గుంటూరు మెడికల్: ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్లు పాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి చెప్పారు. మంగళవారం జిల్లాలోని పట్టణ, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల ఫార్మసీ అధికారుల సమీక్ష సమావేశం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో నిర్వహించారు. డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ వ్యాక్సిన్లను నిర్దేశిత ఉష్ణోగ్రతలో నిరంతరం నిల్వ చేయాలన్నారు. సాధారణంగా ఐఎల్‌ఆర్‌లో వ్యాక్సిన్లను రెండు నుంచి 8 డిగ్రీల సెంట్రీగ్రేడ్ మధ్య ఉంచాలని ఆదేశించారు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ఐఎల్‌ఆర్ ఉష్ణోగ్రతల నమోదు చేసి, ఉష్ణోగ్రత రికార్డులను క్రమం తప్పకుండా పరిశీలించాలన్నారు. కాలంచెల్లిన వ్యాక్సిన్లను గమనించి ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశించారు. వ్యాక్సిన్‌లకు సంబంధించి స్టాక్ రిజిస్టర్, ఇండెంట్, ఇష్యూ రికార్డులు సక్రమంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో డెప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ అన్నపూర్ణ, వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ శ్రీవల్లి, ఫార్మసీ అధికారి సీహెచ్.రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి


