అనంతపురం ఎడ్యుకేషన్: విద్యాశాఖలో క్రమశిక్షణ చర్యల విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారనే ఆరోపణలు ఉపాధ్యాయ వర్గాల నుంచి వెల్లువెత్తుతున్నాయి. తమ సమస్యల పరిష్కారం కోసం కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించిన ఉపాధ్యాయ సంఘాల నాయకులపై కఠినంగా వ్యవహరించిన అధికారులు.. అధికార పార్టీకి అనుకూలంగా ప్రైవేట్ కార్యక్రమాల్లో బహిరంగంగా పాల్గొంటున్న ఉపాధ్యాయుల విషయంలో ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సీసీఏ నిబంధనలు అందరికీ ఒకేలా వర్తించవా? అన్న చర్చ ప్రస్తుతం ఉపాధ్యాయ వర్గాల్లో జరుగుతోంది. ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు ఇబ్బందికరంగా మారిన టెట్ నిబంధనలను రద్దు చేయాలని కొందరు ఉపాధ్యాయ సంఘాల నాయకులు కేంద్ర మంత్రిని కలిశారు. తమ సమస్యను వివరించి వినతిపత్రం సమర్పించడమే వారు చేసిన పని అని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారాన్ని క్రమశిక్షణా ఉల్లంఘనగా పరిగణించి ఐదుగురు ఉపాధ్యాయ సంఘాల నాయకులను సస్పెండ్ చేయడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
డీఎస్సీ కార్యక్రమం.. ఎవరి ఆధ్వర్యంలో..?
డీఎస్సీ–2025లో అవకతవకలు జరిగాయంటూ బాధితుల తరఫున ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమైన నేపథ్యంలో.. వాటిని ఖండించేలా ఇటీవల కర్నూలులో డీఎస్సీ–25 టీచర్లతో ఓ కార్యక్రమం నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. డీఎస్సీ ప్రక్రియ పక్కాగా జరిగిందని చెప్పించే ప్రయత్నంలో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వహించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది ప్రైవేట్‌గా నిర్వహించిన కార్యక్రమమేనని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు జిల్లాలోని డీఎస్సీ–2025 ఉపాధ్యాయులను సమీకరించి కర్నూలుకు తీసుకెళ్లడంలో కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే ఎఫ్‌ఏసీ ఎంఈఓగా కళ్యాణదుర్గం ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న మరో వ్యక్తి, గార్లదిన్నె మండలంలో పని చేస్తున్న మరో టీచరు కూడా ఈ కార్యక్రమంలో కీలకంగా వ్యవహరించారని చెబుతున్నారు. మరి వీరిపై చర్యలు మాత్రం శూన్యం.
అధికార పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటే ఉదాసీనత
టెట్ రద్దు కోరినందుకు
సస్పెన్షన్ చేస్తారా?
ద్వంద్వ వైఖరిపై భగ్గుమన్న టీచర్లు


