1987లో ‘ఊరేగింపు’ సినిమాతో నటుడిగా వెండితెర ప్రవేశం చేసిన కృష్ణేశ్వరరావు మరో ఏడాదిలోనే ప్రచండ భారతం సినిమాకు మాటల రచయితగా పరిచయమయ్యారు. కాలచక్రం, భద్రాచలం, కామ్రేడ్, పిలిస్తే పలుకుతా, మౌనం, సూర్యపుత్రులు, కూతురుకోసం, వీరతెలంగాణ, భీముడు వంటి పది సినిమాలకు సంభాషణలు సమకూర్చారు. అంకురం, శ్రీరాములయ్య, ఢమరుకం సినిమాలకు స్క్రీన్‌ప్లే వర్క్ చేశారు. నటుడుగా తాను మాటలు రాసిన సినిమాలతో పాటు గోపిగోపికా గోదావరి, సరదాగా కాసేపు, భీమిలి కబడ్డీ జట్టు, ఎర్ర సముద్రం, కూతురుకోసం, వీరతెలంగాణ, వసుంధర నిలయం, వెన్నెల్లో హాయ్ హాయ్, డాక్టర్ ప్రసాద్ కేరాఫ్ సితార, వశం, చందమామ కథలు, గుంటూరు టాకీస్, ఇటీవలే విడుదలైన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాల్లో నటించారు. కృష్ణేశ్వరరావు రంగస్థల నటుడుగా ఎన్నో వ్యక్తిగత బహుమతులు పొందారు. వీటితోపాటు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి పురస్కారం (రచయితగా), ఉత్తమ రచయితగా రజత నంది, యువకళావాహిని బంగారు పతకం, సంపద నాటికకు భారతీయం–ఎన్టీఆర్ కళాపరిషత్ రూ.లక్ష నగదు బహుమతి గెలుసుకున్నారు. చైన్నెలోని ఆంధ్రా సోషల్, కల్చరల్ అసోసియేషన్ బంగారు పతకం అందుకున్నారు. సినిమాలకొస్తే, ‘కూతురుకోసం’ ఉత్తమ విలన్‌గా భరతముని అవార్డు, చందమామ కథలు సినిమాలో ఉత్తమ క్యారెక్టర్ నటుడుగా నంది అవార్డు స్వీకరించారు. తెనాలిలో ప్రఖ్యాత సినీనటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు విశిష్ట పురస్కారాన్ని అందుకున్నారు.


