ్డాగా నిలుస్తోంది. ఇక్కడ లంచం ఇస్తే చాలు నిబంధనలకు విరుద్ధమైనా సరే రిజిస్ట్రేషన్లు చకచకా చేసేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక వేళ ఎప్పుడైనా ఈ వ్యవహారం బయటకు తెలిసి రచ్చ అయితే అప్పుడు రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అండదండలతోనే ఆ పార్టీ నాయకులు అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం నిరాటంకంగా సాగిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నిబంధనలకు తూట్లు..
బ్రహ్మసముద్రం మండలం వెస్ట్ కోడిపల్లి, ఎర్ర కొండాపురం గ్రామాల్లో భూ అక్రమ రిజిస్ట్రేషన్లు తాజాగా బయటపడ్డాయి. ఈ తతంగంపై అటు సబ్ రిజిస్ట్రార్, ఇటు రెవెన్యూ అధికారులు అన్నీ తెలిసినా తమకేమీ తెలియదన్నట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే సబ్ రిజిస్ట్రార్ టీడీపీ నేతల వద్ద ముడుపులు తీసుకుని అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి.. ఇప్పుడు మౌనంగా ఉన్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తప్పని తెలిసినా రిజిస్ట్రేషన్లకు సై..
అధికారం అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులు ఫేక్ సర్టిఫికెట్లతో ఇతరుల భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. ఎర్ర కొండాపురంలో సర్వేనంబర్ 38–ఏలో 5 ఎకరాలు నాగిరెడ్డిపల్లికి చెందిన ఉజ్జెప్పగారి బొజ్జక్క (నాగిరెడ్డిపల్లి తాజా మాజీ టీడీపీ సర్పంచు కురబ సందీప్ కారు డ్రైవర్ రాముకు స్వయానా సోదరి) పేరున అక్రమ రిజిస్ట్రేషన్ అయ్యింది. వేపులపర్తి మహదేవమ్మ (నాగిరెడ్డిపల్లికి చెందిన టీడీపీ 5వ వార్డు సభ్యుడు కురబ మల్లికార్జునకు స్వయానా సోదరి) పేరున సర్వే నంబర్ 38–బీలో 1.67 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేశారు. వాస్తవానికి సదరు భూమి ఆర్.లక్ష్మిదేవమ్మ భర్త భీమసేనాచారి (బ్రాహ్మణ)లకు చెందినది. కానీ ఉజ్జప్ప గారి బొజ్జక్క, వేపులపర్తి మహదేవమ్మ అనే కురుబ కులస్తులను రక్త సంబంధీకులుగా తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 12–05–2026 న రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
అక్రమార్కులను
కాపాడుకునేందుకు పాట్లు
వెస్ట్ కోడిపల్లిలో సాగిన అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం గురించి ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో అక్రమార్కులు కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్లు రద్దు చేయించుకున్న విషయం విదితమే. ఇదే బాటలో ఎర్రకొండాపురం అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దుకు కూడా అక్రమార్కులు కార్యాలయానికి క్యూ కడుతున్నారు. అక్రమ రిజిస్ట్రేషన్లలో ఇరుక్కున్న టీడీపీ నేతలను కాపాడుకునేందుకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నానా తంటాలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై సబ్ రిజిస్ట్రార్ రామ్మోహన్‌ను వివరణ కోరేందుకు ‘సాక్షి’ పలుమార్లు ఫోన్లో ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.
కళ్యాణదుర్గం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో యథేచ్ఛగా అక్రమ రిజిస్ట్రేషన్లు
లంచమిస్తే ఏ భూమికై నా రిజిస్ట్రేషన్ చేసేస్తారు
టీడీపీ నేతల అక్రమాలకు పుష్కలంగా అండదండలు


