సాక్షి, గుంటూరు: గుంటూరు కలెక్టర్ అశుతోష్ శ్రీవత్సవను కలిసిన రాజధాని రైతులు.. బలవంతపు భూ సేకరణపై వినతిపత్రం అందజేశారు. అనంతరం రైతులు మీడియాతో మాట్లాడుతూ.. సీడ్ యాక్సిస్ రోడ్లకు భూములిచ్చి సహకరించామని.. భూ సేకరణకు మాత్రం తాము వ్యతిరేకమని తేల్చి చెప్పారు. అభివృద్ధి అంటే జీవన ప్రమాణాలు మెరుగుపరచడం.. అంతేగానీ పెద్దపెద్ద భవనాలు నిర్మించడం కాదన్నారు.

‘‘మా భూములు బలవంతంగా లాక్కోవడానికి ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. మా ఊర్లో 3 వేల ఎకరాలకు పైగా భూమి ఉంది. సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. ల్యాండ్ అక్విజేషన్‌పై మా అభ్యంతరం చెప్పాం. మేము భూములు ఇవ్వం. ఉండవల్లి రైతులను పరామర్శించడానికి వచ్చే వారిపై దాడులు చేయడం దారుణం’’ అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతులు, రైతు పరిరక్షణ కమిటీ నేతలపై టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారు. టీడీపీ కార్యకర్తలు, ఇసుక మాఫియా.. రైతు పరిరక్షణ కమిటీ నేతల కారుపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. పచ్చ గూండాల దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో, అక్కడ వాగ్వాదం, తోపులాట జరిగింది. రైతులను పరామర్శించకుండా పరిరక్షణ కమిటీ సభ్యులను టీడీపీ గూండాలు అడ్డుకున్నారు.


