ప్రకాశం ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పదే పదే విజ్ఞప్తులు వింటూనే ఉంటాం.. ప్రకటనలు చూస్తూనే ఉంటాం. వీటిపై పోలీస్ వ్యవస్థ కూడా కఠినంగా స్పందిస్తూనే ఉంటుంది. కానీ ఏపీలో మాత్రం గంజాయి యధేచ్ఛగా సరఫరా అవుతుందనడానికి పోలీస్ కారే సాక్ష్యంగా నిలిచింది. ప్రకాశం జిల్లా అద్దంకిలో పోలీసుల కారులో గంజాయి సరఫరా చేస్తున్న ఘటన తాజాగా వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళితే.. అద్దంకి సమీపంలో బల్లికురవ ఎస్సై నాగరాజు, సంతమాగుళూరు ఎస్సై నాగమల్లేశ్వరావు ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్‌కు గురైంది. ఓ ఆటోను ఢీకొట్టింది పోలీస్ కారు. దాంతో అక్కడకు స్థానికులు చేరుకున్నారు. కారును పరిశీలించగా భారీ మొత్తంలో గంజాయి పోలీస్ కారులో ఉండటాన్ని గుర్తించారు. కారు పరిశీలించడానికి స్థానికులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో స్థానికులు, పోలీసుల మధ్య ఘర్షణ వాతావారణం చోటు చేసుకుంది. ఈ సమాచారం అందుకున్న అద్దంకి సీఐ ఘటనా స్థలికి చేరుకున్నారు.

అయితే పోలీసులు కారు డిక్కీలో గంజాయి ఉండటం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఇద్దరు ఎస్సైలు సివిల్ డ్రెస్‌లో ఉండగా ఇద్దరు ఎస్సైలను అక్కడ నుండీ పంపించేశారు పోలీసులు. స్విఫ్ట్ డిజైర్ కారులో బల్లికురవ నుండి అద్దంకి వస్తుండగా ఈ ఎపిసోడ్ వెలుగచూసింది. ఇక ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. అక్కడ చేరుకున్న సీఐ సైతం కారు డిక్కీని ఓపెన్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.


